కంటెంట్‌కు వెళ్లు

ఇంటర్వ్యూ | ఆంటోనియో డెల్లా గాటా

ఒక ప్రీస్టు తన చర్చిని ఎందుకు విడిచిపెట్టాడు?

ఒక ప్రీస్టు తన చర్చిని ఎందుకు విడిచిపెట్టాడు?

రోములో తొమ్మిది సంవత్సరాలు ట్రైనింగ్‌​ తీసుకున్న తర్వాత, ఆంటోనియో డెల్లా గాటా 1969 లో ప్రీస్టు అయ్యాడు. తర్వాత, ఇటలీలోని నేపెల్స్‌​కు దగ్గర్లో ఉండే బైబిలు స్కూల్లో ఒక హెడ్‌గా పనిచేశాడు. కానీ, బైబిల్ని లోతుగా పరిశీలించి బాగా ఆలోచించుకున్న తర్వాత, క్యాథలిక్‌ మతం బైబిలుకు అనుగుణంగా లేదనే నిర్ణయానికి వచ్చాడు. ఈ ప్రయాణమంతటి గురించి తేజరిల్లు! పత్రికతో ఆయన పంచుకున్నాడు.

మీ చిన్నతనం గురించి కాస్త చెప్తారా?

నేను 1943 లో ఇటలీలో పుట్టాను. మా నాన్న ఒక రైతు అలాగే ఒక వడ్రంగి. నేను మా అన్నదమ్ములతో, అక్కాచెల్లెళ్లతో కలిసి ఒక చిన్న పల్లెటూర్లో పెరిగాను. మా అమ్మానాన్నలు మమ్మల్ని క్యాథలిక్‌ మతంలో పెంచారు.

మీరు ఎందుకు ప్రీస్టు అవ్వాలనుకున్నారు?

నా చిన్నప్పుడు చర్చిలో ప్రీస్టులు ఇచ్చే ప్రసంగాలు, వాళ్లు చేసే ఆచారాలు నాకు చాలా నచ్చేవి. దాంతో, నేను కూడా ఒక ప్రీస్టు అవ్వాలని బలంగా కోరుకున్నాను. నాకు 13 ఏళ్లు ఉన్నప్పుడు, మా అమ్మ నన్ను బోర్డింగ్‌​​ స్కూల్లో చేర్పించింది. అక్కడ, భవిష్యత్తులో ప్రీస్టు అవ్వడానికి అవసరమయ్యే ట్రైనింగ్‌ ఇచ్చేవాళ్లు.

మీ ట్రైనింగ్‌లో బైబిల్ని అధ్యయనం చేసేవాళ్లా?

నిజం చెప్పాలంటే, అలా ఏం చేయలేదు. నాకు 15 ఏళ్లు ఉన్నప్పుడు, మా టీచరు నాకు సువార్త పుస్తకాలు ఉన్న ఒక కాపీ ఇచ్చారు. నేను ఆ పుస్తకాన్ని చాలాసార్లు చదివాను. అందులో యేసు జీవితానికి, పరిచర్యకు సంబంధించిన చాలా విషయాలు తెలుసుకున్నాను. నాకు 18 ఏళ్లు ఉన్నప్పుడు, పోప్‌ అధికారం కింద ఉండే యూనివర్సిటీల్లో చదవడానికి నేను రోముకు వెళ్లిపోయాను. అక్కడ లాటిన్‌, గ్రీక్‌, హిస్టరీ, ఫిలాసఫీ, సైకాలజీ, ఇంకా థియోలజీ కూడా చదివాను. అక్కడ మేము బైబిలు వచనాల్ని బట్టీపట్టే వాళ్లం, అలాగే ఆదివారం ప్రార్థనకు వెళ్లినప్పుడు వేరేవాళ్లు బైబిలు చదువుతుంటే వినేవాళ్లం. కానీ సొంతగా మాత్రం దాన్ని ఎప్పుడూ అధ్యయనం చేయలేదు.

మీరు బైబిలు స్కూలుకు హెడ్‌​ అయ్యారు కదా. అంటే మీరు క్లాసులు చెప్పేవాళ్లా?

లేదు, నేను ఎక్కువగా ఆఫీసులో ఉండేవాణ్ణి. అయితే కొన్నిసార్లు క్లాసులు కూడా చెప్పేవాణ్ణి.

మీకు చర్చి మీద ఎందుకు సందేహాలు కలిగాయి?

మూడు విషయాలు నన్ను ఇబ్బంది పెట్టాయి. అవేంటంటే, చర్చి రాజకీయాల్లో తలదూర్చేది. ప్రీస్టులు, చర్చికి వచ్చే ప్రజలు ఎలాంటి ప్రవర్తనతో ఉన్నా చర్చి వాళ్లను ఏమీ అనేది కాదు. పైగా కొన్ని క్యాథలిక్‌ బోధలు నాకంత సరైనవిగా అనిపించలేదు. ఉదాహరణకు, ప్రేమగల దేవుడు మనం చనిపోయిన తర్వాత నరకంలో చిత్రహింసలు పెడతాడా? జపమాలను ఉపయోగిస్తూ, చెప్పిన మాటల్నే మళ్లీమళ్లీ చెప్తూ ప్రార్థించాలని దేవుడు కోరుకుంటున్నాడా? *

మరి మీరేం చేశారు?

