కంటెంట్‌కు వెళ్లు

ఐర్లాండ్‌, బ్రిటన్‌లలో స్థానిక భాష మాట్లాడేవాళ్లకు రాజ్యసువార్త ప్రకటించడం

ఐర్లాండ్‌, బ్రిటన్‌లలో స్థానిక భాష మాట్లాడేవాళ్లకు రాజ్యసువార్త ప్రకటించడం

ఐర్లాండ్‌, బ్రిటన్‌లలో a స్థానిక భాష మాట్లాడే ప్రజలకు సువార్త ప్రకటించడానికి యెహోవాసాక్షులు తీవ్రంగా కృషి చేస్తున్నారు. అక్కడ ఇంగ్లీషుతో పాటు ఐరిష్‌, స్కాటిష్‌ గేలిక్‌, వెల్ష్‌ భాషలు మాట్లాడతారు.

మేము మా jw.org వెబ్‌సైట్‌కు సరికొత్త హంగులు అద్ది ఐరిష్‌, వెల్ష్‌ భాషలతోపాటు ఎన్నో ఇతర భాషల్లో 2012, సెప్టెంబరు నెలలో విడుదల చేశాం. స్కాటిష్‌ గేలిక్‌ భాషలో 2014 ఆగస్టు నెలలో విడుదల చేశాం. మేము ఈ భాషల్లో వివిధ రకాల బైబిలు ప్రచురణల్ని కూడా ప్రింట్‌ చేస్తాం. వీటివల్ల ఎలాంటి ఫలితాలు వచ్చాయి?

ఓ చర్చి సేవకుడు స్కాటిష్‌ గేలిక్‌ భాషలో ఒక కరపత్రాన్ని తీసుకున్నాడు. ఆయన దాన్ని బిగ్గరగా చదివి, ఏడ్వడం మొదలుపెట్టాడు. అది ఆయన మనసుకు ఎందుకు అంతలా హత్తుకుంది? ఆ కరపత్రంలో ఉన్న భాషను చూసి ఆయన ఆశ్చర్యపోయి ఇలా అన్నాడు, “దీన్ని ఎవరు అనువదించారు? చాలా బాగుంది.”

స్కాటిష్‌ గేలిక్‌ భాషలో jw.org వెబ్‌సైట్‌ను విడుదల చేసిన మొదటి నెలలో దాన్ని దాదాపు 750 మంది చూశారు.

గాల్‌వేలోని నేషనల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ ఐర్లాండ్‌లో లెక్చరర్‌గా పని చేస్తున్న ఒకాయన, తనకు మతం అంటే ఆసక్తి లేదని ఓ యెహోవాసాక్షితో చెప్పాడు. కానీ బైబిలు-దానిలో మీకు ఒక సందేశం ఉంది అనే బ్రోషురు ఐరిష్‌ భాషలో ఉందని తెలిసినప్పుడు, అది తనకు కావాలని తీసుకున్నాడు. బైబిలు ప్రచురణలు ప్రజలందరికీ తమ సొంత భాషలో అందుబాటులో ఉండాలన్నది ఆయన ఉద్దేశం. ఐరిష్‌ భాషలో ప్రచురణల్ని తయారు చేయడానికి సాక్షులు చేసిన కృషిని ఆయన మెచ్చుకున్నాడు.

తన సొంత భాష అయిన వెల్ష్‌లో బైబిలు బ్రోషురును అందుకున్న ఓ వయసు పైబడిన స్త్రీ ఇలా అనింది, “నిజం చెప్పాలంటే, ఒకవేళ మీరు ఇదే బ్రోషురును ఇంగ్లీషులో ఇచ్చి ఉంటే నేను తీసుకునేదాన్నే కాదు. కానీ దీన్ని నా సొంత భాషలో ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది.”

2014, ఆగస్టు నెల నుండి jw.orgలో వెల్ష్‌ భాషలో మరింత ఎక్కువ సమాచారాన్ని ఉంచుతున్నాం. ఆ నెల నుండి మన వెబ్‌సైట్‌లో ఆ భాషలో ఉన్న సమాచారాన్ని చదివే వాళ్ల సంఖ్య రెండితల కన్నా ఎక్కువైంది.

“మేము ఒకే భాష మాట్లాడతాం”

యేసు తన శిష్యుల్లో ఇద్దరికి లేఖనాలను వివరించినప్పుడు వాళ్లు ఆశ్చర్యంతో ఇలా అన్నారు, “ఆయన త్రోవలో మనతో మాటలాడుచు లేఖనములను మనకు బోధపరచుచున్నప్పుడు మన హృదయము మనలో మండుచుండలేదా.” (లూకా 24:32) బైబిలు సత్యాలను ప్రజలకు వాళ్ల సొంత భాషలో స్పష్టంగా వివరించినప్పుడు అవి వాళ్ల జీవితాలమీద చాలా ప్రభావం చూపిస్తాయి.

వేల్స్‌కు చెందిన ఎమిర్‌, ఓ యెహోవాసాక్షిని పెళ్లి చేసుకున్నాడు. కానీ ఆమెతో కలిసి ఆయనెప్పుడూ కూటాలకు వెళ్లలేదు. అయితే కొంతకాలానికి రస్సెల్‌ అనే ఓ సాక్షి ఆయనకు స్నేహితుడయ్యాడు. తన పద్ధతిని ఎందుకు మార్చుకోవాలనుకున్నాడో వివరిస్తూ ఎమిర్‌ ఇలా చెప్పాడు, “ఓరోజు రస్సెల్‌ బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది? అనే పుస్తకం తీసుకుని నా దగ్గరకు వచ్చినప్పుడు, నేను బైబిలు గురించి ఖచ్చితంగా నేర్చుకోవాలని నిర్ణయించుకున్నాను.” b రస్సెల్‌ నాకు ఆ పుస్తకాన్ని ఇచ్చి ఇలా అన్నాడు, “ఈ పుస్తకం వెల్ష్‌ భాషలో ఉంది. ఇప్పటినుండి మనమిద్దరం కలిసి ఈ పుస్తకంతో స్టడీ చేసుకోబోతున్నాం.” సూటిగా మాట్లాడిన రస్సెల్‌ పద్ధతి ఎమిర్‌కు ఎందుకు నచ్చింది? ఎమిర్‌ ఇలా చెప్పాడు, “మేము ఒకే భాష మాట్లాడతాం, మా ఇద్దరిదీ ఒకే సంస్కృతి, మేము ఒకర్నొకరం అర్థం చేసుకుంటాం.” తన సొంత భాష అయిన వేల్ష్‌లో బైబిలు గురించి నేర్చుకుంటున్నప్పుడు అవి ఎమిర్‌ హృదయంపై చాలా ప్రభావం చూపించాయి. ఎందుకంటే ఆయనకు అవి స్పష్టంగా అర్థమయ్యాయి.

యెహోవాసాక్షులు ప్రజలకు వాళ్ల సొంత భాషలోనే దేవుని గురించి నేర్పించడంలో ముందుకు కొనసాగుతూ ఉంటారు. ఎందుకంటే అప్పుడే ఆ విషయాలు వాళ్ల హృదయాలకు చేరుతాయి.

a ఈ ఆర్టికల్‌లో బ్రిటన్‌ అనే మాట ఇంగ్లండ్‌, స్కాట్లాండ్‌, వేల్స్‌ దేశాలకు సూచిస్తుంది.

b బైబిలు అధ్యయనాలు చేయడానికి యెహోవాసాక్షులు తయారుచేసిన బైబిలు ఆధారిత పుస్తకం.