కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పరీక్షలు ఎదురైనప్పుడు కూడా అణకువ చూపించవచ్చు

పరీక్షలు ఎదురైనప్పుడు కూడా అణకువ చూపించవచ్చు

“దీనమనస్సు [అణకువ, NW] కలిగి నీ దేవుని యెదుట ప్రవర్తించు.”మీకా 6:8.

పాటలు: 48, 1

1-3. యూదా ప్రవక్త ఏమి చేయలేదు? దానివల్ల అతనికి ఏమి జరిగింది? (ప్రారంభ చిత్రం చూడండి.)

 ఇశ్రాయేలు రాజైన యరొబాము బేతేలు నగరంలో అబద్ధ ఆరాధన కోసం ఓ బలిపీఠాన్ని కట్టించాడు. యెహోవా యరొబాముపై తీర్పు సందేశాన్ని ప్రకటించడానికి యూదా నుండి ఓ ప్రవక్తను పంపించాడు. వినయంగల ఆ ప్రవక్త యెహోవా మాట విని ఆ సందేశాన్ని ప్రకటించాడు. అందుకు రాజు ప్రవక్తపై కోపంతో విరుచుకుపడ్డాడు, కానీ అతని చేతుల్లో నుండి యెహోవా ఆ ప్రవక్తను కాపాడాడు.—1 రాజు. 13:1-10.

2 యెహోవా ఆ ప్రవక్తకు, ఇశ్రాయేలులో ఏమీ తినవద్దని-తాగవద్దని, వెళ్లిన దారిలో కాకుండా మరో దారిలో ఇంటికి తిరిగి రమ్మని ఆజ్ఞాపించాడు. అయితే ఆ ప్రవక్త తిరిగి వస్తున్నప్పుడు దారిలో ఓ ముసలాయన కనిపించి, యెహోవా తనతో ఓ సందేశం పంపించాడని అబద్ధం చెప్పాడు. తన ఇంటికి వచ్చి తిని, తాగమని ఆహ్వానించాడు. ఆ ప్రవక్త యెహోవా మాటకు లోబడకుండా ఆ ముసలాయన ఇంటికి వెళ్లాడు. యెహోవాకు అది నచ్చలేదు. ఆ ప్రవక్త తన ఇంటికి తిరిగి వెళ్తున్నప్పుడు ఒక సింహం అతన్ని చంపేసింది.—1 రాజు. 13:11-24.

3 ఆ ప్రవక్త యెహోవా మాట కాకుండా ముసలాయన మాట వినాలని ఎందుకు నిర్ణయించుకున్నాడో మనకు తెలీదు. కానీ అతను “దీనమనస్సు కలిగి” లేదా అణకువ కలిగి యెహోవాతో నడవలేదని మాత్రం మనకు తెలుసు. (మీకా 6:8 చదవండి.) బైబిలు ప్రకారం, యెహోవాతో కలిసి నడవడంలో ఆయనపై నమ్మకముంచడం, ఆయనిచ్చే నిర్దేశాలపై ఆధారపడడం, ఆయన మాట వినడం ఉన్నాయి. తాను క్రమం తప్పకుండా యెహోవాకు ప్రార్థించాలని అణకువగల వ్యక్తి గుర్తిస్తాడు. ఒకవేళ ఆ ప్రవక్తకు అణకువ ఉండివుంటే, తనకిచ్చిన నిర్దేశాల్ని ఏమైనా మార్చాడేమోనని యెహోవాను అడిగివుండేవాడు. కొన్నిసార్లు మనం కూడా కష్టమైన నిర్ణయాలు తీసుకోవాల్సి రావచ్చు. అయితే ఆ పరిస్థితుల్లో మనమేమి చేయాలని యెహోవా కోరుకుంటున్నాడో మనకు స్పష్టంగా అర్థంకాకపోవచ్చు. కానీ మనకు అణకువ ఉంటే, గంభీరమైన తప్పులు చేయకుండా ఉండేలా మనల్ని సరైన దారిలో నడిపించమని యెహోవాను అడుగుతాం.

