కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

కుటుంబ సంతోషానికి తోడ్పడే అంశాలు

మీ పిల్లల్లో నైతిక విలువల్ని నాటండి

మీ పిల్లల్లో నైతిక విలువల్ని నాటండి

మెక్సికోలో ఉంటున్న లోయిడా a అనే ఒక తల్లి ఇలా చెబుతోంది, “స్కూల్లో పిల్లలకు కండోమ్‌లు ఇస్తారు కాబట్టి వాటిని ఉపయోగించి ‘సురక్షితమైన’ సెక్స్‌లో పాల్గొన్నంతవరకు అందులో తప్పేమీ లేదని యౌవనస్థులు అనుకుంటారు.”

జపాన్‌లో ఉంటున్న నోబుకో అనే ఒక తల్లి ఇలా చెబుతోంది, “‘ఒకవేళ నువ్వు నీ స్నేహితురాలితో ఒంటరిగా ఉన్నావనుకో అప్పుడేమి చేస్తావు’ అని మా అబ్బాయిని అడిగాను, దానికి వాడు ‘ఏమో నాకు తెలీదు’ అన్నాడు.”

మీ అబ్బాయి లేదా అమ్మాయి బుడిబుడి అడుగులు వేసే వయసులో ఉన్నప్పుడు వాళ్లకు ఎలాంటి ప్రమాదం జరగకూడదని మీరు ఎన్నో జాగ్రత్తలు తీసుకొనివుంటారు. మీ పిల్లలు స్విచ్‌ బోర్డులలో వేళ్లు పెట్టకుండా వాటి మీద మీరు ఏదైనా అంటించివుంటారు, మొనదేలిన వస్తువులేవీ వాళ్లకు అందకుండా చూసివుంటారు, మెట్లకు అడ్డుగా ఏదైనా పెట్టివుంటారు. మీరు ఇవన్నీ చేసింది వాళ్లు సురక్షితంగా ఉండాలనే.

అయితే కాస్త పెద్దవయసు వచ్చిన మీ పిల్లలను కాపాడడం అంత సులువైతే ఎంత బాగుంటుందో! ఇప్పుడు మీకు మరో విధమైన ఆందోళనలు ఉంటాయి, ‘మా అబ్బాయి అశ్లీల దృశ్యాలు చూస్తున్నాడా?’ ‘మా అమ్మాయి తన అర్థనగ్న చిత్రాలను మొబైల్‌లో వేరే వాళ్లకు పంపిస్తూ ‘సెక్స్‌టింగ్‌’ చేస్తోందా?’ మరింత భయాందోళన కలిగించే ప్రశ్న ఏమిటంటే ‘మా పిల్లలు సెక్స్‌లో పాల్గొంటున్నారా?’

అదుపు చేయడం వల్ల ప్రయోజనం అంతగా ఉండదు

కొంతమంది తల్లిదండ్రులు ఎప్పుడూ తమ పిల్లల వెంటేవుంటూ వాళ్ల ప్రతీ కదలిక కనిపెడుతూ 24 గంటలు వాళ్ల మీద నిఘా వేసి ఉంచడానికి ప్రయత్నిస్తుంటారు. అలా చేస్తే, పిల్లలు తాము చేసేదాన్ని దాచే ప్రయత్నం చేస్తారని చాలామంది తల్లిదండ్రులకు ఆ తర్వాత అర్థమైంది. తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఎలాంటి చెడు ప్రవర్తన నుండి కాపాడాలని చూశారో ఆ చెడు ప్రవర్తనను దాచిపెట్టడంలోనే పిల్లలు ప్రవీణులయ్యారు.

అదుపు చేయడం వల్ల ప్రయోజనమేమీ ఉండదని స్పష్టంగా తెలుస్తోంది. తను సృష్టించిన మానవులు తను చెప్పినట్టు వినాలని యెహోవా దేవుడే బలవంతం చేయడం లేదు, మీరు కూడా మీ పిల్లలను బలవంతం చేయకూడదు. (ద్వితీయోపదేశకాండము 30:19) కాబట్టి, నైతిక విషయాల్లో జ్ఞానవంతమైన నిర్ణయాలు తీసుకునేలా మీ పిల్లలకు ఎలా సహాయం చేయవచ్చు?సామెతలు 27:11.

