కంటెంట్‌కు వెళ్లు

నరకం అంటే ఏమిటి? ఎప్పటికీ హింసలు పెట్టే స్థలమా?

నరకం అంటే ఏమిటి? ఎప్పటికీ హింసలు పెట్టే స్థలమా?

బైబిలు ఇచ్చే జవాబు

 కొన్ని బైబిలు అనువాదాలు “షియోల్‌” అనే హీబ్రూ పదాన్ని, “హెడిస్‌” అనే గ్రీకు పదాన్ని “నరకం” అని అనువదించాయి. ఆ రెండు పదాలు మానవజాతి సామాన్య సమాధిని సూచిస్తున్నాయి. (కీర్తన 16:10; అపొస్తలుల కార్యములు 2:27) చాలామంది ప్రజలు నరకం అంటే, పక్కన ఉన్న చిత్రంలో చూపించినట్లుగా ఉంటుందని నమ్ముతారు. కానీ బైబిలు అలా బోధించడం లేదు.

  1.   నరకంలో ఉన్నవాళ్లకు ఏమీ తెలీదు, కాబట్టి వాళ్లు బాధను అనుభవించలేరు. “పాతాళమునందు పనియైనను ఉపాయమైనను తెలివియైనను జ్ఞానమైనను లేదు.”—ప్రసంగి 9:10.

  2.   మంచివాళ్లు నరకానికి వెళ్తారు. నమ్మకమైన సేవకులైన యాకోబు, యోబు అక్కడికి వెళ్లాలని కోరుకున్నారు.—ఆదికాండము 37:35; యోబు 14:13.

  3.   పాపానికి శిక్ష మరణమేగానీ, నరకాగ్నిలో హింసించబడడం కాదు. “చనిపోయినవాడు పాపవిముక్తుడని తీర్పు పొంది యున్నాడు.”—రోమీయులు 6:7.

  4.   నిత్యమూ బాధించడమనేది దేవుని న్యాయానికి విరుద్ధమైనది. (ద్వితీయోపదేశకాండము 32:4) మొదటి మానవుడైన ఆదాము తప్పు చేసినప్పుడు, అతను ఉనికిలో లేకుండా పోతాడని దేవుడు చెప్పాడు. దేవుడు ఆదాముతో ఇలా అన్నాడు, “నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదువు.” (ఆదికాండము 3:19) ఒకవేళ దేవుడు నిజంగా ఆదామును నరకానికి పంపించివుంటే, దేవుడు అబద్ధం చెప్పినట్లు అయ్యుండేది.

  5.   నరకంలో బాధించాలని దేవుడు కనీసం ఊహించడు కూడా. దేవుడు ప్రజల్ని నరకంలో శిక్షిస్తాడనే ఆలోచన బైబిలు చెప్తున్నదానికి విరుద్ధంగా ఉంది. బైబిలు ఇలా చెప్తుంది, “దేవుడు ప్రేమాస్వరూపి.”—1 యోహాను 4:8; యిర్మీయా 7:31.