4. ఈ ఆర్టికల్‌లో ఏమి పరిశీలిస్తాం?

4 ముందటి ఆర్టికల్‌లో, అణకువ కలిగి ఉండడమంటే ఏమిటో, మనకాలాల్లో అలా ఉండడం ఎందుకు ముఖ్యమో తెలుసుకున్నాం. అయితే అణకువను మరింత ఎక్కువగా కలిగివుండాలంటే ఏమి చేయాలి? ఎలాంటి పరిస్థితులు మన అణకువను పరీక్షించవచ్చు? అంటే మనకు నిజంగా అణకువ ఉందో లేదో ఎలాంటి పరిస్థితులు తెలియజేస్తాయి? వీటికి సంబంధించి మూడు సందర్భాల్ని ఇప్పుడు పరిశీలిద్దాం.—సామె. 11:2.

మన పరిస్థితులు మారినప్పుడు

5, 6. తనకు అణకువ ఉందని బర్జిల్లయి ఎలా చూపించాడు?

5 మన పరిస్థితులు లేదా నియామకాలు మారినప్పుడు మన ప్రవర్తన ఎలా ఉందనే దాన్నిబట్టి మనకు అణకువ ఉందో లేదో తెలుస్తుంది. ఒకసారి బర్జిల్లయి ఉదాహరణను పరిశీలించండి. ఇతను రాజైన దావీదుకు నమ్మకమైన స్నేహితుడు. బర్జిల్లయికి 80 ఏళ్లు ఉన్నప్పుడు, అతన్ని తన రాజగృహంలో ఉండడానికి రమ్మని దావీదు పిలిచాడు. రాజగృహంలో ఉండడం గొప్ప అవకాశం అయినప్పటికీ, ఆ నియామకాన్ని కింహాము అనే వ్యక్తికి ఇవ్వమని రాజుతో చెప్పాడు. బహుశా కింహాము బర్జిల్లయి కొడుకు అయ్యుండవచ్చు.—2 సమూ. 19:31-37.

6 రాజు ఇచ్చిన ఆహ్వానాన్ని బర్జిల్లయి ఎందుకు వద్దన్నాడు? అతను బాధ్యతను తప్పించుకోవాలని అనుకున్నాడా లేదా చింతలు లేకుండా హాయిగా జీవించాలనుకున్నాడా? లేదు. కారణమేమిటంటే బర్జిల్లయి అణకువగల వ్యక్తి. తన పరిస్థితులు మారాయని గుర్తించి, తనకున్న పరిమితులను మనసులో ఉంచుకున్నాడు కాబట్టే అతను ఆ నియామకాన్ని వద్దనుకున్నాడు. (గలతీయులు 6:4, 5 చదవండి.) బర్జిల్లయిలాగే మనం కూడా అణకువ చూపించాలి. మనం కోరుకునే వాటిమీద మనసుపెట్టే బదులు లేదా ఇతరులతో పోల్చుకునే బదులు యెహోవాకు శ్రేష్ఠమైనది ఇవ్వాలని కోరుకుంటాం. ఓ ప్రత్యేకమైన నియామకాన్ని పొందడం లేదా పేరు సంపాదించడం కన్నా ఇది చాలా ప్రాముఖ్యం. (గల. 5:26) మనకు అణకువ ఉంటే యెహోవాను ఘనపర్చడంలో, ఇతరులకు సహాయం చేయడంలో మన సహోదరులతో కలిసి పనిచేస్తాం.—1 కొరిం. 10:31.

7, 8. సొంత తెలివిపై ఆధారపడకుండా ఉండేందుకు అణకువ మనకు ఎలా సహాయం చేస్తుంది?