ముఖ్యంగా, మీ పిల్లలతో చిన్నప్పటి నుండే ఈ విషయాల గురించి మాట్లాడడం మొదలుపెట్టాలి. b (సామెతలు 22:6) వాళ్లు యుక్తవయసుకు వచ్చాక కూడా ఆ విషయాల గురించి మాట్లాడుతూ ఉండండి. తల్లిదండ్రులుగా మీరే మీ పిల్లలకు ఈ విషయాల గురించి సరిగ్గా తెలియజేయాలి. బ్రిటన్‌లో ఉంటున్న అలీషియా అనే అమ్మాయి ఇలా చెబుతోంది, “సెక్స్‌ గురించి మేము మా స్నేహితులతో మాట్లాడడానికి ఇష్టపడతామని చాలామంది అనుకుంటారు కానీ, అది నిజం కాదు. ఈ విషయాల గురించి మా తల్లిదండ్రులు మాతో మాట్లాడితేనే బాగుంటుంది. మేము వాళ్లు చెప్పేదాన్ని నమ్ముతాం.”

మంచి విలువలు అవసరం

వాళ్లు పెద్దవాళ్లయ్యేకొద్దీ, పిల్లలు ఎలా పుడతారనే విషయం మాత్రమే కాదుగానీ సెక్స్‌ గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవాలి. అంతేకాదు, ‘మంచి చెడులను గుర్తించే’ విధంగా వాళ్ల వివేచనా సామర్థ్యాలకు పదునుపెట్టాలి. (హెబ్రీయులు 5:14) క్లుప్తంగా చెప్పాలంటే, వాళ్లకు నైతిక విలువలు అంటే లైంగిక విషయాలకు సంబంధించిన నీతినియమాలు ఉండాలి, అంతేకాదు వాళ్లు వాటి ప్రకారం నడుచుకోవాలి. మీరు మీ పిల్లల్లో మంచి విలువలు ఎలా నాటవచ్చు?

మీకు ఎలాంటి నైతిక విలువలు ఉన్నాయో మొదట పరిశీలించుకోండి. ఉదాహరణకు, ‘వ్యభిచారం’ తప్పని అంటే పెళ్లికాని వ్యక్తులు లైంగిక సంబంధం పెట్టుకోవడం తప్పని మీరు బలంగా నమ్ముతుండవచ్చు. (1 థెస్సలొనీకయులు 4:3, పరిశుద్ధ బైబిల్‌: తెలుగు ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌) ఈ విషయంలో మీ ఉద్దేశమేమిటో బహుశా మీ పిల్లలకు తెలిసివుండవచ్చు, మీరు ఏ బైబిలు వచనాల ఆధారంగా దాన్ని నమ్ముతున్నారో కూడా వాళ్లు చెప్పగలుగుతుండవచ్చు. ‘పెళ్లికి ముందు లైంగిక సంబంధం పెట్టుకోవడం తప్పా?’ అని ఎవరైనా ప్రశ్నిస్తే వెంటనే వాళ్లు ‘అవును, తప్పే’ అని జవాబివ్వొచ్చు.

అయితే అలా జవాబివ్వడం మాత్రమే సరిపోదు. కొంతమంది యౌవనస్థులు పైకి మాత్రం సెక్స్‌ విషయంలో తమ తల్లిదండ్రుల నమ్మకాలతో ఏకీభవిస్తున్నట్టు చెబుతారని సెక్స్‌ స్మార్ట్‌ అనే పుస్తకం తెలియజేస్తోంది. “వాళ్లు, ఏదైనా ఒక విషయంలో త్వరగా తమ సొంత అభిప్రాయాలను ఏర్పర్చుకోలేరు. అనుకోని పరిస్థితులు ఏవైనా ఎదురైతే వాళ్లు, ‘ఏది సరైనది, ఏది కాదు’ అనేది వెంటనే నిర్ణయించుకోలేక సందిగ్ధంలో పడిపోయి, అయోమయంతో సమస్యలో చిక్కుకుంటారు” అని ఆ పుస్తకం చెబుతోంది. ఖచ్చితంగా అందుకే, వాళ్లకు నైతిక విలువలు ఉండాలి. వాటిని సంపాదించుకోవడానికి మీరు మీ పిల్లలకు ఎలా సహాయం చేయవచ్చు?

