కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అధ్యయన ఆర్టికల్‌ 16

యెహోవా సేవలో మీరు చేయగలిగిందంతా చేస్తూ సంతోషాన్ని పొందండి

యెహోవా సేవలో మీరు చేయగలిగిందంతా చేస్తూ సంతోషాన్ని పొందండి

“ప్రతీ వ్యక్తి తాను చేసే పనుల్ని పరిశీలించుకోవాలి.”గల. 6:4.

పాట 37 పూర్ణ ప్రాణంతో యెహోవాను సేవిద్దాం

ఈ ఆర్టికల్‌లో. . . a

1. మనమేం చేసినప్పుడు సంతోషాన్ని పొందుతాం?

 మనందరం సంతోషంగా ఉండాలని యెహోవా కోరుకుంటున్నాడు. ఎందుకంటే ఆయన పవిత్రశక్తి పుట్టించే లక్షణాల్లో సంతోషం ఒకటి. (గల. 5:22) అలాగే తీసుకోవడంలోకన్నా ఇవ్వడంలోనే ఎక్కువ సంతోషం ఉందని బైబిలు చెప్తుంది. (అపొ. 20:35) అందుకే మనం పరిచర్యలో పూర్తిగా పాల్గొన్నప్పుడు, సహోదర సహోదరీలకు వేర్వేరు విధానాల్లో సహాయం చేసినప్పుడు ఎంతో సంతోషాన్ని పొందుతాం.

2-3. (ఎ) గలతీయులు 6:4 లో చెప్పినట్టు, యెహోవా సేవలో మనం సంతోషంగా ఉండాలంటే ఏ రెండు పనులు చేయాలి? (బి) ఈ ఆర్టికల్‌లో ఏం పరిశీలిస్తాం?

2 మనం సంతోషంగా ఉండాలంటే చేయాల్సిన రెండు పనుల గురించి అపొస్తలుడైన పౌలు గలతీయులు 6:4 లో చెప్పాడు. (చదవండి.) మొదటిగా, యెహోవా కోసం మనం చేయగలిగిందంతా చేయాలి. మనం అలా చేస్తే సంతోషంగా ఉంటాం. (మత్త. 22:36-38) రెండవదిగా, మనం ఇతరులతో పోల్చుకోకూడదు. మన ఆరోగ్యం, సామర్థ్యాలు లేదా నేర్చుకున్న విషయాల్ని బట్టి యెహోవా సేవలో మనమెంతో చేస్తుండవచ్చు. అవన్నీ ఆయనే ఇచ్చాడు కాబట్టి మనం యెహోవా పట్ల కృతజ్ఞతతో ఉండాలి. మరోవైపు ఇతరులు దేవుని సేవను మనకన్నా బాగా చేస్తుంటే, అప్పుడు కూడా వాళ్లను చూసి మనం సంతోషించాలి. ఎందుకంటే వాళ్లు తమ సామర్థ్యాల్ని, అందరికన్నా గొప్ప అనిపించుకోవడానికో లేదా సొంత ప్రయోజనాల కోసమో ఉపయోగించట్లేదు. బదులుగా యెహోవాను స్తుతించడానికే ఉపయోగిస్తున్నారు. కాబట్టి, అలాంటివాళ్లతో పోటీపడే బదులు వాళ్లను చూసి నేర్చుకోవాలి.

3 మనం దేవుని సేవలో చేయాలనుకుంటున్న పనుల్ని చేయలేకపోతే నిరుత్సాహపడవచ్చు. అలాంటప్పుడు మనకేది సహాయం చేస్తుందో ఈ ఆర్టికల్‌లో చూస్తాం. అలాగే మనకున్న సామర్థ్యాల్ని పూర్తిగా ఎలా ఉపయోగించవచ్చో, ఇతరుల ఆదర్శం నుండి ఏం నేర్చుకోవచ్చో చూస్తాం.

దేవుని సేవను చేయాలనుకున్నంత చేయలేకపోతున్నప్పుడు . . .

మన జీవితమంతా యెహోవా సేవలో చేయగలిగిందంతా చేస్తే మనం ఆయన్ని సంతోషపెడతాం (4-6 పేరాలు చూడండి) b

4. మనం దేనివల్ల నిరుత్సాహపడొచ్చు? ఒక ఉదాహరణ చెప్పండి.

