కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అన్నీ విషయాలు ముందే మొహమాటం లేకుండా మాట్లాడుకోవడం చాలా ముఖ్యం

మీరు ప్రేమించే వాళ్లు కోలుకోలేని అనారోగ్యంతో బాధపడుతుంటే

మీరు ప్రేమించే వాళ్లు కోలుకోలేని అనారోగ్యంతో బాధపడుతుంటే

ఆయేషా భర్త అయిన సాహిల్‌కు భయంకరమైన బ్రెయిన్‌ ట్యూమర్‌ ఉందని తెలిసింది. a ఆయనకు 54 సంవత్సరాలే. డాక్టర్లు అతను ఇంక కొన్ని నెలలు మాత్రమే బ్రతుకుతాడని చెప్పారు. ఆమె ఇలా గుర్తు చేసుకుంటుంది: “అది విన్నప్పుడు నేను నమ్మలేకపోయాను. కొన్ని వారాల వరకు నాకేమి అర్థం కాలేదు. ఇదంతా మాకు కాదు వేరేవాళ్లకు జరుగుతున్నట్లు అనిపించింది. ఏం చేయాలో ఏంటో నాకేమి తెలియలేదు.”

ఆయేషా అలా స్పందించడంలో ఆశ్చర్యం లేదు. ప్రాణం తీసే వ్యాధులు ఎవరికైనా ఎప్పుడైనా రావచ్చు. కానీ మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే చాలామంది అలాంటి అనారోగ్య స్థితిలో ఉన్న తమవాళ్లను చూసుకోవడానికి సిద్ధంగా ఉంటారు. కానీ అలా చూసుకోవడం చాలా పెద్ద సవాలే. కోలుకోలేని అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్లకు ధైర్యాన్ని ఇవ్వడానికి, వాళ్లను చూసుకోవడానికి కుటుంబ సభ్యులు ఏమి చేయవచ్చు? వాళ్లను చూసుకునే వాళ్లు ఆ అనారోగ్యం ఉన్నంతకాలం ఎలాంటి భావాలకు ఆలోచనలకు లోనవ్వవచ్చు? మరణం దగ్గరపడుతుండగా ఏమేమి జరగవచ్చు? అయితే, కోలుకోలేని అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్లను చూసుకోవడం ఈ రోజుల్లో ఎందుకు అంత పెద్ద సవాలో ముందు చూద్దాం.

ఈ కాలంలో వచ్చిన సమస్య

చనిపోయే విధానాన్ని మెడికల్‌ సైన్సు మార్చేసింది. దాదాపు ఒక శతాబ్దం క్రితం బాగా అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా మనిషి ఆయుష్షు చాలా తక్కువగా ఉండేది. ప్రజలు అంటువ్యాధుల వల్ల లేదా యాక్సిడెంట్ల వల్ల త్వరగా చనిపోయేవాళ్లు. హాస్పటళ్లు దగ్గర్లో ఉండకపోవడం వల్ల చాలామందిని ఇంట్లోనే కుటుంబ సభ్యులు చూసుకునేవాళ్లు, వాళ్లు ఇంట్లోనే చనిపోయేవాళ్లు.

ఈ రోజుల్లో వైద్యపరంగా జరిగిన పురోగతి వల్ల మంచి నిపుణులైన డాక్టర్లు రోగాలతో ఎంతో పోరాడి ఆయుష్షు పొడిగిస్తున్నారు. ఇంతకుముందు ప్రాణాన్ని త్వరగా తీసేసే జబ్బులతో ఉన్న మనుషుల్ని కూడా ఇంకా ఎక్కువ సంవత్సరాలు బ్రతికించగలుగుతున్నారు. కానీ ఇలా ఆయుష్షును పెంచడం జబ్బును తగ్గించడం కాదు. రోగులు చాలావరకు ఎన్నో రుగ్మతలతో బ్రతకాల్సి ఉంటుంది. వాటివల్ల వాళ్లను వాళ్లు చూసుకోలేని స్థితి రావచ్చు. అలాంటి వాళ్లను చూసుకోవడం చాలాచాలా కష్టమే కాదు సవాలుగా కూడా ఉంటుంది.

ఇప్పుడు ఎక్కువగా ఇంట్లో కాకుండా హాస్పటల్‌లో చనిపోతున్నారు. మరణానికి దగ్గర్లో ఉన్నప్పుడు శరీరానికి ఏమి జరుగుతుందో చాలామందికి తెలియదు, ఎవరైనా చనిపోతుండగా చూసిన వాళ్లు చాలా తక్కువ. ఏం జరుగుతుందో అనే తెలియని భయం వల్ల చాలామంది అనారోగ్యంతో ఉన్న కుటుంబ సభ్యుని సరిగ్గా చూసుకోలేని స్థితిలో ఉంటారు లేదా ఏమీ చేయలేకపోతారు. అలాంటప్పుడు ఏమి చేయవచ్చు?

