కంటెంట్‌కు వెళ్లు

హార్‌మెగిద్దోను యుద్ధం అంటే ఏమిటి?

హార్‌మెగిద్దోను యుద్ధం అంటే ఏమిటి?

బైబిలు ఇచ్చే జవాబు

 హార్‌మెగిద్దోను యుద్ధం అంటే మానవ పరిపాలకులతో దేవుడు చేసే చివరి యుద్ధం. ప్రభుత్వాలు, వాటికి మద్దతు ఇచ్చేవాళ్లు దేవుని పరిపాలనకు ఇప్పటికీ లోబడకుండా ఆయనకు ఎదురు తిరుగుతున్నారు. (కీర్తన 2:2) హార్‌మెగిద్దోను యుద్ధం మానవ ప్రభుత్వాలను పూర్తిగా తీసేస్తుంది.—దానియేలు 2:44.

 “హార్‌మెగిద్దోను” అనే పదం బైబిల్లో ఒకేఒక్కసారి, ప్రకటన 16:14-16 లో కనిపిస్తుంది. ‘సర్వాధికారియైన దేవుని మహాదినమున జరుగు యుద్ధమునకు లోకమంతట ఉన్న రాజులు, హెబ్రీభాషలో హార్‌మెగిద్దోనను చోటుకు’ పోగవుతారని ప్రకటన పుస్తకం ముందే చెప్తుంది.—ప్రకటన 16:14.

 హార్‌మెగిద్దోనులో ఎవరు యుద్ధం చేస్తారు? పరలోక సైన్యంతో కలిసి యేసుక్రీస్తు దేవుని శత్రువులతో యుద్ధం చేసి గెలుస్తాడు. (ప్రకటన 19:11-16, 19-21) దేవుని అధికారాన్ని వ్యతిరేకించేవాళ్లు, దేవున్ని ఏమాత్రం లెక్కచేయనివాళ్లు ఆయన శత్రువులే.—యెహెజ్కేలు 39:7.

 హార్‌మెగిద్దోను యుద్ధం ఇప్పుడున్న ఇశ్రాయేలు, ఆ చుట్టుప్రక్క దేశాల్లో జరుగుతుందా? లేదు. హార్‌మెగిద్దోను యుద్ధం ఒక ప్రాంతంలో కాదుకానీ భూమంతా జరుగుతుంది.—యిర్మీయా 25:32-34; యెహెజ్కేలు 39:17-20.

 హార్‌మెగిద్దోనును కొంతమంది “అర్మగిద్దోను” అని కూడా అంటారు. హీబ్రూ భాషలో హార్‌మెగిద్దోన్‌ అనే పదానికి అర్థం “మెగిద్దో పర్వతం.” పూర్వం ఇశ్రాయేలు దేశంలో మెగిద్దో అనే పట్టణం ఉండేది. ఆ పట్టణం చుట్టుప్రక్కల పెద్దపెద్ద పోరాటాలు జరిగాయని చరిత్రలో ఉంది. వాటిలో కొన్ని యుద్ధాల గురించి బైబిల్లో కూడా ఉంది. (న్యాయాధిపతులు 5:19, 20; 2 రాజులు 9:27; 23:29) కానీ హార్‌మెగిద్దోను, ఒకప్పటి మెగిద్దో ప్రాంతాన్ని సూచించడం లేదు. ఆ ప్రాంతంలో పెద్ద పర్వతం ఏమి లేదు. అంతేకాదు, దేవునికి వ్యతిరేకంగా యుద్ధం చేసేవాళ్లందరు ఆ ప్రాంతానికి పక్కనున్న యెజ్రెయేలు మైదానంలో పట్టరు. కాబట్టి, లోకంలో ఉన్న దేశాలన్నీ దేవునికి వ్యతిరేకంగా సమకూడే సంఘటనను హార్‌మెగిద్దోను సూచిస్తుంది.

 హార్‌మెగిద్దోను యుద్ధం జరిగేటప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయి? దేవుడు తన శక్తిని ఎలా ఉపయోగిస్తాడో మనకు తెలీదు. అయితే ఆయన పురాతన కాలంలోలాగే ఇప్పుడు కూడా వడగండ్లు, భూకంపాలు, వరదలు, అగ్నిగంధకాలు, మెరుపులు, రోగాలు వంటివాటిని ఉపయోగించవచ్చు. (యోబు 38:22, 23; యెహెజ్కేలు 38:19, 22; హబక్కూకు 3:10, 11; జెకర్యా 14:12) అయోమయంలో దేవుని శత్రువుల్లో కొంతమంది ఒకరినొకరు చంపుకుంటారు. అయితే వాళ్లతో యుద్ధం చేస్తున్నది దేవుడేనని చివరకు అర్థం చేసుకుంటారు.—యెహెజ్కేలు 38:21, 23; జెకర్యా 14:13.

 హార్‌మెగిద్దోను యుద్ధంతో భూమి నాశనం అయిపోతుందా? అవ్వదు. ఎందుకంటే మనుషులు ఎప్పటికీ ఉండడానికే దేవుడు భూమిని చేశాడు. (కీర్తన 37:29; 96:10; ప్రసంగి 1:4) నిజానికి ఆ యుద్ధంలో మనుషులందరూ నాశనం అవ్వరు. బదులుగా, దేవున్ని ఆరాధించే ఒక “గొప్పసమూహము” ఈ యుద్ధం నుండి ప్రాణాలతో బయటపడుతుంది.—ప్రకటన 7:9, 14; కీర్తన 37:34.

 బైబిల్లో “లోకం” అనే పదం భూమినే కాకుండా, దేవున్ని ఎదిరించే చెడ్డ మనుషులను కూడా సూచిస్తుంది. (1 యోహాను 2:15-17) మరో మాటలో చెప్పాలంటే, హార్‌మెగిద్దోను యుద్ధంలో భూమి నాశనమౌతుంది అంటే చెడ్డవాళ్లందరు నాశనం అవుతారని అర్థం.—మత్తయి 24:3.

 హార్‌మెగిద్దోను యుద్ధం ఎప్పుడు జరుగుతుంది? హార్‌మెగిద్దోను యుద్ధంతో ముగిసే మహాశ్రమల గురించి మాట్లాడుతూ యేసు ఇలా అన్నాడు: “ఆ దినమును గూర్చియు ఆ గడియనుగూర్చియు తండ్రి మాత్రమే (యెరుగును) గాని, యే మనుష్యుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగరు.” (మత్తయి 24:21, 36) అయితే, 1914లో మొదలైన యేసు ప్రత్యక్షత కాలంలో హార్‌మెగిద్దోను యుద్ధం జరుగుతుందని బైబిలు చెప్తుంది.—మత్తయి 24:37-39.