కంటెంట్‌కు వెళ్లు

మద్యం గురించి బైబిలు ఏమి చెబుతుంది? తాగడం పాపమా?

మద్యం గురించి బైబిలు ఏమి చెబుతుంది? తాగడం పాపమా?

బైబిలు ఇచ్చే జవాబు

 మద్యాన్ని మితంగా తాగడం పాపమేమీ కాదు. ద్రాక్షారసం, మనం జీవితాన్ని ఆస్వాదించడానికి దేవుడు ఇచ్చిన బహుమానమని బైబిలు చెబుతుంది. (కీర్తన 104:14, 15; ప్రసంగి 3:13; 9:7) ద్రాక్షారసంలోని ఔషధ గుణాల గురించి కూడా బైబిలు మాట్లాడుతుంది.—1 తిమోతి 5:23.

 యేసు భూమ్మీద ఉన్నప్పుడు ద్రాక్షారసాన్ని తాగాడు. (మత్తయి 26:29; లూకా 7:34) ఆయన ఒక పెళ్లి విందులో నీళ్లను ద్రాక్షారసంగా మార్చాడు, అది ఆ కొత్త జంటకు ఓ పెద్ద గిఫ్ట్‌ అయింది. యేసు చేసిన ఈ అద్భుతం గురించి అందరికీ తెలుసు.—యోహాను 2:1-10.

అతిగా తాగడం వల్ల వచ్చే ప్రమాదాలు

 బైబిలు, ద్రాక్షారసం వల్ల వచ్చే ప్రయోజనాల గురించి చెప్తూనే, అతిగా తాగడాన్ని, తాగుబోతుతనాన్నీ ఖండిస్తోంది. కాబట్టి, మద్యం తాగాలనుకున్న క్రైస్తవుడు మితంగా తాగాలి. (1 తిమోతి 3:8; తీతు 2: 2, 3) మనం ఎందుకు అతిగా తాగకూడదో తెలుసుకోవడానికి బైబిలు కొన్ని కారణాలు ఇస్తుంది.

  •   అది మన ఆలోచనా సామర్థ్యాన్ని, నిర్ణయాలు తీసుకునే శక్తిని బలహీనపరుస్తుంది. (సామెతలు 23:29-35) మద్యంతో తన శరీరాన్ని పాడుచేసుకున్న వ్యక్తి బైబిలు ఇచ్చిన ఈ ఆజ్ఞను పాటించలేడు: “పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి. ... ఇట్టి సేవ మీకు యుక్తమైనది [‘మీ ఆలోచనా సామర్థ్యాన్ని ఉపయోగించి పవిత్రసేవ చేయండి,’ NW].”—రోమీయులు 12:1.

  •   అతిగా తాగితే హద్దులు మర్చిపోతాం, “మంచి పనే చేయాలన్న ప్రేరణ” కోల్పోతాం.—హోషేయ 4:11, NW; ఎఫెసీయులు 5:18.

  •   దానివల్ల పేదరికం వస్తుంది, పెద్దపెద్ద రోగాలు కూడా వస్తాయి.—సామెతలు 23:21, 31, 32.

  •   అతిగా తాగడం, తాగుబోతుతనం దేవునికి బాధ కలిగిస్తాయి.—సామెతలు 23:20; గలతీయులు 5:19-21.

ఎంత తాగితే అతిగా తాగినట్టు?

 ఒక వ్యక్తి తన తాగుడు వల్ల, తనకు లేదా ఇతరులకు హాని కలిగే పరిస్థితి తీసుకొస్తే అతను అతిగా తాగినట్టే. బైబిలు తాగుబోతుతనాన్ని స్పృహ కోల్పోవడంతో ముడిపెట్టడం లేదు గానీ, మైకంలో ఉండడం, తూలుతూ నడవడం, గొడవలకు దిగడం, మత్తుగా మాట్లాడడం వంటి ప్రవర్తనతో ముడిపెడుతోంది. (యోబు 12:25; కీర్తన 107:27; సామెతలు 23:29, 30, 33) అతిగా తాగకుండా తమను తాము కంట్రోల్‌ చేసుకునేవాళ్లు కూడా “మత్తువలన ... మందముగా” తయారై దానివల్ల వచ్చే చెడు పరిణామాలను ఎదుర్కోవలసి రావచ్చు.—లూకా 21:34, 35.

పూర్తిగా మానేయాలి

 క్రైస్తవులు మద్యపానాన్ని పూర్తిగా మానేయవలసిన కొన్ని సందర్భాల గురించి బైబిలు చెప్తుంది:

  •   దానివల్ల ఇతరులు అభ్యంతరపడే అవకాశం ఉంటే.—రోమీయులకు 14:21.

  •   మద్యపానం స్థానిక చట్టరీత్యా నేరమైతే.—రోమీయులకు 13:1.

  •   కొంచెమే తాగుదామనుకున్నా, కంట్రోల్‌ చేసుకోలేకపోతుంటే. మద్యానికి బానిసలై ఆ వ్యసనంతో బాధపడేవాళ్లు గట్టి చర్యలు తీసుకోవాలి.—మత్తయి 5:29, 30.