7 మన బాధ్యతలు లేదా అధికారం పెరిగినప్పుడు మన అణకువకు పరీక్ష ఎదురౌతుంది. కానీ ఈ విషయంలో మనం నెహెమ్యాను ఆదర్శంగా తీసుకోవచ్చు. యెరూషలేములోని ప్రజలు కష్టాల ఊబిలో చిక్కుకున్నారని నెహెమ్యా విన్నప్పుడు, వాళ్లకు సహాయం చేయమని అతను యెహోవాను వేడుకున్నాడు. (నెహె. 1:4, 11) రాజైన అర్తహషస్త నెహెమ్యాను ఆ ప్రాంతానికి అధికారిగా నియమించడం ద్వారా యెహోవా అతని ప్రార్థనలకు జవాబిచ్చాడు. నెహెమ్యాకు అధికారం, సంపద ఉన్నప్పటికీ అతను ఎన్నడూ తన సొంత తెలివిపై ఆధారపడలేదు. అతను యెహోవా నిర్దేశం కోసం చూస్తూ, ధర్మశాస్త్రాన్ని క్రమంతప్పకుండా చదివేవాడు. (నెహె. 8:1, 8, 9) నెహెమ్యాకు చాలామందిపై అధికారం ఉండేది. కానీ ఆ అధికారాన్ని తన స్వార్థం కోసం లేదా ఇతరులతో కఠినంగా ప్రవర్తించడానికి ఉపయోగించలేదు.—నెహె. 5:14-19.

8 నెహెమ్యాలాగే మనం కూడా, బాధ్యతలు పెరిగినప్పుడు లేదా నియామకం మారినప్పుడు అణకువ చూపిస్తూనే ఉండాలి. అంతేగానీ మన సొంత సామర్థ్యాలపై లేదా అనుభవంపై ఆధారపడకూడదు. ఇంతకీ ఓ వ్యక్తి ఏవిధంగా తన సొంత సామర్థ్యంపై ఆధారపడడం మొదలుపెట్టవచ్చు? ఉదాహరణకు, ఓ సంఘపెద్ద యెహోవాకు ప్రార్థించకుండానే సంఘ బాధ్యతల్ని మొదలుపెట్టవచ్చు. లేదా ఓ సహోదరుడు లేదా సహోదరి ముందు నిర్ణయం తీసేసుకుని, ఆ తర్వాత దాన్ని దీవించమని యెహోవాకు ప్రార్థించవచ్చు. కానీ అణకువగల వ్యక్తి తన సొంత తెలివిపై ఆధారపడడు, దేవుని ఏర్పాటులో తన స్థానం ఏమిటో అతను ఎప్పుడూ గుర్తుంచుకుంటాడు. ఒకవేళ ఆ పని అతనికి బాగా అలవాటున్నదే అయినప్పటికీ అలా చేయడు. తన సామర్థ్యాలు యెహోవాతో సాటిరావని అతను ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటాడు. (సామెతలు 3:5, 6 చదవండి.) నేడు ఈ లోకంలోని చాలామంది స్వార్థపరులుగా ఉంటూ, ఇతరులకన్నా ముందుండడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ యెహోవా సేవకులు అలా ఉండరు. బాధ్యతలు ఉన్నంతమాత్రాన మనం మన కుటుంబంలోని వాళ్లకన్నా లేదా సంఘంలోని వాళ్లకన్నా గొప్పవాళ్లమని అనుకోం. బదులుగా మనం మన సహోదరసహోదరీలతో కలిసి పనిచేస్తాం.—1 తిమో. 3:15.

ఇతరులు మనల్ని విమర్శించినప్పుడు లేదా పొగిడినప్పుడు

9, 10. ఇతరులు మనల్ని అన్యాయంగా విమర్శించినప్పుడు అణకువ మనకెలా సహాయం చేస్తుంది?