4 కొంతమంది దేవుని సేవకులు అనారోగ్యంవల్ల లేదా వయసు పైబడడంవల్ల చేయాలనుకుంటుంది చేయలేకపోతుండవచ్చు. దానివల్ల వాళ్లు ఎంతో నిరుత్సాహపడతారు. క్యారల్‌ అనే సహోదరి విషయంలో కూడా అదే జరిగింది. ఒకప్పుడు ఆమె అవసరం ఎక్కువ ఉన్న ప్రాంతంలో సేవ చేసింది. ఆ సమయంలో ఆమెకు 35 బైబిలు అధ్యయనాలు ఉండేవి. ఇంకా చాలామందికి సమర్పించుకుని బాప్తిస్మం తీసుకునేలా సహాయం చేసింది. క్యారల్‌ తన పరిచర్యలో పొందిన ఫలితాల్నిబట్టి ఎంతో సంతోషించింది. కానీ తర్వాత ఆమె ఆరోగ్యం పాడై ఇంటికే పరిమితం అయిపోయింది. క్యారల్‌ ఇలా చెప్తుంది: “అనారోగ్యంవల్ల నేను ఇతరుల్లా సేవ చేయలేకపోతున్నానని నాకు తెలుసు. కానీ వాళ్లను చూసినప్పుడు నేను వాళ్లంత నమ్మకంగా దేవుని సేవ చేయట్లేదని నాకు అనిపిస్తుంది. నాకు చేయాలనే కోరిక ఉన్నా చేయలేకపోతున్నాను. దానివల్ల చాలా నిరుత్సాహంగా అనిపిస్తుంది.” క్యారల్‌ అనారోగ్యంతో ఉన్నా యెహోవా కోసం తాను చేయగలిగిందంతా చేయాలనుకుంటుంది. అది నిజంగా మెచ్చుకోవాల్సిన విషయం! ఆమె చూపిస్తున్న మంచి స్ఫూర్తినిబట్టి, మన కనికరంగల దేవుడు ఎంతో సంతోషిస్తున్నాడని ఖచ్చితంగా చెప్పవచ్చు.

5. (ఎ) మనకున్న పరిస్థితుల్ని బట్టి నిరుత్సాహంగా అనిపిస్తే మనమేం గుర్తుంచుకోవాలి? (బి) చిత్రాల్లో ఉన్నట్టు ఒక సహోదరుడు యెహోవా సేవలో తాను చేయగలిగిందంతా చేస్తూనే ఉన్నాడని ఎలా చెప్పవచ్చు?

5 మీ పరిస్థితుల్ని బట్టి మీకు కొన్నిసార్లు నిరుత్సాహంగా అనిపిస్తే ఇలా ప్రశ్నించుకోండి: ‘యెహోవా నా నుండి ఏం కోరుకుంటున్నాడు?’ మీ పరిస్థితుల్ని బట్టి ఆయన కోసం మీరు చేయగలిగింది చేయాలనే ఆయన కోరుకుంటున్నాడు. ఒకసారి ఇలా ఆలోచించండి: 80 ఏళ్లున్న ఒక సహోదరి, తనకు 40 ఏళ్లున్నప్పుడు చేసినంత సేవ ఇప్పుడు చేయలేకపోతున్నందుకు నిరుత్సాహపడుతుంది. అయితే ఇప్పుడు తాను చేయగలిగిందంతా చేస్తున్నా అది యెహోవాను సంతోషపెట్టడం లేదేమోనని ఆమె అనుకుంటుంది. కానీ అది నిజమేనా? ఆ సహోదరి తనకు 40 ఏళ్లున్నప్పుడు చేయగలిగిందంతా చేసింది. 80 ఏళ్లు వచ్చినప్పుడు కూడా చేయగలిగిందంతా చేస్తూనే ఉంది. అంటే ఆమె యెహోవాకు శ్రేష్ఠమైనది మానకుండా ఇస్తూనే ఉంది. అదేవిధంగా, మనం చేస్తున్న సేవ ఆయనను సంతోషపెట్టడం లేదని మనకనిపిస్తే ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి: మనం చేసే సేవ ఆయనకు నచ్చుతుందో లేదో యెహోవాయే నిర్ణయిస్తాడు. కాబట్టి మనం చేయగలిగిందంతా చేస్తే ఆయన మనతో “శభాష్‌!” అంటాడు.—మత్తయి 25:20-23 తో పోల్చండి.

6. మారియా అనుభవం నుండి మనమేం నేర్చుకోవచ్చు?

