కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అద్భుతమైన ఆర్కిటిక్‌ సముద్రపక్షి

అద్భుతమైన ఆర్కిటిక్‌ సముద్రపక్షి

ఇంతకుముందు ఆర్కిటిక్‌ సముద్రపక్షులు ఆర్కిటిక్‌ ప్రాంతం నుండి అంటార్కిటికాకు వెళ్లిరావడానికి దాదాపు 35,200 కి.మీ ఎగిరేవని నమ్మేవాళ్లు. కానీ ఇటీవలి అధ్యయనాల ప్రకారం ఆ పక్షులు నిజానికి అంతకన్నా ఎక్కువ దూరం ప్రయాణిస్తాయని తెలిసింది.

బొమ్మలో చూపిస్తున్నట్లు సముద్రపక్షులు వలస వెళ్లడానికి నేరుగా ఉన్న దారిలో కాకుండా తిరిగి తిరిగి వెళ్తాయి

జియోలొకేటర్స్‌ అనే చిన్న పరికరాలను చాలా పక్షులకు పెట్టారు. అవి చిన్న పేపర్‌ క్లిప్‌ బరువు మాత్రమే ఉంటాయి. కొన్ని సముద్రపక్షులు వెళ్లిరావడానికి సగటున 90,000 కి.మీ దూరం ప్రయాణిస్తాయని ఈ అద్భుతమైన పరికరాల ద్వారా తెలిసింది. వలస వెళ్లే జంతువులు చేసే సుదీర్ఘ ప్రయాణం ఇదే కావచ్చు. ఒక పక్షి అయితే దాదాపు 96,000 కి.మీ ప్రయాణం చేసింది. ఆ అంచనాలు ఎందుకు మారాయి?

ఎక్కడనుండి వలస మొదలు పెట్టినా, ఆర్కిటిక్‌ పక్షులు నేరుగా ఉన్న దారిలో ప్రయాణించవు. బొమ్మలో చూపించినట్లు, ఈ పక్షులు ఎక్కువగా వెళ్లే అట్లాంటిక్‌ మహాసముద్ర మార్గం ‘S’ ఆకారంలో ఉంటుంది. ఎందుకు? ఎందుకంటే ఆ పక్షులు గాలి వీచే దిశల్లో ప్రయాణిస్తాయి.

దాదాపు వాటి 30 సంవత్సరాల జీవితకాలంలో, సముద్రపక్షులు 24 లక్షల కి.మీ కన్నా ఎక్కువ దూరం ప్రయాణిస్తాయి. అది చంద్రుడి దగ్గరికి మూడు నాలుగు సార్లు వెళ్లి రావడంతో సమానం. “100 గ్రాముల కన్నా కాస్త ఎక్కువ బరువు ఉండే చిన్న పక్షి ఇలా ప్రయాణించడం చాలా అద్భుతం” అని ఒక పరిశోధకుడు అంటున్నాడు. ఇంకా చెప్పాలంటే ఆర్కిటిక్‌ సముద్రపక్షులు రెండు ధ్రువాల్లో ఎండాకాలాన్ని ఆస్వాదిస్తాయి. “మిగతా ఏ జీవికన్నా ఎక్కువ పగలును అనుభవించేది” కూడా ఆ పక్షులే అని మైగ్రేటరీ బర్డ్స్‌ అనే పుస్తకం చెప్తుంది.