9 ఇతరులు మనల్ని అన్యాయంగా విమర్శించినప్పుడు మనకు బాధ కలగవచ్చు. హన్నాకు అలానే అనిపించింది. ఆమె భర్త తనను ఎంతో ప్రేమిస్తున్నప్పటికీ హన్నాకు సంతోషం కరువయ్యేది. ఎందుకంటే ఆమె సవితి అయిన పెనిన్నా ఆమెను ఎప్పుడూ దెప్పిపొడుస్తూ ఉండేది. హన్నాకు పిల్లలు కావాలని ఉండేది, కానీ ఆమెకు గర్భం రాలేదు. ఓ రోజు హన్నాకు చెప్పలేనంత బాధ కలిగింది, అప్పుడు ఆమె ప్రార్థించడానికి గుడారానికి వెళ్లింది. ఆమె ఏడ్వడాన్ని చూసిన ప్రధాన యాజకుడైన ఏలీ, ఆమె తాగివుందని నిందించాడు. ఆ సమయంలో హన్నాకు చాలా కోపం వచ్చివుండేది. కానీ ఆమె ఏలీకి గౌరవంగా జవాబిచ్చింది. హన్నా చేసిన ప్రార్థన బైబిల్లో ఉంది, యెహోవాపై ఆమెకున్న విశ్వాసం, ప్రేమ ఆ ప్రార్థనలో కనిపిస్తాయి.—1 సమూ. 1:5-7, 12-16; 2:1-10.

10 “మంచి చేసి చెడు మీద విజయం సాధిస్తూ” ఉండడానికి అణకువ మనకు సహాయం చేస్తుంది. (రోమా. 12:21) సాతాను లోకమంతా చెడు పనులతో నిండిపోయింది. కాబట్టి మనకు అన్యాయం జరిగినప్పుడు మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరంలేదు. అయితే ఆ పరిస్థితుల్లో మనకు కోపం వచ్చినా దాన్ని అణచుకోవాలి. (కీర్త. 37:1) ఒకవేళ తోటి సహోదరసహోదరీలతో మనకు సమస్యలు తలెత్తితే ఆ బాధ మరింత ఎక్కువగా ఉంటుంది. అలాంటి పరిస్థితి ఎదురైతే మనం యేసును అనుకరించాలి. ఆయన గురించి బైబిలు ఇలా చెప్తోంది, “ప్రజలు ఆయన్ని అవమానించినప్పుడు ఆయన తిరిగి వాళ్లను అవమానించలేదు . . . బదులుగా నీతిగా తీర్పుతీర్చే దేవునికే తనను తాను అప్పగించుకున్నాడు.” (1 పేతు. 2:23) యేసు వినయంగా ఉండడంతోపాటు, జరిగిన అన్యాయాన్ని యెహోవా సరిచేస్తాడని గుర్తించాడు. (రోమా. 12:19) ఆయనలానే మనం కూడా వినయంగా ఉంటాం, “ఎవరైనా హాని చేస్తే తిరిగి వాళ్లకు హాని” చేయం.—1 పేతు. 3:8, 9.

11, 12. (ఎ) ఇతరులు మనల్ని పొగిడినప్పుడు అణకువగా ఎలా ఉండవచ్చు? (బి) మనకు అణకువ ఉందని మన బట్టలు, ప్రవర్తన ద్వారా ఎలా చూపించవచ్చు?

11 ఇతరులు మనల్ని పొగిడినప్పుడు కూడా మన అణకువకు పరీక్ష ఎదురుకావచ్చు. ఉదాహరణకు ఎంతోమంది ఎస్తేరును పొగడ్తలతో ముంచెత్తారు. పర్షియాలోని అత్యంత అందగత్తెల్లో ఆమె ఒకతె. ఎంతోమంది ఇతర యువతులు రాజు మన్ననల్ని అందుకోవాలని పోటీపడుతున్నారు. వాళ్లందరి అందాన్ని మరింత పెంచడానికి సంవత్సరంపాటు ప్రత్యేక పరిమళ తైలాలతో మర్దన చేసేవాళ్లు. అయితే రాజు ఎస్తేరును తన రాణిగా ఎన్నుకున్నాడు. కానీ ఇవేవీ ఎస్తేరు ప్రవర్తనలో మార్పు తీసుకురాలేదు. ఆమె స్వార్థపరురాలిగా మారలేదుగానీ అణకువ, దయ, గౌరవం చూపించింది.—ఎస్తే. 2:9, 12, 15, 17.

