కంటెంట్‌కు వెళ్లు

డబ్బు అన్ని రకాల చెడుకు కారణమా?

డబ్బు అన్ని రకాల చెడుకు కారణమా?

బైబిలు ఇచ్చే జవాబు

 కాదు. డబ్బు చెడ్డదని, లేదా అన్ని రకాల చెడుకు డబ్బే కారణమని బైబిలు చెప్పట్లేదు. కొంతమంది, “డబ్బే అన్ని రకాల చెడుకు కారణం” అని అంటుంటారు. కానీ నిజానికి, బైబిలు ఇలా చెప్తుంది: “డబ్బు మీది మోజు అన్నిరకాల చెడ్డవాటికి మూలం.”—1 తిమోతి 6:10.

 డబ్బు గురించి బైబిలు ఏం చెప్తుంది?

 డబ్బును తెలివిగా వాడితే దానివల్ల ఉపయోగాలు ఉంటాయని, అది కొన్నిసార్లు “రక్షణగా” కూడా ఉంటుందని బైబిలు చెప్తుంది. (ప్రసంగి 7:12) అంతేకాదు, ఉదారంగా చేసే సహాయాన్ని బైబిలు మెచ్చుకుంటుంది. అది డబ్బు సహాయం కావచ్చు, ఇంకేదైనా కావచ్చు.—సామెతలు 11:25.

 అదే సమయంలో, డబ్బే జీవితం కాకూడదని బైబిలు హెచ్చరిస్తుంది. అది ఇలా చెప్తుంది: “డబ్బును ప్రేమించకండి, ఉన్నవాటితో సంతృప్తిగా జీవించండి.” (హెబ్రీయులు 13:5) దీన్నిబట్టి డబ్బును దాని స్థానంలో ఉంచాలని, దాని వెనకాల పరుగెత్తకూడదని అర్థమౌతుంది. బదులుగా ఆహారం, బట్టలు, ఇల్లు వంటి కనీస అవసరాలతో మనం తృప్తిపడాలి.—1 తిమోతి 6:8.

 డబ్బు మీది మోజు ప్రమాదకరమని బైబిలు ఎందుకు చెప్తుంది?

 అత్యాశపరులు శాశ్వత జీవితాన్ని సొంతం చేసుకోలేరు. (ఎఫెసీయులు 5:5) ఒక కారణం ఏంటంటే, అత్యాశ అనేది విగ్రహపూజతో లేదా అబద్ధ ఆరాధనతో సమానం. (కొలొస్సయులు 3:5) ఇంకో కారణం ఏంటంటే, చాలావరకు అత్యాశపరులు తాము కోరుకున్నది దక్కించుకోవడం కోసం, మంచి-చెడ్డ పట్టించుకోకుండా ఎంతకైనా తెగిస్తారు. ఉదాహరణకు వాళ్లు బ్లాక్‌ మెయిల్‌, దోపిడీ, మోసం, కిడ్నాప్‌, లేదా హత్య వంటి నేరాలు చేసే అవకాశం ఉంది. అందుకే సామెతలు 28:20 ఇలా చెప్తుంది: “ధనవంతుడు అవ్వడానికి తొందరపడేవాడు నిర్దోషిగా ఉండడు.”

 డబ్బు మీది మోజు వల్ల మనం పైన చెప్పినలాంటి నేరాలు చేయకపోవచ్చు, కానీ దానివల్ల హాని అయితే ఉంది. దాని గురించే బైబిలు ఇలా చెప్తుంది: “ధనవంతులు అవ్వాలని నిశ్చయించుకున్నవాళ్లు ప్రలోభంలో, ఉరిలో, ఎన్నో హానికరమైన వెర్రి కోరికల్లో చిక్కుకుంటారు.”—1 తిమోతి 6:9.

 డబ్బు విషయంలో బైబిలు ఇచ్చే సలహాల్ని పాటిస్తే ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి?

 డబ్బు కోసం మన నీతి-నిజాయితీల్ని, విలువల్ని వదిలేసుకోకుండా ఉంటే మన గౌరవం మనకుంటుంది, అలాగే దేవుని అనుగ్రహం, మద్దతు ఉంటాయి. దేవుణ్ణి సంతోషపెట్టాలని ఎవరైతే నిజాయితీగా ప్రయత్నిస్తారో, వాళ్లకు దేవుడు ఇలా మాటిస్తున్నాడు: “నిన్ను ఎప్పుడూ విడిచిపెట్టను, నిన్ను ఎన్నడూ వదిలేయను.” (హెబ్రీయులు 13:5, 6) ఆయన ఇంకా ఇలా చెప్తున్నాడు: “నమ్మకమైనవాడు ఎన్నో దీవెనలు పొందుతాడు.”—సామెతలు 28:20.