6 మనం ఏం చేయలేం అనే దానిమీద కాకుండా మనం ఏం చేయగలం అనే దానిమీద మనసుపెడితే సంతోషంగా ఉండడం తేలికౌతుంది. మారియా అనే సహోదరి గురించి ఆలోచించండి. ఆమెకున్న అనారోగ్యంవల్ల పరిచర్యలో చేయాలనుకుంటున్నంత చేయలేకపోతుంది. మొదట్లో ఆమె బాగా నిరుత్సాహపడి దేనికీ పనికిరానని అనుకుంది. కానీ తర్వాత తన సంఘంలో అనారోగ్యంతో మంచం నుండి లేవలేని స్థితిలో ఉన్న మరో సహోదరి గురించి ఆలోచించింది. మారియా ఆ సహోదరికి సహాయం చేయాలని నిర్ణయించుకుంది. ఆమె ఇలా అంటుంది: “నేను తనతో కలిసి టెలిఫోన్‌ ద్వారా, ఉత్తరాల ద్వారా ప్రకటించడానికి ఏర్పాట్లు చేసుకున్నాను. తనతో కలిసి ప్రకటించిన ప్రతీసారి నా సహోదరికి సహాయం చేశాననే సంతోషంతో, సంతృప్తితో ఇంటికి తిరిగొచ్చేదాన్ని.” కాబట్టి మనం చేయలేని వాటిగురించి ఆలోచించే బదులు చేయగలిగే వాటిమీద మనసుపెట్టడం ద్వారా సంతోషాన్ని పెంచుకోవచ్చు. మరోవైపు మన పరిస్థితులు అనుకూలించి, మన సామర్థ్యాలను యెహోవా సేవలో బాగా ఉపయోగిస్తుంటే అప్పుడేంటి?

మీకేదైనా సామర్థ్యం ఉంటే దాన్ని “ఉపయోగించండి”

7. అపొస్తలుడైన పేతురు క్రైస్తవులకు ఏ సలహా ఇచ్చాడు?

7 తమకు ఎలాంటి సామర్థ్యాలున్నా, వాటిని ఉపయోగించి సహోదర సహోదరీల్ని ప్రోత్సహించమని అపొస్తలుడైన పేతురు తన మొదటి ఉత్తరంలో సహోదరులకు చెప్పాడు. ఆయనిలా అన్నాడు: “మీరు పొందినంత మేరకు మీలో ప్రతీ ఒక్కరు మీ వరాన్ని ఒకరికొకరు పరిచారం చేసుకోవడానికి ఉపయోగించండి. . . . దేవుని అపారదయకు మంచి గృహనిర్వాహకులుగా ఉంటూ అలా చేయండి.” (1 పేతు. 4:10) తోటి సహోదర సహోదరీలు మనల్ని చూసి ఈర్ష్యపడతారనో, నిరుత్సాహపడతారనో భయపడకుండా మనకున్న సామర్థ్యాల్ని పూర్తిగా ఉపయోగించాలి. ఒకవేళ అలా భయపడితే యెహోవా సేవలో మనం చేయగలిగిందంతా చేయలేం.

8. మొదటి కొరింథీయులు 4:6, 7 ప్రకారం, మనకున్న సామర్థ్యాల గురించి ఎందుకు గొప్పలు చెప్పుకోకుండా జాగ్రత్తపడాలి?