ముందే ప్లాన్‌ చేసుకోండి

ఆయేషా విషయంలో జరిగినట్లు ప్రియమైన వాళ్లకు ఎవరికైనా ప్రాణాంతకమైన వ్యాధి ఉందని తెలిసినప్పుడు చాలామందికి గుండె పగిలినట్లు అవుతుంది. విపరీతమైన కంగారు, భయం, దుఃఖం మధ్య రాబోయే విషయాల కోసం సిద్ధపడడానికి మీకు ఏమి సహాయం చేస్తుంది? ఒక నమ్మకమైన సేవకుడు దేవునికి ఇలా ప్రార్థన చేశాడు: “మాకు జ్ఞానహృదయము కలుగునట్లుగా చేయుము. మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము.” (కీర్తన 90:12) అవును, హృదయపూర్వకంగా యెహోవాకు ప్రార్థన చేస్తూ మీకున్న సమయాన్ని మీరు ప్రేమించే మీ వాళ్లతో సాధ్యమైనంత చక్కగా గడపడానికి మీ దినాలను తెలివిగా ‘లెక్కించుకోవడం’ నేర్పమని ఆయనను అడగవచ్చు.

అందుకు మంచి ప్రణాళిక ఉండాలి. అనారోగ్యంతో ఉన్నవాళ్లు ఇంకా మాట్లాడగలుగుతుంటే, వాళ్లు ఆలోచించలేని స్థితిలో ఉన్నప్పుడు వాళ్ల బదులు ఎవరు నిర్ణయాలు తీసుకోవాలో వాళ్లకు ఇష్టమైతే అడిగి తెలుసుకోండి. అత్యవసర చికిత్సల (resuscitation) గురించి వాళ్ల అభిప్రాయం ఎలా ఉంది, హాస్పటల్‌లో ఉండాలనుకుంటున్నారా లేదా, కొన్ని రకాల చికిత్సలు చేయించాలా వద్దా లాంటి విషయాలన్నీ సంకోచం లేకుండా అడిగి తెలుసుకోవడం వల్ల మనస్పర్థలు ఉండవు. తర్వాత అనారోగ్యంతో ఉన్న కుటుంబ సభ్యుని తరఫున నిర్ణయాలు తీసుకున్న కుటుంబ సభ్యులకు తప్పు నిర్ణయం తీసుకున్నామనే బాధ ఉండదు. అన్నీ విషయాలు ముందే మొహమాటం లేకుండా మాట్లాడుకోవడం వల్ల రోగిని జాగ్రత్తగా చూసుకోవడం మీద కుటుంబమంతా మనసు పెట్టవచ్చు. “ఆలోచన చెప్పువారు లేని చోట ఉద్దేశములు వ్యర్థమగును” అని బైబిలు చెప్తుంది.—సామెతలు 15:22.

ఎలా సహాయం చేయవచ్చు

సాధారణంగా పేషంట్‌ని చూసుకునే వాళ్ల ముఖ్య బాధ్యత ఓదార్పు, ఆదరణ ఇవ్వడమే. చనిపోబోయే వాళ్లు ఒంటరివాళ్లు కాదని, వాళ్లను అందరూ ప్రేమిస్తున్నారని భరోసాను ఇవ్వాలి. అలా ఎలా చేయవచ్చు? వాళ్లకోసం ఏదైనా చదివి వినిపించండి, పాడండి. వాళ్లకు ఇష్టమైన, వాళ్లకు ధైర్యాన్ని ఇచ్చే పాటల్ని పాడండి, పుస్తకాల్ని చదివి వినిపించండి. ఒక కుటుంబ సభ్యుడు వాళ్ల చెయ్యి పట్టుకున్నా వాళ్లతో నెమ్మదిగా మాట్లాడినా చాలామందికి ఓదార్పుగా ఉంటుంది.

చూడడానికి ఎవరు వచ్చారో చెప్పడం మంచిది. ఒక రిపోర్టు ప్రకారం: “ఐదు జ్ఞానేంద్రియాల్లో చివరి వరకు ఉండేది వినపడే శక్తి అంటారు. రోగి నిద్రపోతున్నట్లు ఉన్నా కూడా చెవులు చాలా బాగా పని చేస్తుండవచ్చు. కాబట్టి వాళ్లకు చెప్పకూడని విషయాలేమీ వాళ్ల ముందు మాట్లాడకోకూడదు.”

వీలైతే వాళ్లతో కలిసి ప్రార్థన చేయండి. బైబిల్లో ఒక సంఘటన ఇలా ఉంది: ఒకసారి అపొస్తలుడైన పౌలు అతని సహచరులు చాలా విపరీతమైన ఒత్తిడిలో ఉన్నారు, వాళ్లు బ్రతుకుతారో లేదో కూడా తెలియని పరిస్థితుల్లో ఉన్నారు. అప్పుడు వాళ్లు ఏ సహాయాన్ని కోరుకున్నారు? పౌలు అతని స్నేహితులతో ఇలా విన్నపం చేశాడు: “మా కోసం పట్టుదలగా ప్రార్థించడం ద్వారా మీరూ మాకు సహాయం చేయవచ్చు.” (2 కొరింథీయులు 1:8-11) తీవ్రమైన ఒత్తిడిలో, అనారోగ్య స్థితిలో ఉన్నప్పుడు మనస్ఫూర్తిగా చేసే ప్రార్థనకు చాలా విలువ ఉంటుంది.