మన బట్టలు మనం యెహోవాను, ఇతరుల్ని గౌరవిస్తున్నామని చూపిస్తున్నాయా? లేదా మనకు అణకువ లేదని చూపిస్తున్నాయా? (12వ పేరా చూడండి)

12 మనకు అణకువ ఉంటే ఎప్పుడూ హుందాగా, గౌరవపూర్వకంగా ఉండే బట్టల్ని వేసుకుంటాం, అలానే ప్రవర్తిస్తాం. మన గురించి మనం గొప్పలు చెప్పుకోవడానికి లేదా ఇతరుల్ని మెప్పించడానికి ప్రయత్నించకుండా ‘ప్రశాంతంగా, సౌమ్యంగా’ ఉండడానికి కృషి చేస్తాం. (1 పేతురు 3:3, 4 చదవండి; యిర్మీ. 9:23, 24) మన గురించి మనమేమి అనుకుంటున్నామో మన మాటల్లో, చేతల్లో ఎలాగోలా తెలుస్తుంది. ఉదాహరణకు మనం ప్రత్యేకమైన సేవావకాశాలను ఆనందిస్తున్నామని, ఎవరికీ తెలియని విషయాలు మనకు తెలుసని, బాధ్యతాయుతమైన స్థానాల్లో ఉన్న సహోదరులతో మనకు పరిచయాలు ఉన్నాయని ఇతరులకు అనిపించేలా మనం ప్రవర్తించవచ్చు. లేదా ఓ ముఖ్యమైన పనిని చేయడంలో ఇతరులు సహాయం చేసినప్పటికీ దాన్ని మనమే సొంతగా చేసినట్లు నమ్మించడానికి ప్రయత్నించవచ్చు. కానీ ఓసారి యేసు గురించి ఆలోచించండి. ఆయన తన జ్ఞానాన్ని ప్రదర్శించి ఇతరుల్ని మెప్పించి ఉండవచ్చు. కానీ ఆయన పదేపదే దేవుని వాక్యంలోని లేఖనాల్ని ఉపయోగించాడు. ప్రజలు తనను ఘనపర్చాలని ఆయన కోరుకోలేదు. ఆ ఘనత యెహోవాకే చెందాలని ఆయన ఎల్లప్పుడూ కోరుకున్నాడు.—యోహా. 8:28.

నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు

13, 14. మంచి నిర్ణయాలు తీసుకోవడానికి అణకువ ఎలా సహాయం చేస్తుంది?

13 నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు కూడా మన అణకువకు పరీక్ష ఎదురుకావచ్చు. అపొస్తలుడైన పౌలు కైసరయలో ఉన్నప్పుడు, అక్కడి నుండి యెరూషలేముకు వెళ్లి యెహోవా తనకు అప్పగించిన పనిని పూర్తి చేయాలని అనుకున్నాడు. కానీ అక్కడికి వెళ్తే అతన్ని పట్టుకుంటారని, బహుశా చంపేస్తారని అగబు ప్రవక్త చెప్పాడు. సహోదరులు కూడా పౌలును వెళ్లొద్దని బతిమలాడారు. అయినాసరే యెరూషలేముకు వెళ్లాలనే పౌలు నిర్ణయించుకున్నాడు. తన సొంత తెలివిపై ఆధారపడడం వల్లే పౌలు ఆ నిర్ణయం తీసుకున్నాడా? లేదు. పౌలు అణకువగల వ్యక్తి, అతను యెహోవాపై పూర్తి నమ్మకముంచాడు. సహోదరులు కూడా అణకువ చూపించారు. అందుకే పౌలు నిర్ణయాన్ని గౌరవించి ఆయన్ని వెళ్లనిచ్చారు.—అపొ. 21:10-14.