8 మనకున్న సామర్థ్యాల్ని పూర్తిగా ఉపయోగించాలి. కానీ వాటిగురించి గొప్పలు చెప్పుకోకుండా జాగ్రత్తపడాలి. (1 కొరింథీయులు 4:6, 7 చదవండి.) ఉదాహరణకు, మీరు బైబిలు అధ్యయనాల్ని తేలికగా మొదలుపెడుతుండవచ్చు. ఆ సామర్థ్యాన్ని ఉపయోగించడానికి వెనకాడకండి కానీ దానిగురించి గొప్పలు చెప్పుకోకుండా ఉండాలని గుర్తుపెట్టుకోండి. ఒకరోజు పరిచర్యలో మీరొక మంచి బైబిలు అధ్యయనాన్ని మొదలుపెట్టగలిగారు అనుకోండి. దాని గురించి మీ క్షేత్రసేవ గుంపులో ఉన్నవాళ్లందరికీ చెప్పాలని మీరెంతో ఎదురుచూస్తున్నారు. తీరా అక్కడ అందర్నీ కలిసేసరికి, పత్రికను ఎలా అందించిందో ఒక సహోదరి తన అనుభవాన్ని చెప్తుంది. తనేమో ఒక పత్రికను ఇచ్చింది, కానీ మీరైతే బైబిలు అధ్యయనాన్ని మొదలుపెట్టారు. ఇప్పుడు మీరేం చేస్తారు? మీ అనుభవాన్ని చెప్తే అందరూ ప్రయోజనం పొందుతారని మీకు తెలుసు. కానీ దాని గురించి ఆ సందర్భంలో చెప్పకుండా మరో సందర్భంలో చెప్పాలని మీరు నిర్ణయించుకోవచ్చు. మీరలా చేయడంవల్ల పత్రికను అందించిన సహోదరి ఉత్సాహాన్ని తగ్గించకుండా ఉంటారు. అలా ఆలోచిస్తే ఆ సహోదరి మీద శ్రద్ధ చూపించిన వాళ్లౌతారు. కానీ, అంతమాత్రాన బైబిలు అధ్యయనాలు మొదలుపెట్టడం అస్సలు ఆపకండి. మీకున్న ఆ సామర్థ్యాన్ని ఉపయోగిస్తూ ఉండండి.

9. మనకున్న సామర్థ్యాల్ని ఎలా ఉపయోగించాలి?

9 మనకున్న సామర్థ్యాలన్నీ దేవుడిచ్చిన బహుమతులే అని గుర్తుంచుకోవాలి. ఆ సామర్థ్యాలను సంఘంలో ఉన్న వాళ్లందర్ని ప్రోత్సహించడానికి ఉపయోగించాలే గానీ మనల్ని మనం గొప్పగా చూపించుకోవడానికి కాదు. (ఫిలి. 2:3) ఈ విషయాన్ని మనసులో ఉంచుకుని మన శక్తిని, సామర్థ్యాల్ని యెహోవా ఇష్టాన్ని చేయడానికి ఉపయోగిస్తే ఆయన్ని స్తుతిస్తామే గానీ మనల్ని మనం గొప్ప చేసుకోం. దానివల్ల మనం కూడా సంతోషాన్ని పొందుతాం.

10. మనం ఇతరుల్ని ఎందుకు చిన్నచూపు చూడకూడదు?

10 మనం జాగ్రత్తగా లేకపోతే మనకున్న బలాల్ని బట్టి లేదా సామర్థ్యాల్ని బట్టి ఇతరుల్ని చిన్నచూపు చూసే అవకాశం ఉంది. ఉదాహరణకు, ఒక సహోదరుడు బహిరంగ ప్రసంగాలు చాలా బాగా చేస్తుండవచ్చు. అది అతనికున్న సామర్థ్యం. సంఘంలో ప్రసంగాలు అంతబాగా చేయలేని మరో సహోదరుని కన్నా తానే గొప్ప అని అతను అనుకోవచ్చు. అయితే ప్రసంగాలు అంతబాగా చేయలేని ఆ సహోదరుడు ఆతిథ్యం ఇచ్చే విషయంలో, తన పిల్లలకు శిక్షణ ఇచ్చే విషయంలో, పరిచర్య చేసే విషయంలో ముందుండొచ్చు. యెహోవా సేవ చేయడం కోసం, ఇతరులకు సహాయం చేయడం కోసం ఇంతమంది సహోదర సహోదరీలు ఉన్నందుకు మనం ఎంతో కృతజ్ఞులం!

ఇతరుల ఆదర్శం నుండి నేర్చుకోండి

11. యేసు ఆదర్శాన్ని మనమెందుకు పాటించడానికి ప్రయత్నించాలి?

11 నిజమే మనం ఇతరులతో పోల్చుకోకూడదు. కానీ నమ్మకమైన సేవకులు ఉంచిన మంచి ఆదర్శం నుండి మనం ఎంతో నేర్చుకోవచ్చు. దీన్ని అర్థంచేసుకోవడానికి ఒకసారి యేసు గురించి ఆలోచించండి. మనం యేసులా పరిపూర్ణులం కాదు. కానీ ఆయన చూపించిన మంచి లక్షణాల నుండి, ఆయన చేసిన గొప్ప పనుల నుండి మనమెంతో నేర్చుకోవచ్చు. (1 పేతు. 2:21) మనం ఆయన ఆదర్శాన్ని వీలైనంత ఎక్కువగా పాటించడానికి ప్రయత్నిస్తే యెహోవాను ఇంకా బాగా సేవించగలం, పరిచర్యను మరింత నైపుణ్యంగా చేయగలం.