వాస్తవాన్ని గుర్తించండి

మనం ప్రేమించేవాళ్లు చనిపోతున్నారు అనే విషయమే చాలా భయంకరంగా ఉంటుంది. ఎందుకంటే చావు సహజం కాదు. మరణం జీవితంలో ఒక భాగం అని అనుకుని సరిపెట్టుకునేలా మనం సృష్టించబడలేదు. (రోమీయులు 5:12) దేవుని వాక్యం మరణాన్ని ఒక “శత్రువు” అని పిలుస్తుంది. (1 కొరింథీయులు 15:26) కాబట్టి మనకిష్టమైన వాళ్లు చనిపోతున్నారు అని ఆలోచించడం కూడా మనకు ఇష్టం ఉండదు. అది సహజమే.

అయినప్పటికీ, ఏమి జరగబోతుందో తెలుసుకుని సిద్ధంగా ఉండడం వల్ల కుటుంబ సభ్యులు వాళ్ల భయాన్ని తగ్గించుకోవచ్చు, వీలైనంతవరకు అనారోగ్యంతో ఉన్నవాళ్లకు ఇబ్బంది కలగకుండా చూసుకోవచ్చు. చనిపోయే ముందు ఏమి జరుగుతుందో కొన్ని విషయాలు “ చివరి దశలో” అనే బాక్సులో ఉన్నాయి. అక్కడ ఇచ్చిన విషయాలన్నీ ప్రతి ఒక్కరికి జరగకపోవచ్చు, లేదా అదే క్రమంలో జరగకపోవచ్చు. కానీ చాలామంది రోగుల విషయంలో ఇలాంటి లక్షణాలు కొన్నైనా కనపడతాయి.

ప్రియమైన వాళ్లు చనిపోయినప్పుడు, మనకు ఇంతకుముందు సహాయానికి వచ్చిన దగ్గరి స్నేహితులు ఎవరితోనైనా మాట్లాడవచ్చు. వాళ్లను చూసుకున్నవాళ్లకు, కుటుంబ సభ్యులకు గుర్తు చేయాల్సిన విషయం ఏంటంటే చనిపోయినవాళ్లు ఇంక బాధపడడం లేదు, వాళ్ల కష్టం ఇంక తీరిపోయింది. మనుషుల్ని చేసిన సృష్టికర్త ప్రేమతో చెప్పేదేంటంటే చనిపోయినవాళ్లు “ఏమియు ఎరుగరు.”—ప్రసంగి 9:5.

అందరికన్నా బాగా చూసుకునే వ్యక్తి

ఎవరి సహాయాన్ని కాదనకుండా ఉండడం మనం నేర్చుకోవాలి

దేవుని మీద ఆధారపడడం చాలా ముఖ్యం. కుటుంబంలో ఒకరు అనారోగ్యంతో ఉన్న సమయంలోనే కాదు, వాళ్లు చనిపోయిన బాధతో ఉన్న సమయంలో కూడా దేవుని మీద ఆధారపడాలి. ఆయన ఇతరుల మంచి మాటలు, పనుల ద్వారా మనకు సహాయం చేస్తూనే ఉంటాడు. ఆయేషా ఇలా చెప్తుంది “ఎవరి సహాయాన్ని కాదనకుండా ఉండాలని నేను తెలుసుకున్నాను. నిజానికి మేము చాలాచాలా సహాయం పొందాము. యెహోవా ఇలా చెప్తున్నట్లు నా భర్తకు, నాకు ఇద్దరికి బాగా అనిపించింది: ‘నేను మీతోనే ఉన్నాను, దీన్ని తట్టుకోవడానికి మీకు సహాయం చేస్తాను.’ నేను అది ఎప్పుడూ మర్చిపోను.”

అవును అందరికన్నా మనల్ని బాగా చూసుకునేది యెహోవా దేవుడే. మనల్ని సృష్టించిన దేవునిగా ఆయన మన నొప్పిని మన బాధని అర్థం చేసుకోగలడు. తట్టుకోవడానికి అవసరమైన సహాయాన్ని ధైర్యాన్ని ఆయన ఇవ్వగలడు, ఆయనకు ఇవ్వాలని ఉంది కూడా. ఇంకా ఎక్కువగా ఆయన మరణం లేకుండా చేస్తానని, చనిపోయినా ఆయన మనసులో భద్రంగా ఉన్న కోట్లాదిమందిని తిరిగి బ్రతికిస్తాడని ఆయన మాట ఇస్తున్నాడు. (యోహాను 5:28, 29; ప్రకటన 21:3, 4) అప్పుడు మనందరం అపొస్తలుడైన పౌలులా ఇలా చెప్పవచ్చు: “మరణమా, నీ విజయం ఎక్కడ? మరణమా, నీ విషపు కొండి ఎక్కడ?”—1 కొరింథీయులు 15:55.

a అసలు పేర్లు కావు.