మీ నైతిక విలువలను స్పష్టంగా తెలియజేయండి.

వివాహితుల మధ్యే లైంగిక సంబంధాలు ఉండాలని మీరు నమ్ముతున్నారా? అలాగైతే మీరు మీ పిల్లలకు ఆ విషయాన్ని స్పష్టంగా, తరచూ తెలియజేస్తుండండి. బియాండ్‌ ద బిగ్‌ టాక్‌ అనే పుస్తకం ప్రకారం, “పిల్లలు లైంగిక సంబంధాలు పెట్టుకోవడం తాము ఆమోదించమని తల్లిదండ్రులు తమ పిల్లలకు స్పష్టంగా చెప్పిన కుటుంబాల్లోని పిల్లలు లైంగిక సంబంధాలు పెట్టుకోవడానికి తొందరపడకుండా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది” అని పరిశోధనలో తేలింది.

పైన చెప్పినట్లు, మీ నైతిక విలువల గురించి మీ పిల్లలకు తెలియజేసినంత మాత్రాన వాళ్లు వాటి ప్రకారమే జీవించాలని నిర్ణయించుకుంటారనేమీ లేదు. అయితే, మీ కుటుంబం ఎలాంటి నైతిక విలువలు కలిగివుండాలని మీరు అనుకుంటున్నారో స్పష్టంగా తెలియజేస్తే వాళ్లు ఆ పునాది ఆధారంగా తమ సొంత విలువలను ఏర్పరచుకుంటారు. చాలామంది యౌవనస్థులు, యౌవనంలో ఉన్నప్పుడు తమ తల్లిదండ్రుల విలువలను పక్కన పెట్టినట్టు అనిపించినా ఆ తర్వాత్తర్వాత తల్లిదండ్రుల నైతిక విలువలను పాటించినట్లు అధ్యయనాల్లో తేలింది.

ఇలా చేసి చూడండి: వార్తల్లో వచ్చిన ఏదైనా ఒక విషయం తీసుకుని మాట్లాడడం మొదలుపెట్టి మీ నైతిక విలువల గురించి చెప్పండి. ఉదాహరణకు, వార్తల్లో ఏదైనా ఒక లైంగిక నేరం గురించి వస్తే మీరిలా అనవచ్చు, “కొంతమంది మగవాళ్లు ఆడవాళ్లను ఎలా వేధిస్తారో చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. వాళ్లకు అలాంటి ఆలోచనలు ఎలా వస్తాయో?”

సెక్స్‌ గురించి అన్ని విషయాలు తెలియజేయండి.

ఈ విషయంలో వాళ్లను హెచ్చరించడం అవసరమే. (1 కొరింథీయులు 6:18; యాకోబు 1:14, 15) అయితే, బైబిలు ముఖ్యంగా సెక్స్‌ దేవుడిచ్చిన బహుమానమని చెబుతుందే గానీ సాతాను ఉపయోగించే ఎర అని కాదు. (సామెతలు 5:18, 19; పరమగీతము 1:2) మీరు మీ పిల్లలకు దానివల్ల వచ్చే ప్రమాదాల గురించి మాత్రమే చెబితే ఆ విషయంలో వాళ్లు తప్పు ఆలోచనను, లేఖనాలకు విరుద్ధమైన ఆలోచనను ఏర్పర్చుకునే అవకాశముంది. ఫ్రాన్స్‌లో ఉంటున్న కరీనా అనే యౌవనస్థురాలు ఇలా అంటోంది, “లైంగిక అనైతికత తప్పని మా అమ్మానాన్నలు మరీ ఎక్కువగా చెబుతుండేవాళ్లు, దాంతో సెక్స్‌ గురించి నేను ప్రతికూల వైఖరి ఏర్పర్చుకున్నాను.”

మీ పిల్లలకు సెక్స్‌ గురించి అన్ని విషయాలు తెలియజేయండి. మెక్సికోలో ఉంటున్న నాడ్యా అనే ఒక తల్లి ఇలా అంటోంది, “సెక్స్‌ ఎంతో బాగుంటుందని, అది సహజమని, యెహోవా దేవుడు దాన్ని మానవుల సంతృప్తి కోసమే ఇచ్చినా వివాహితుల మధ్య మాత్రమే అలాంటి సంబంధం ఉండాలని, అప్పుడే సంతోషం కలుగుతుందని, అవివాహితులు ఆ సంబంధం పెట్టుకుంటే కష్టాలు వస్తాయని మా పిల్లల మనసుల్లో నాటడానికి ఎప్పుడూ ప్రయత్నించాను.”

