కంటెంట్‌కు వెళ్లు

లాప్‌లాండ్‌లో ఒక విజయవంతమైన ప్రచార కార్యక్రమం

లాప్‌లాండ్‌లో ఒక విజయవంతమైన ప్రచార కార్యక్రమం

ఫిన్‌లాండ్‌, నార్వే, స్వీడన్‌ల మీదుగా విస్తరించే విశాలమైన ప్రాంతంలో సామీ అనే స్థానిక ప్రజలు నివసిస్తారు. వాళ్లకంటూ ప్రత్యేకమైన సంస్కృతి, సంప్రదాయాలు, భాషలు ఉంటాయి. సామీ ప్రజలతో బైబిలు సందేశం పంచుకోవడానికి ఈమధ్య కాలంలో యెహోవాసాక్షులు రెండు పనులు చేశారు.

ఒకటి, 2015 ఆకురాలే కాలంలో యెహోవాసాక్షులు సామీ భాషలో బైబిలు ప్రచురణలు, వీడియోలు తయారుచేయడం మొదలుపెట్టారు. a రెండవది, 2016లో అలాగే 2017లో రెండు ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు ఏర్పాటుచేసి, అనువదించిన ఆ సమాచారాన్ని సామీ ప్రజలతో పంచుకోవడానికి లాప్‌లాండ్‌కి ప్రయాణించారు. అక్కడ రేన్‌డీర్‌లు (reindeer) గుంపులుగుంపులుగా తిరుగుతాయి.

“సమాజానికి ఎంతో ఉపయోగపడే పని”

2017 మేలో జరిగిన ప్రత్యేక ప్రచార కార్యక్రమం కోసం ఫిన్‌లాండ్‌, నార్వే, స్వీడన్‌లకు చెందిన 200 కన్నా ఎక్కువమంది యెహోవాసాక్షులు లాప్‌లాండ్‌లోని వేలాది చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న చిన్నచిన్న గ్రామాలకు వెళ్లడానికి స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. వాళ్లలో కొంతమంది ముందే సామీ భాషలో చిన్నచిన్న వాక్యాలు నేర్చుకున్నారు, దానికి సామీ ప్రజలు ముగ్ధులయ్యారు. “మేము వాళ్ల భాషలో మాట్లాడడానికి చేసిన ప్రయత్నాల్ని చూసి స్థానిక ప్రజలు సంతోషించారు, మాకున్న నిజమైన శ్రద్ధను వాళ్లు అర్థంచేసుకున్నారు” అని కరిగస్నీయమి గ్రామంలో స్వచ్ఛందంగా సేవచేసిన డెనస్‌ అంటున్నాడు.

సామీ ప్రజలకు ప్రకృతి అన్నా, వన్య ప్రాణులు అన్నా చాలా ఇష్టం కాబట్టి భూమంతా అందమైన తోటగా మారుతుందనే బైబిలు వాగ్దానం వాళ్లకు బాగా నచ్చింది. (కీర్తన 37:11) ఉదాహరణకు, సామీ ప్రజల్లో ఒకామె, దేవుడు చెబుతున్న మంచివార్త! అనే బ్రోషురుతో బైబిలు స్టడీ మొదలుపెట్టి, మనుషుల కోసం దేవుడు ఏం చేయబోతున్నాడో నేర్చుకుంది. అప్పుడామె, వాళ్ల మతనాయకుడు ఆ విషయం ఎన్నడూ తనకు ఎందుకు చెప్పలేదా అని ఆశ్చర్యపోయింది.

యెహోవాసాక్షులు రావడం పట్ల చాలామంది తమ కృతజ్ఞత వ్యక్తంచేశారు. ఒక షాప్‌ అతను తాను గమనించిన ఇద్దరు సాక్షుల్ని మెచ్చుకున్నాడు. వాళ్లు, “చాలా ప్రాముఖ్యమైన, సమాజానికి ఎంతో ఉపయోగపడే పని” చేస్తున్నారని వాళ్లతో అన్నాడు. అంతేకాదు, తన షాప్‌కి వచ్చి వాళ్లకు ఎలాంటి ఆహారపదార్థాలు అవసరమైనా తీసుకోమని ఆహ్వానించాడు. తర్వాత వాటికి డబ్బులు ఇవ్వొద్దని పట్టుబట్టాడు.

