కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మీరు ఫోన్లు, కంప్యూటర్లకు అతుక్కుపోతున్నారా?

మీరు ఫోన్లు, కంప్యూటర్లకు అతుక్కుపోతున్నారా?

జెన్ని ఒక వీడియో గేముకు బానిసైపోయింది. ఆమె ఇలా అంటుంది: “ఇప్పుడు నేను రోజుకు ఎనిమిది గంటలు ఆ గేమ్‌ ఆడుతూ ఉంటాను. అదొక పెద్ద సమస్యలా తయారైంది.”

డెనిస్‌ ఫోను, ఇంటర్నెట్‌ లేకుండా ఏడు రోజులు ఉండాలనుకున్నాడు. కానీ 40 గంటలే ఉండగలిగాడు.

జెన్ని, డెనిస్‌ ఇద్దరూ చిన్నవాళ్లేం కాదు. జెన్నికి 40 సంవత్సరాలు, నలుగురు పిల్లల తల్లి. డెనిస్‌కు 49 సంవత్సరాలు.

మీరు ఫోన్లు, కంప్యూటర్లు వాడతారా? a చాలామంది వాడతారు. ఎందుకంటే అవి చాలా ఉపయోగపడతాయి. ఉద్యోగానికి, వినోదానికి, స్నేహితులతో-బంధువులతో మాట్లాడడానికి అవి బాగా ఉపయోగపడతాయి.

కానీ జెన్ని, డెనిస్‌లా చాలామంది వీటిని అతిగా వాడతారు. 20 ఏళ్ల నికోల్‌ కూడా అంతే. ఆమె ఇలా అంటుంది: “నాదొక వింత పరిస్థితి. చెప్పాలంటే కొంచెం సిగ్గుగానే ఉంది కానీ నా ఫోనే నా బెస్ట్‌ ఫ్రెండ్‌. అది ఎప్పుడూ నా పక్కనే ఉండేలా చూసుకుంటా. నెట్‌వర్క్‌ లేని ప్రాంతంలో ఉంటే నాకు పిచ్చెక్కిపోతుంది. అరగంట అయ్యిందా అంతే! ఏ మెసేజ్‌ వచ్చిందా అని చూసుకుంటూ ఉంటా.”

మెసేజ్‌ల కోసం, ఇతర అప్‌డేట్స్‌ కోసం కొంతమంది రాత్రంతా ఫోన్లు, కంప్యూటర్లు చూస్తూ ఉంటారు. అవి ఎప్పుడూ వాళ్లతో ఉండాలనుకుంటారు. వాటిని దూరం పెడితే కొన్నిసార్లు వాళ్ల ఆరోగ్యం కూడా పాడౌతుంది. ఇలా ఫోన్‌, కంప్యూటర్‌ లేదా ఇంటర్నెట్‌కు బాగా అలవాటు పడిపోవడాన్ని వ్యసనం అని కొంతమంది పరిశోధకులు అంటున్నారు. వేరే పరిశోధకులు “వ్యసనం” అనే పెద్ద మాట వాడకపోయినా వాటికి అలవాటుపడ్డ వాళ్లలో ఏదో సమస్య ఉందని, ఆ అలవాటును మానుకోలేకపోతున్నారని అంటారు.

ఎవరేమన్నా ఫోన్‌, కంప్యూటర్‌ లాంటి వాటిని అతిగా ఉపయోగించడం మంచిది కాదు. కొన్నిసార్లయితే అవి కుటుంబ సభ్యుల మధ్య దూరం పెంచుతున్నాయి. 20 ఏళ్ల ఓ అమ్మాయి ఇలా బాధపడుతుంది: “నా జీవితంలో ఏం జరుగుతుందో మా నాన్నకు ఏమీ తెలీదు. నాతో మాట్లాడుతూనే ఈ-మెయిల్స్‌ రాస్తూ ఉంటారు. ఫోన్‌ను పక్కన పెట్టలేరు. నేనంటే శ్రద్ధ ఉండవచ్చు, కానీ ఒక్కోసారి ఆయన నన్ను పట్టించుకోరేమో అనిపిస్తుంది.”

మానుకోవాలంటే . . .