12-13. రాజైన దావీదు నుండి మనమేం నేర్చుకోవచ్చు?

12 అపరిపూర్ణులైనా మనం అనుసరించదగ్గ ఎంతోమంది నమ్మకమైన స్త్రీపురుషుల ఉదాహరణలు బైబిల్లో ఉన్నాయి. (హెబ్రీ. 6:12) రాజైన దావీదు గురించి ఆలోచించండి. యెహోవా అతన్ని “నా హృదయానికి నచ్చిన వ్యక్తి” అని పిలిచాడు. అదే మాట మరో బైబిలు అనువాదంలోనైతే, “నా హృదయానికి అనుగుణంగా ఉన్నవాడు” అని ఉంది. (అపొ. 13:22, పవిత్ర గ్రంథం, వ్యాఖ్యానసహితం) దావీదు పరిపూర్ణుడు కాదు. నిజానికి అతను కొన్ని పెద్దపెద్ద తప్పులు చేశాడు. అయినా అతను మనకు చక్కని ఆదర్శంగా ఉన్నాడు. ఎందుకంటే అతన్ని సరిదిద్దినప్పుడు తననుతాను సమర్థించుకోవడానికి ప్రయత్నించలేదు. బదులుగా గట్టిగా మందలించినప్పుడు అతను దాన్ని అంగీకరించాడు. అలాగే, చేసిన తప్పుకు మనస్ఫూర్తిగా పశ్చాత్తాపం చూపించాడు. దానివల్ల యెహోవా అతన్ని క్షమించాడు.—కీర్త. 51:3, 4, 10-12.

13 దావీదు ఉదాహరణ గురించి ఆలోచిస్తున్నప్పుడు మనమిలా ప్రశ్నించుకోవచ్చు: ‘ఎవరైనా సలహా ఇస్తే నేనెలా స్పందిస్తాను? నేను నా తప్పుల్ని వెంటనే ఒప్పుకుంటానా లేదా నన్ను నేను సమర్థించుకుంటానా? వాటిని ఇతరులమీద నెట్టేయడానికి ప్రయత్నిస్తానా? చేసిన తప్పు మళ్లీ చేయకుండా ఉండడానికి నేను బాగా కృషి చేస్తానా?’ బైబిల్లో ఉన్న ఇతర నమ్మకమైన స్త్రీపురుషుల గురించి చదివినప్పుడు కూడా మీరు ఇలాంటి ప్రశ్నలు వేసుకోవచ్చు. మీరు ఎదుర్కొంటున్నలాంటి సమస్యల్నే వాళ్లూ ఎదుర్కొన్నారా? వాళ్లు ఎలాంటి మంచి లక్షణాల్ని చూపించారు? వాళ్ల గురించి చదివిన ప్రతీసారి మనం ఈ ప్రశ్న వేసుకోవచ్చు: ‘నేను ఈ విశ్వసనీయ సేవకునిలా తయారవ్వాలంటే ఏం చేయాలి?’

14. తోటి ఆరాధకుల్ని గమనించినప్పుడు మనమెలాంటి ప్రయోజనం పొందవచ్చు?

14 తోటి ఆరాధకులు మనకన్నా చిన్నవాళ్లయినా పెద్దవాళ్లయినా వాళ్లను గమనించడం ద్వారా ఎంతో నేర్చుకోవచ్చు. ఉదాహరణకు, మీ సంఘంలో ఎవరైనా సవాళ్లను నమ్మకంగా ఎదుర్కొంటున్నారా? బహుశా వాళ్లు తోటివాళ్ల ఒత్తిడిని, కుటుంబ సభ్యుల హింసని లేదా అనారోగ్య పరిస్థితుల్ని ఎదుర్కొంటుండవచ్చు. వాళ్లు చూపిస్తున్న లక్షణాల్ని మీరూ చూపించాలని అనుకుంటున్నారా? వాళ్ల మంచి ఆదర్శాన్ని పరిశీలించడం ద్వారా మీకున్న సమస్యల్ని తట్టుకోవడానికి కొన్ని చక్కని సలహాలు తెలుసుకుంటారు. విశ్వాసం విషయంలో ఆదర్శంగా ఉన్న ఈ సహోదర సహోదరీల్ని మనమధ్య చూసినప్పుడు నిజంగా మనమెంతో సంతోషిస్తాం.—హెబ్రీ. 13:7; యాకో. 1:2, 3.