ప్రచార కార్యక్రమం సమయంలో సామీ ప్రజలు దాదాపు 180 వీడియోలు చూశారు, 500 కన్నా ఎక్కువ ప్రచురణలు తీసుకున్నారు. చాలామంది, తమ భాషలో అందుబాటులోవున్న ప్రతీ ప్రచురణను ఇవ్వమని అడిగారు. అంతేకాదు, సామీ ప్రజల్లో 14 మంది యెహోవాసాక్షుల దగ్గర బైబిలు స్టడీ తీసుకోవడం మొదలుపెట్టారు.

“నిపుణుల పని”

యెహోవాసాక్షుల ప్రచురణల్ని చదివిన కొంతమంది సామీ ప్రజలు వాటి ఉన్నతస్థాయి అనువాదాన్ని మెచ్చుకున్నారు. స్కూల్‌ టీచర్‌, అలాగే సామీ పార్లమెంటు ఎక్సెక్యుటివ్‌ బోర్డ్‌ సభ్యుడు అయిన నిల్ల టపైయొల ఇలా అంటున్నాడు: “మీ ప్రచురణల అనువాదం చాలా బావుంటుంది.” అంతేకాదు, అవి “అవి తేలిగ్గా చదవగలిగేలా ఉంటాయి, భాష కూడా చాలా బావుంటుంది” అని ఆయన వివరిస్తున్నాడు. సామీ ప్రజల్లో ఒకతను ఫిన్‌లాండ్‌ ఉత్తర అంచున నివసిస్తాడు, అతను ఇలా అంటున్నాడు: “అవి ఖచ్చితంగా నిపుణుల పని.”

కరిగస్నీయమిలో, ఫిన్‌లాండ్‌కీ నార్వేకీ మధ్య సరిహద్దు దగ్గర యెహోవాసాక్షులు ఒక సామీ టీచర్‌తో దేవుడు చెబుతున్న మంచివార్త! బ్రోషుర్‌లోని మొదటి పాఠం చర్చించారు. ఆమె ఆ బ్రోషుర్‌ అనువాదం చాలా బాగుండడం గమనించి, స్కూల్లో సామీ భాష నేర్పించడానికి దాన్ని ఉపయోగించేందుకు సాక్షుల్ని అనుమతి కోరింది.

కొన్ని వీడియోలు, కరపత్రాలు అలాగే ఒక బ్రోషుర్‌ సామీ భాషలోకి అనువదించబడ్డాయి. 2016 ఫిబ్రవరి 29 నుండి jw.org వెబ్‌సైట్‌ కూడా సామీ భాషలో అందుబాటులో ఉంది. ప్రతీ నెల, సామీ భాష మాట్లాడేవాళ్లు 400 కన్నా ఎక్కువసార్లు ఆ వెబ్‌సైట్‌ని సందర్శిస్తున్నారు, దాదాపు 350 డిజిటల్‌, ఆడియో, వీడియో ఫైళ్లు డౌన్‌లోడ్‌ చేస్తున్నారు.

ఈ ప్రచార కార్యక్రమం వల్ల సామీ ప్రజలు, అలాగే వాళ్లతో బైబిలు సందేశం పంచుకోవడానికి వచ్చినవాళ్లు ప్రయోజనం పొందారు. ఉట్స్‌యోకి గ్రామానికి ప్రయాణించిన హెన్రిక్‌, హిల్య-మరీయ ఇలా అంటున్నారు: ‘సామీ సమాజానికి బైబిలు ఎన్నో రకాలుగా సహాయం చేస్తుందని స్థానికులు అర్థంచేసుకున్నారు.’ అదే గ్రామానికి వెళ్లిన లారి, ఇంగ ఇలా అంటున్నారు: “ఈ ప్రచార కార్యక్రమం దేవునికి పక్షపాతం లేదనే విషయాన్ని మాకు గుర్తుచేసింది. మా ద్వారా ఈ మారుమూల ప్రాంతాల్లో ఉంటున్నవాళ్ల మీద తన ప్రేమను చూపిస్తున్నందుకు మేము సంతోషిస్తున్నాం.”

a సామీ (సమీ అని కూడా అంటారు) భాషలు చాలా ఉన్నాయి. ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికా ప్రకారం, “వాటిలో పెద్దదైన ఉత్తర సమీ భాషను ... సమీ ప్రజల్లో దాదాపు 66 శాతంమంది మాట్లాడతారు.” యెహోవాసాక్షులు తమ ప్రచురణల్ని ఉత్తర సమీ భాషలోకి అనువదిస్తున్నారు. తేలిగ్గా అర్థమవ్వడం కోసం, ఈ ఆర్టికల్‌ ఎక్కువమంది మాట్లాడే భాషనే “సామీ” అని అంటుంది.