ఇలా చేసి చూడండి: ఈసారి సెక్స్‌ గురించి మీ పిల్లలతో మాట్లాడేటప్పుడు దాని గురించి సానుకూలంగా చెబుతూ సంభాషణ ముగించండి. సెక్స్‌ అనేది యెహోవా ఇచ్చిన అద్భుతమైన బహుమానమని, భవిష్యత్తులో పెళ్లయిన తర్వాత దాన్ని ఆనందించవచ్చని చెప్పడానికి సంకోచించకండి. అప్పటివరకు వాళ్లు దేవుని ప్రమాణాల ప్రకారం జీవించగలరనే నమ్మకాన్ని వ్యక్తం చేయండి.

పర్యవసానాలను తెలుసుకోవడానికి సహాయం చేయండి.

యౌవనస్థులు జీవితంలో ఏ విషయంలోనైనా మంచి నిర్ణయాలు తీసుకోవాలంటే, తమకున్న అవకాశాలను ఎలా గుర్తించాలో, ఆ తర్వాత ప్రతీ అవకాశం వల్ల వచ్చే లాభనష్టాలను ఎలా బేరీజు వేసుకోవాలో వాళ్లకు తెలిసుండాలి. ఏది సరైనదో, ఏది కాదో వాళ్లు తెలుసుకుంటే సరిపోతుందని అనుకోవద్దు. ఆస్ట్రేలియాలో ఉంటున్న ఇమ్మా అనే క్రైస్తవ స్త్రీ ఇలా చెబుతోంది, “యౌవనంలో నేను చేసిన తప్పుల గురించి ఆలోచిస్తే, మనకు దేవుని ప్రమాణాలు తెలిసివున్నంత మాత్రాన మనం వాటితో ఏకీభవిస్తామని చెప్పలేమన్నది నాకు అర్థమైంది. ఆ ప్రమాణాలు పాటించడం వల్ల వచ్చే ప్రయోజనాలను, పాటించకపోవడం వల్ల వచ్చే పర్యవసానాలను అర్థంచేసుకోవడం చాలా ముఖ్యం.”

ఈ విషయంలో బైబిలు సహాయం చేస్తుంది, ఎందుకంటే అందులోవున్న చాలా ఆజ్ఞలతోపాటు, వాటిని మీరితే వచ్చే పర్యవసానాలు కూడా స్పష్టంగా తెలియజేయబడ్డాయి. ఉదాహరణకు, వ్యభిచారం చేస్తే ‘మీ మీద ప్రజలకున్న గౌరవం పోతుంది’ కాబట్టి వ్యభిచారం చేయవద్దని సామెతలు 5:8, 9 (పరిశుద్ధ బైబిల్‌: తెలుగు ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌) యౌవనస్థులకు చెబుతోంది. ఆ వచనాలు చెబుతున్నట్లు, వివాహానికి ముందు లైంగిక సంబంధాలు పెట్టుకునేవాళ్ల సొంత నైతిక విలువలు దెబ్బతింటాయి, వాళ్లు మనస్ఫూర్తిగా దేవుణ్ణి ఆరాధించలేరు, వాళ్లు తమకున్న గౌరవాన్ని పోగొట్టుకుంటారు. అలాంటి వాళ్లను నైతిక విలువలున్న, మనస్ఫూర్తిగా దేవుణ్ణి ఆరాధించే, గౌరవంవున్న వాళ్లెవరూ పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడకపోవచ్చు. దేవుని సూత్రాలను ఉల్లంఘించడం వల్ల వచ్చే శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ప్రమాదాల గురించి ఆలోచిస్తే, ఆ సూత్రాల ప్రకారం జీవించాలని మీ పిల్లలు చేసుకున్న తీర్మానం బలపడుతుంది. c

