కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

సంతోషాన్ని తీసుకొచ్చే మార్గం

ప్రేమ

ప్రేమ

మనుషులు ప్రేమకోసం పరితపిస్తారు. భార్యాభర్తల బంధమైనా, కుటుంబాలైనా, స్నేహమైనా ప్రేమ లేకపోతే నిలవలేవు. కాబట్టి ప్రేమ మానసిక ఆరోగ్యానికి, సంతోషానికి చాలా అవసరం అనేది స్పష్టం. కానీ “ప్రేమ” అంటే ఏంటి?

మనం మాట్లాడుకునే ప్రేమ, ప్రేమికుల మధ్య ఉండే ప్రేమ కాదు. ఆ ప్రేమకుండే విలువ దానికి ఉంది. కానీ అంతకన్నా గొప్ప ప్రేమ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అది ఇతరుల సంక్షేమం కోసం మనల్ని మనం పక్కన పెట్టేసుకుని నిజమైన శ్రద్ధ చూపించేలా చేస్తుంది. ఈ ప్రేమ దేవుని నియమాల ఆధారంగా ఉంటుంది. కానీ అందులో ఆప్యాయత, అనురాగం ఏమి తక్కువ కావు.

ప్రేమ గురించి కొన్ని అందమైన మాటలు ఇలా ఉన్నాయి: “ప్రేమ ఓర్పు కనబరుస్తుంది, దయ చూపిస్తుంది. ప్రేమ ఈర్ష్యపడదు, గొప్పలు చెప్పుకోదు, గర్వంతో ఉబ్బిపోదు, మర్యాద లేకుండా ప్రవర్తించదు, స్వార్థం చూసుకోదు, త్వరగా కోపం తెచ్చుకోదు. హానిని మనసులో పెట్టుకోదు. అది అవినీతి విషయంలో సంతోషించదు కానీ, సత్యం విషయంలో సంతోషిస్తుంది. అది అన్నిటినీ భరిస్తుంది, . . . అన్నిటినీ నిరీక్షిస్తుంది, అన్నిటినీ సహిస్తుంది. ప్రేమ శాశ్వతంగా ఉంటుంది.”—1 కొరింథీయులు 13:4-8.

అలాంటి ప్రేమ “శాశ్వతంగా ఉంటుంది” అంటే ఆ ప్రేమ ఎప్పటికీ ఆగిపోదు అని అర్థం. చెప్పాలంటే కాలం గడిచే కొద్దీ అది ఇంకా బలపడుతుంది. ఇంకా ఆ ప్రేమలో ఓర్పు, దయ, క్షమాగుణం ఉన్నాయి కాబట్టి అది “పూర్తిస్థాయిలో ఒకటి చేస్తుంది.” (కొలొస్సయులు 3:14) అందుకే మనుషుల్లో లోపాలు లేదా అపరిపూర్ణతలు ఉన్నప్పటికీ అలాంటి ప్రేమ ఉన్న సంబంధాల్లో భద్రత, సంతోషం ఉంటాయి. ఉదాహరణకు వివాహబంధాన్ని చూద్దాం.

పరిపూర్ణమైన ప్రేమ ద్వారా ఐక్యమైన బంధం

యేసుక్రీస్తు భార్యాభర్తలకు సంబంధించి ముఖ్యమైన సూత్రాలు నేర్పించాడు. ఉదాహరణకు ఆయనిలా చెప్పాడు: “పురుషుడు అమ్మానాన్నలను విడిచిపెట్టి తన భార్యను అంటిపెట్టుకొని ఉంటాడు, వాళ్లిద్దరూ ఒక్క శరీరంగా ఉంటారు. . . . అందుకే దేవుడు ఒకటి చేసినవాళ్లను ఏ మనిషీ విడదీయకూడదు.” (మత్తయి 19:5, 6) ఇందులో కనీసం రెండు ముఖ్యమైన సూత్రాలు కనిపిస్తున్నాయి.

“వాళ్లిద్దరూ ఒక్క శరీరంగా ఉంటారు.” మనుషుల మధ్య ఉండే బంధాల్లో అత్యంత సన్నిహితమైన కలయిక పెళ్లి. ప్రేమ ఆ పెళ్లిని వ్యభిచారం నుండి కాపాడుతుంది. భర్త లేదా భార్య కాని వేరేవాళ్లతో “ఒక్క శరీరం” అవ్వడమే వ్యభిచారం. (1 కొరింథీయులు 6:16; హెబ్రీయులు 13:4) మోసం నమ్మకాన్ని పాడుచేసి వివాహాన్ని విచ్ఛిన్నం చేస్తుంది. పిల్లలు ఉంటే వాళ్లు మానసికంగా బాగా దెబ్బ తింటారు, వాళ్లను ప్రేమించే వాళ్లు లేరని అనుకుంటారు, అభద్రతతో, కోపంతో ఉంటారు.

‘దేవుడు ఒకటి చేసినవాళ్లు’ వివాహం ఒక పవిత్ర బంధం. ఈ విషయాన్ని గౌరవించే భార్యాభర్తలు వాళ్ల వివాహాన్ని బలపరచుకోవడానికి కష్టపడతారు. సమస్యలు వచ్చినప్పుడు ఆ బంధం నుండి బయటపడాలని కోరుకోరు. వాళ్ల ప్రేమ బలంగా ఉంటుంది, చెక్కుచెదరదు. అలాంటి ప్రేమ “అన్నిటినీ భరిస్తుంది.” వివాహాన్ని సామరస్యంగా, శాంతిగా ఉంచుకోవడానికి సమస్యల్ని పరిష్కరించుకునేలా ప్రేమ సహాయం చేస్తుంది.

తల్లిదండ్రుల మధ్య నిస్వార్థమైన ప్రేమ ఉంటే కుటుంబంలో పిల్లలకు చాలా ప్రయోజనాలు కలుగుతాయి. జెస్సికా అనే అమ్మాయి ఇలా అంటుంది: “మా అమ్మానాన్న ఒకరినొకరు నిజంగా ప్రేమించుకుంటారు, గౌరవించుకుంటారు. పిల్లలుగా మమ్మల్ని చూసుకునే విషయంలో మా అమ్మ మా నాన్నను గౌరవించడం చూసి నాకూ ఆమెలానే ఉండాలని అనిపిస్తుంది.”

దేవుని లక్షణాల్లో ప్రేమ ముఖ్యమైనది. నిజానికి బైబిలు ఇలా చెప్తుంది: “దేవుడు ప్రేమ.” (1 యోహాను 4:8) అందుకే యెహోవా దేవున్ని “సంతోషంగల దేవుడు” అని చెప్పడంలో ఆశ్చర్యం లేదు. (1 తిమోతి 1:11) మనం కూడా మన సృష్టికర్త లక్షణాలను ముఖ్యంగా ఆయన ప్రేమను అనుకరిస్తే సంతోషంగా ఉంటాము. “దేవునికి ఇష్టమైన పిల్లల్లా మీరు ఆయన్ని అనుకరించండి, . . . ప్రేమతో నడుచుకోండి” అని ఎఫెసీయులు 5:1, 2 చెప్తుంది.