14 పరిస్థితులు ఎలా మారతాయో తెలియనప్పుడు లేదా పరిస్థితులు మన చేతుల్లో లేనప్పుడు కూడా మంచి నిర్ణయాలు తీసుకోవడానికి అణకువ సహాయం చేస్తుంది. ఉదాహరణకు మనం పూర్తికాల సేవ మొదలుపెట్టాలని ఆలోచిస్తుండవచ్చు. కానీ మనం అనారోగ్యానికి గురైతే అప్పుడేంటి? ఒకవేళ మన అమ్మానాన్నల ఆరోగ్యం పాడై వాళ్లకు మన సహాయం అవసరమైతే? మన వయసుపైబడ్డాక మన పరిస్థితి ఏంటి? వీటి గురించి ప్రార్థించి ఆలోచించినా సరే మనం జవాబులు చెప్పలేం. (ప్రసం. 8:16, 17) కానీ యెహోవా మీద నమ్మకముంచితే మన పరిమితుల్ని గుర్తించి వాటి ప్రకారం నిర్ణయాలు తీసుకోగలుగుతాం, వాస్తవాల్ని పరిశీలిస్తాం, సలహా అడుగుతాం, అన్నిటికన్నా ముఖ్యంగా నిర్దేశం కోసం ప్రార్థిస్తాం. ఆ తర్వాత యెహోవా పవిత్రశక్తి ఇచ్చే నిర్దేశాన్ని పాటిస్తాం. (ప్రసంగి 11:4-6 చదవండి.) యెహోవా మన నిర్ణయాల్ని దీవించగలడు లేదా మన ప్రణాళికల్ని మార్చుకునేలా సహాయం చేయగలడు.—సామె. 16:3, 9.

అణకువను మరింత ఎక్కువగా ఎలా చూపించవచ్చు?

15. యెహోవా గురించి ధ్యానించడం వినయంగా ఉండడానికి ఎలా సహాయం చేస్తుంది?

15 అణకువను మరింత ఎక్కువగా ఎలా చూపించవచ్చు? అందుకు సహాయం చేసే నాలుగు విధానాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిగా, యెహోవా ఎలాంటి దేవుడో లోతుగా ఆలోచించడం ద్వారా ఆయన గురించి ధ్యానించాలి. మనల్ని యెహోవాతో పోల్చుకుని చూసుకున్నప్పుడు మనమెంత అల్పులమో, మనకెంత తక్కువ జ్ఞానం ఉందో గుర్తించగలుగుతాం. (యెష. 8:13) మనం నడుస్తున్నది మనిషితోనో, దేవదూతతోనో కాదుగానీ సర్వోన్నతుడైన దేవునితో నడుస్తున్నామని గుర్తుంచుకోండి. ఈ విషయం గురించి లోతుగా ఆలోచించడం ద్వారా “ఆయన బలమైన చేతి కింద” మనల్ని మనం తగ్గించుకొని ఉండగలుగుతాం.—1 పేతు. 5:6.

16. యెహోవా ప్రేమ గురించి ధ్యానించడం అణకువగా ఉండడానికి ఎలా సహాయం చేస్తుంది?

16 అణకువను మరింత ఎక్కువగా చూపించడానికి సహాయం చేసే రెండో విధానమేమిటంటే, యెహోవా మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో ధ్యానించడం. పౌలు సంఘాన్ని మానవ శరీరంతో పోల్చాడు. యెహోవా మానవ శరీరంలోని ప్రతీ అవయవాన్ని ఎంతో విలువైనదానిగా చేశాడు. (1 కొరిం. 12:23, 24) అదేవిధంగా మనలో ప్రతీఒక్కరం యెహోవాకు ఎంతో విలువైనవాళ్లం. ఆయన మనల్ని వేరొకరితో పోల్చడు. అంతేకాదు మనం పొరపాట్లు చేశామని మనల్ని ప్రేమించడం మానేయడు. యెహోవా మనల్ని ప్రేమిస్తున్నాడని తెలుసుకొని మనం నిశ్చింతగా ఉండవచ్చు.