ఇలా చేసి చూడండి: దేవుని ప్రమాణాలను పాటించడం జ్ఞానయుక్తమైనదని మీ పిల్లలు గ్రహించాలంటే దృష్టాంతాలతో వివరించండి. ఉదాహరణకు మీరిలా చెప్పవచ్చు, “చలిమంట మంచిదే గానీ కార్చిచ్చు మంచిది కాదు. ఆ రెండిటి మధ్యవున్న తేడా ఏమిటి? నీ జవాబు సెక్స్‌  విషయంలో దేవుడు నియమించిన హద్దులకు ఎలా వర్తిస్తుంది?” వ్యభిచారం వల్ల వచ్చే హానికరమైన పర్యవసానాలను అర్థం చేసుకునేలా మీ పిల్లలకు సహాయం చేయడానికి సామెతలు 5:3-14లోవున్న వృత్తాంతాన్ని ఉపయోగించండి.

జపాన్‌లో ఉంటున్న 18 ఏళ్ల టాకావా ఇలా చెబుతున్నాడు, “సరైనదే చేయాలని నాకు తెలుసు అయినా శరీర కోరికలతో పోరాడుతూనే ఉండాలి.” అలా అనుకునే యౌవనస్థులు, అందరూ ఆ కోరికలతో పోరాడాల్సిందేనని తెలుసుకుని ఊరట పొందవచ్చు. ‘మంచి చేయాలనే ఇష్టమున్న నాలో చెడు ఉంది’ అని దైవభక్తిగల క్రైస్తవుడు, అపొస్తలుడు అయిన పౌలు కూడా ఒప్పుకున్నాడు.—రోమీయులు 7:21 పవిత్ర గ్రంథం, వ్యాఖ్యాన సహితం.

అలాంటి పోరాటం అన్ని సమయాల్లో చెడ్డదేమీ కాదన్న విషయాన్ని యౌవనస్థులు గుర్తుంచుకుంటే మంచిది. అది తాము ఎలాంటి వ్యక్తులుగా తయారవ్వాలనేది ఆలోచించుకోడానికి వాళ్లను ప్రేరేపిస్తుంది. అంతేకాదు, ఈ ప్రశ్న గురించి బాగా ఆలోచించడానికి కూడా అది వాళ్లకు సహాయం చేస్తుంది, ‘నేను నా జీవితాన్ని నా అధీనంలో ఉంచుకుని నైతిక విలువలున్న, మనస్ఫూర్తిగా దేవుణ్ణి ఆరాధించే వ్యక్తి అనే పేరు సంపాదించుకోవాలనుకుంటున్నానా? కోరికలకు సులువుగా లొంగిపోయే బలహీనమైన వ్యక్తి అనే పేరు సంపాదించుకోవాలనుకుంటున్నానా?’ మీ పిల్లలకు మంచి నైతిక విలువలుంటే ఆ ప్రశ్నకు జ్ఞానయుక్తంగా జవాబివ్వగలుగుతారు. (w11-E 02/01)

a అసలు పేర్లు కావు.

b సెక్స్‌ గురించి మీ పిల్లలతో మాట్లాడడం ఎలా మొదలుపెట్టాలో, మీ పిల్లల వయసుకు తగిన విషయాలను ఎలా చెప్పాలో తెలుసుకోడానికి కావలికోట, ఏప్రిల్‌ - జూన్‌, 2011, 20-22 పేజీలు చూడండి.

c ఈ విషయం గురించి ఎక్కువ తెలుసుకోవాలంటే, యెహోవాసాక్షులు ప్రచురిస్తున్న ఏప్రిల్‌ 2010, తేజరిల్లు! (ఆంగ్లం) సంచికలోని, “యువత ఇలా అడుగుతోంది . . . సెక్స్‌ మా బంధాన్ని బలపరుస్తుందా?” అనే ఆర్టికల్‌ చూడండి.

మిమ్మల్ని మీరిలా ప్రశ్నించుకోండి . . .

  • మా పిల్లలకు బలమైన నైతిక విలువలు ఉన్నాయని దేన్ని బట్టి చెప్పొచ్చు?

  • సెక్స్‌ గురించి మా పిల్లలతో మాట్లాడుతున్నప్పుడు, ముఖ్యంగా అది దేవుడిచ్చిన బహుమానమని చెబుతున్నానా లేక సాతాను ఉపయోగించే ఎరని చెబుతున్నానా?