యెహోవా సేవలో మీరు చేస్తున్నదాన్నిబట్టి సంతోషించండి

15. యెహోవా సేవలో మనం చేస్తున్నదాన్నిబట్టి సంతోషించడానికి పౌలు ఇచ్చిన ఏ సలహా మనకు సహాయం చేస్తుంది?

15 సంఘంలో శాంతిని, ఐక్యతని కాపాడుకోవాలంటే మనలో ప్రతీఒక్కరం దేవుని సేవలో చేయగలిగిందంతా చేయాలి. మొదటి శతాబ్దపు క్రైస్తవుల గురించి ఒకసారి ఆలోచించండి. వాళ్లు వేర్వేరు వరాల్ని, నియామకాల్ని పొందారు. (1 కొరిం. 12:4, 7-11) కానీ వాటినిబట్టి వాళ్లు ఒకరితోఒకరు పోటీపడలేదు అలాగే వాళ్లమధ్య విభజనలు రాలేదు. అయితే ఆ వరాల్ని ఉపయోగించి ‘క్రీస్తు శరీరాన్ని బలపర్చమని’ పౌలు వాళ్లను ప్రోత్సహించాడు. ఆయన ఎఫెసీయులకు ఇలా రాశాడు: “ప్రతీ అవయవం తన పనిని సరిగ్గా చేస్తే శరీరం బాగా ఎదుగుతుంది, ప్రేమలో బలపడుతుంది.” (ఎఫె. 4:1-3, 11, 12, 16) వాళ్లు ఆయనిచ్చిన సలహా పాటించడం ద్వారా సంఘంలో శాంతిని, ఐక్యతని కాపాడుకున్నారు. అలాంటి లక్షణాల్ని నేడు మన సంఘాల్లో కూడా చూస్తాం.

16. మనమేం చేయాలని నిర్ణయించుకుందాం? (హెబ్రీయులు 6:10)

16 ఇతరులతో పోల్చుకోకుండా జాగ్రత్తపడాలని నిర్ణయించుకోండి. బదులుగా యేసు ఆదర్శం నుండి నేర్చుకుంటూ, ఆయన చూపించిన లక్షణాల్ని మీరూ చూపించడానికి ప్రయత్నించండి. బైబిలు కాలాల్లో అలాగే మన కాలంలో విశ్వాసం చూపించినవాళ్ల ఉదాహరణల్ని పరిశీలించడం ద్వారా ప్రయోజనం పొందండి. “మీరు చేసే పనిని, . . . దేవుడు మర్చిపోడు, ఎందుకంటే ఆయన అన్యాయస్థుడు కాడు.” కాబట్టి మీరు చేయగలిగిందంతా చేస్తూ ఉండండి. (హెబ్రీయులు 6:10 చదవండి.) మీరు నిండు ప్రాణంతో చేసే ప్రతీ ప్రయత్నాన్ని యెహోవా విలువైనదిగా ఎంచుతాడని గుర్తుంచుకుని, ఆయన సేవలో మీరు చేస్తున్నదాన్నిబట్టి సంతోషిస్తూ ఉండండి.

పాట 65 ముందుకు సాగిపోదాం!

a యెహోవా కోసం తోటి సహోదర సహోదరీలు చేస్తున్న సేవను చూసి మనందరం ఎంతో నేర్చుకోవచ్చు. కానీ మనం వాళ్లతో పోల్చుకోకూడదు. అయితే వేరేవాళ్లు చేసే సేవతో పోల్చుకుని నిరుత్సాహపడకుండా లేదా గర్వపడకుండా ఎలా ఉండాలో, మన సంతోషాన్ని ఎలా కాపాడుకోవాలో ఈ ఆర్టికల్‌లో చూస్తాం.

b చిత్రాల వివరణ: యౌవనస్థునిగా ఉన్నప్పుడు ఒక సహోదరుడు బెతెల్‌లో సేవచేశాడు. ఆ తర్వాత పెళ్లిచేసుకుని తన భార్యతో కలిసి పయినీరు సేవచేశాడు. పిల్లలు పుట్టాక పరిచర్యను ఎలా చేయాలో వాళ్లకు కూడా శిక్షణనిచ్చాడు. ప్రస్తుతం ఆయన వయసు పైబడినా, ఉత్తరాల ద్వారా సాక్ష్యమిస్తూ చేయగలిగిందంతా చేస్తున్నాడు.