17. ఇతరుల్లో మంచిని చూడడానికి ప్రయత్నించడం ద్వారా మనమెలా ప్రయోజనం పొందుతాం?

17 మూడవదిగా, ఇతరుల్లో మంచిని వెతకడం ద్వారా అణకువను మరింత ఎక్కువగా చూపించగలుగుతాం. ఎప్పుడూ ఇతరుల దృష్టిని ఆకట్టుకోవడానికి ప్రయత్నించడం లేదా ఏమి చేయాలో ఇతరులకు చెప్పడం వంటివి చేయం. బదులుగా మనం ఇతరుల్ని సలహా అడుగుతాం, వాళ్ల ఆలోచనల్ని అంగీకరించడానికి సిద్ధంగా ఉంటాం. (సామె. 13:10) అంతేకాదు మన సహోదరసహోదరీలు ప్రత్యేక నియామకాలు పొందినప్పుడు మనం సంతోషిస్తాం. తనను సేవించే అవకాశం మనందరికీ ఇస్తున్నందుకు యెహోవాకు కృతజ్ఞతలు చెప్తాం.—1 పేతు. 5:9.

18. మనస్సాక్షికి శిక్షణనిస్తే అణకువను మరింత ఎక్కువగా ఎలా చూపించగలుగుతాం?

18 నాలుగవదిగా, బైబిలు సూత్రాల్ని ఉపయోగించి మన మనస్సాక్షికి శిక్షణ ఇచ్చినప్పుడు అణకువను మరింత ఎక్కువగా చూపించగలుగుతాం. యెహోవా భావాలు, ఆలోచనలు తెలుసుకోవడానికి ఆ సూత్రాలు మనకు సహాయం చేస్తాయి. విషయాల్ని యెహోవా చూసినట్లు చూడడం నేర్చుకున్నప్పుడు మనం ఆయన్ను సంతోషపెట్టే నిర్ణయాలు తీసుకోగలుగుతాం. మనం అధ్యయనం చేస్తూ, ప్రార్థిస్తూ, నేర్చుకున్నవి పాటిస్తూ ఉంటే మన మనస్సాక్షి మరింత బలంగా తయారౌతుంది. (1 తిమో. 1:5) అంతేకాదు మనకన్నా ఇతరులకు మొదటిస్థానం ఇవ్వడం నేర్చుకుంటాం. ఇవన్నీ చేస్తే, అణకువను మరింత ఎక్కువగా చూపించడానికి సహాయం చేయడమే కాకుండా మనకు ‘ఇచ్చే శిక్షణను ముగిస్తానని’ యెహోవా మాటిస్తున్నాడు.—1 పేతు. 5:10.

19. అణకువ చూపిస్తూ ఉండడానికి మనకేది సహాయం చేస్తుంది?

19 ఈ ఆర్టికల్‌ మొదట్లో మనం మాట్లాడుకున్న యూదాకు చెందిన ప్రవక్త మీకు గుర్తున్నాడా? అణకువగా ఉండకపోవడం వల్ల అతను తన ప్రాణాన్ని, యెహోవాతో ఉన్న స్నేహాన్ని పోగొట్టుకున్నాడు. కానీ అణకువను చూపించడం కష్టమైన సందర్భాల్లో కూడా మనం ఆ లక్షణాన్ని చూపించగలం. అది సాధ్యమేనని ఎంతోమంది యెహోవా నమ్మకమైన సేవకులు రుజువు చేశారు. యెహోవాను ఎన్ని సంవత్సరాలుగా సేవిస్తుంటే, మనలో అణకువ అంత ఎక్కువ అవ్వాలి. (సామె. 8:13) మన పరిస్థితులు ఎలా ఉన్నా యెహోవాతో నడుస్తూ ఉండవచ్చు. అది మనకు దొరికే అత్యంత గొప్ప అవకాశం. కాబట్టి అణకువగా ఉండడానికి, యెహోవాతో నడుస్తూనే ఉండడానికి చేయగలిగినదంతా చేస్తూ ఉందాం.