చైనా, దక్షిణ కొరియా, బ్రిటన్‌, అమెరికా లాంటి దేశాల్లో ఫోన్లు, కంప్యూటర్లు అతిగా ఉపయోగించే వాళ్లకు ఆ అలవాటు తగ్గించడానికి కొన్ని కేంద్రాలు ఉన్నాయి. ఆ కేంద్రాల్లో ఇంటర్నెట్‌, ఫోన్‌, కంప్యూటర్‌ లాంటివి వాడనివ్వరు. బ్రెట్‌ అనే యువకుడినే చూడండి. ఒకప్పుడు ఆయన రోజుకు 16 గంటలు ఇంటర్నెట్‌లో ఒక గేమ్‌ ఆడేవాడు. ఆయనిలా అంటున్నాడు: “ఇంటర్నెట్‌ వాడుతుంటే, నాకు మందు తాగినట్టు కిక్‌ ఎక్కుతుంది.” బ్రెట్‌ సహాయం కోసం అలాంటి ఒక కేంద్రానికి వెళ్లాడు. అప్పటికే ఆయనకు ఉద్యోగం పోయింది, స్నేహితులు దూరమయ్యారు, శుచీశుభ్రత మర్చిపోయాడు. అంత ఘోరమైన పరిస్థితి రాకుండా ఉండాలంటే మీరేమి చేయవచ్చు?

ఎంతగా వాడుతున్నారో చూసుకోండి. మీ జీవితంపై ఫోన్లు, కంప్యూటర్ల ప్రభావం ఎంతగా ఉంది? ఈ ప్రశ్నలు వేసుకోండి:

  • ఇంటర్నెట్‌, ఫోన్‌, కంప్యూటర్‌ లేనప్పుడు నాకు అనవసరంగా విసుగొస్తుందా, కోపం వస్తుందా?

  • ఫోన్‌ను, కంప్యూటర్‌ను అనుకున్న సమాయానికి మించి వాడుతున్నానా?

  • మెసేజ్‌లు చూసుకుంటూ నిద్ర మానుకుంటున్నానా?

  • ఫోన్‌, కంప్యూటర్‌ వాడుతూ కుటుంబ సభ్యులను వదిలేస్తున్నానా? ఈ ప్రశ్న నా కుటుంబ సభ్యులను అడిగితే వాళ్లేమంటారు?

ముఖ్యమైన విషయాలను అంటే కుటుంబాన్ని, ఇతర బాధ్యతలను పట్టించుకోనంతగా ఫోన్‌, కంప్యూటర్‌ వాడుతున్నారా? అయితే ఇప్పుడే మిమ్మల్ని మీరు మార్చుకోండి. (ఫిలిప్పీయులు 1:9, 10) ఎలా?

హద్దులు పెట్టుకోండి. తేనె బాగుందని ఎక్కువగా తినం కదా! అలానే పని కోసమైనా, ఆటల కోసమైనా ఫోన్‌, కంప్యూటర్‌ ఎంత సేపు వాడాలో ముందే నిర్ణయించుకోండి, అంత సేపే వాడండి.

చిట్కా: కుటుంబ సభ్యుల లేదా స్నేహితుల సహాయం తీసుకోండి. ‘ఒంటరిగా ఉండుటకంటె ఇద్దరు కూడి ఉండుట మేలు. ఒకడు పడిపోయినను ఒకడు తనతోటివానిని లేవనెత్తును’ అని పరిశుద్ధ గ్రంథంలో ఉంది.—ప్రసంగి 4:9, 10.

అవసరం “వ్యసనం” కాకుండా చూసుకోండి

కొత్తకొత్త పరికరాల వల్ల ఏవైనా పంపించడం, చూడడం తేలికైపోయింది. దానితో చాలామంది వాటికే అతుక్కుపోతున్నారు. అయితే అవసరం “వ్యసనం” కాకుండా చూసుకోండి. సమయాన్ని జాగ్రత్తగా ఉపయోగిస్తే ఫోన్‌, కంప్యూటర్‌ను సరిగ్గా వాడతారు.—ఎఫెసీయులు 5:15, 16. ◼ (g15-E 04)

a ఈ ఆర్టికల్‌లో ఫోన్లు, కంప్యూటర్లు అన్నప్పుడు ఫోన్‌ కాల్స్‌ చేసుకోడానికి, గేమ్స్‌ ఆడడానికి, ఈ-మెయిల్స్‌, మెసేజ్‌లు, వీడియోలు, ఫోటోలు, పాటలు, లాంటి వాటిని చూసుకోవడానికి పంపించడానికి ఉపయోగించే పరికరాలు.