అప్పుడు నేను ఏడుస్తూ, సరైన దారి చూపించమని దేవునికి ప్రార్థించాను. అలాగే, అప్పుడే ఇటాలియన్‌ భాషలో విడుదలైన క్యాథలిక్‌ జెరూసలేం బైబిల్‌ కొనుక్కుని, దాన్ని చదవడం మొదలుపెట్టాను. తర్వాత, ఆదివారం ఉదయం చర్చి నుండి వచ్చిన కాసేపటికి, ఎవరో ఇద్దరు మా బైబిలు స్కూలుకి వచ్చారు. వాళ్లు యెహోవాసాక్షులని నాతో చెప్పారు. మేము బైబిలు గురించి, సరైన మతాన్ని ఎలా గుర్తుపట్టవచ్చు అనే దానిగురించి గంటకుపైగా మాట్లాడుకున్నాం.

అలా వచ్చిన వాళ్లలో మీకేం నచ్చింది?

వాళ్లు క్యాథలిక్‌ బైబిల్లో ఏ లేఖనం ఎక్కడుందో చాలా తేలిగ్గా తీసి చూపించడం, గట్టి నమ్మకంతో మాట్లాడడం నాకు బాగా నచ్చింది. తర్వాత, మారియో అనే ఇంకో యెహోవాసాక్షి నన్ను కలవడం మొదలుపెట్టాడు. అతను ఎంతో ఓపిగ్గా ఉండేవాడు. ఎండైనా, వానైనా సరే ప్రతీ శనివారం ఉదయం కరెక్టుగా తొమ్మిదింటికి నా కాలింగ్‌ బెల్‌ కొట్టేవాడు.

వాళ్లు అలా వస్తుంటే మిగతా ప్రీస్టులు ఏం చేశారు?

మిగతా ప్రీస్టుల్ని కూడా నాతోపాటు బైబిలు స్టడీలో కూర్చోమని అడిగాను, కానీ వాళ్లు అంతగా పట్టించుకోలేదు. నేను మాత్రం బైబిలు స్టడీని బాగా ఆనందించాను. నేను చాలా కొత్త విషయాలు నేర్చుకున్నాను. ఉదాహరణకు, దేవుడు చెడుతనాన్ని, బాధల్ని ఎందుకు ఉండనిచ్చాడు? అనే ప్రశ్న నన్ను ఎప్పటినుండో వెంటాడుతుంది. ఆ ప్రశ్నకు, ఇంకా చాలా ప్రశ్నలకు నేను జవాబులు తెలుసుకున్నాను.

మీరు బైబిలు స్టడీ చేస్తుంటే చర్చి నాయకులు ఆపడానికి ప్రయత్నించారా?

1975 లో, రోములోని చర్చి నాయకుల్ని కలిసి నా నమ్మకాల్ని వివరించడానికి చాలాసార్లు ప్రయత్నించాను. వాళ్లు నా ఆలోచనా విధానాన్ని మార్చడానికి చూశారే గానీ, ఒక్కరు కూడా బైబిల్ని ఉపయోగించి మాట్లాడలేదు. చివరికి 1976, జనవరి 9న, ఇకమీదట నేను క్యాథలిక్‌గా ఉండాలనుకోవట్లేదని రోములోని చర్చి నాయకులకు ఉత్తరం రాశాను. రెండు రోజుల తర్వాత, నేను బైబిలు స్కూలును వదిలేసి, మొట్టమొదటిసారి యెహోవాసాక్షుల మీటింగ్‌కి వెళ్లడానికి ట్రైను​ ఎక్కాను. అక్కడ చాలా సంఘాలు ప్రాంతీయ సమావేశం కోసం కలుసుకున్నాయి. నేను చిన్నప్పటి నుండి నేర్చుకున్నదానికి, అక్కడ చూసినదానికి చాలా తేడా ఉంది! అక్కడ ప్రతీ యెహోవాసాక్షి దగ్గర బైబిలు ఉంది. అలాగే, ప్రసంగీకుడు వేర్వేరు విషయాల గురించి చర్చిస్తూ లేఖనాలు చెప్తుంటే, అక్కడున్న వాళ్లందరూ బైబిలు తెరిచి చూస్తున్నారు.

ఇదంతా చూసి మీ ఇంట్లోవాళ్లు ఏమనుకున్నారు?

వాళ్లలో చాలామంది విపరీతంగా కోప్పడ్డారు. అయితే, నా తమ్ముడు ఉత్తర ఇటలీలోని లొంబార్డీ అనే ప్రాంతంలో, యెహోవాసాక్షుల దగ్గర బైబిలు స్టడీ తీసుకుంటున్నాడని నాకు తెలిసింది. నేను అతన్ని చూడడానికి వెళ్లాను. తర్వాత అక్కడే ఒక ఇల్లు, ఉద్యోగం చూసుకోవడానికి యెహోవాసాక్షులు నాకు సహాయం చేశారు. అదే సంవత్సరం చివర్లో, నేను బాప్తిస్మం తీసుకుని ఒక యెహోవాసాక్షి అయ్యాను.

నేను దేవునికి నిజంగా దగ్గరయ్యానని నాకు ఇప్పుడు అనిపిస్తుంది

ఈ నిర్ణయం తీసుకున్నందుకు మీరు ఎప్పుడైనా బాధపడ్డారా?

అస్సలు లేదు! నేను దేవునికి నిజంగా దగ్గరయ్యానని నాకు ఇప్పుడు అనిపిస్తుంది. ఎందుకంటే, నేను మనుషుల ఆలోచనల్ని బట్టో, చర్చి ఆచారాల్ని బట్టో కాదుగానీ, బైబిలు చెప్తున్న దాన్నిబట్టి దేవుణ్ణి తెలుసుకున్నాను. అంతేకాదు, ఇప్పుడు నేను ఇతరులకు మనస్ఫూర్తిగా, గట్టి నమ్మకంతో బోధించగలను.

^ ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు బైబిలు స్పష్టమైన జవాబుల్ని ఇస్తుంది. బైబిలు బోధలు > బైబిలు ప్రశ్నలకు జవాబులు కింద చూడండి.