కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

రక్తహీనత—కారణాలు, లక్షణాలు, చికిత్స

రక్తహీనత—కారణాలు, లక్షణాలు, చికిత్స

 “నేను టీనేజీలో ఉన్నప్పుడు రక్తహీనతతో బాధపడ్డాను. బలహీనంగా ఉండేదాన్ని, త్వరగా అలసిపోయేదాన్ని, కీళ్లు నొప్పిగా ఉండేవి, పని మీద ఏకాగ్రత ఉండేది కాదు. అప్పుడు మా డాక్టరు ఐరన్‌ మాత్రలు ఇచ్చాడు. అవి వాడుతూ, మంచి ఆహారం కూడా తీసుకున్నాను. కొన్ని రోజులకు నా ఆరోగ్యం మెరుగైంది” అని బెత్‌ చెప్పింది.

 బెత్‌లాగే చాలామంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌ (WHO) ఇచ్చిన ఒక నివేదిక ప్రకారం 200 కోట్ల మంది, అంటే ప్రపంచ జనాభాలో దాదాపు 30 శాతం మంది రక్తహీనతతో బాధపడుతున్నారు. పేద దేశాల్లోనైతే దాదాపు 50 శాతం మంది గర్భిణీలు, 40 శాతం మంది పసిపిల్లలు ఈ సమస్య బారినపడుతున్నారు.

 రక్తహీనత వల్ల తీవ్రమైన అనారోగ్య సమస్యలు తలెత్తవచ్చు. రక్తహీనత మరీ తీవ్రంగా ఉంటే గుండె జబ్బులు, చివరికి గుండెపోటు కూడా రావచ్చు. కొన్ని దేశాల్లో “20 శాతం మంది బాలింతలు” రక్తహీనత వల్లే చనిపోతున్నారని WHO తెలిపింది. ఎక్కువమంది ఐరన్‌ లోపం వల్ల ఏర్పడే రక్తహీనత బారినే పడుతుంటారు. ఆ సమస్య ఉన్న గర్భిణీలు నెలలు నిండకుండానే ప్రసవించవచ్చు, బిడ్డ కూడా తక్కువ బరువు ఉండవచ్చు. రక్తహీనత ఉన్న పిల్లల్లో ఎదుగుదల తక్కువగా ఉంటుంది, వాళ్లకు తేలిగ్గా ఇన్ఫెక్షన్‌లు సోకుతాయి. అయితే రక్తహీనతకు చికిత్స లేదా నివారణ ఉంది. a

రక్తహీనత అంటే ఏమిటి?

 రక్తహీనత ఒక ఆరోగ్య సమస్య. సూటిగా చెప్పాలంటే, తగినన్ని ఆరోగ్యమైన ఎర్ర రక్త కణాలు లేకపోవడమే రక్తహీనత. దానికి వేర్వేరు కారణాలు ఉంటాయి. నిజానికి శాస్త్రవేత్తలు, 400 కన్నా ఎక్కువ రకాల రక్తహీనతలను కనుగొన్నారు. రక్తహీనత దీర్ఘకాలంగా ఉండవచ్చు, తాత్కాలికంగా ఉండవచ్చు, తీవ్రంగా ఉండవచ్చు, లేదా తక్కువ తీవ్రతలో ఉండవచ్చు.

రక్తహీనతకు కారణాలు ఏంటి?

 ముఖ్యంగా మూడు కారణాలు ఉన్నాయి. అవి:

  •   రక్తం పోవడం వల్ల శరీరంలో ఎర్ర రక్త కణాల సంఖ్య తగ్గిపోవడం.

  •   తగినన్ని ఆరోగ్యమైన ఎర్ర రక్త కణాల్ని శరీరం తయారు చేయకపోవడం.

  •   ఎర్ర రక్త కణాల్ని శరీరం నాశనం చేయడం.

 ప్రపంచవ్యాప్తంగా చాలామంది, ఐరన్‌ లోపం వల్ల ఏర్పడే రక్తహీనతతోనే బాధపడుతున్నారు. శరీరానికి అవసరమైనంత ఐరన్‌ అందనప్పుడు తగినంత హిమోగ్లోబిన్‌ తయారు కాదు. హిమోగ్లోబిన్‌ ఎర్ర రక్త కణాల్లో ఉంటుంది, శరీరంలో ఆక్సిజన్‌ను సరఫరా చేస్తుంది.

ఐరన్‌ లోపం వల్ల ఏర్పడే రక్తహీనత లక్షణాలు ఏంటి?

 మొదట్లో సమస్య అంత తీవ్రంగా ఉండకపోవచ్చు, లక్షణాలు కూడా కనిపించకపోవచ్చు. వ్యక్తిని బట్టి లక్షణాలు మారినప్పటికీ, సాధారణంగా కనిపించే లక్షణాలు ఏంటంటే:

  •   తీవ్రమైన అలసట

  •   చేతులు, కాళ్లు చల్లబడడం

  •   నీరసం

  •   చర్మం పాలిపోవడం

  •   తలనొప్పి, కళ్లు తిరగడం

  •   ఛాతి నొప్పి, గుండె వేగంగా కొట్టుకోవడం, శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడడం

  •   గోళ్లు పెళుసుబారడం

  •   ఆకలి లేకపోవడం, ముఖ్యంగా శిశువుల్లో, చిన్నపిల్లల్లో ఇది కనిపిస్తుంది

  •   ఐస్‌, స్టార్చ్‌ (గంజి పదార్థాలు వంటివి), మట్టి తినాలనిపించడం

ఈ సమస్య ఎక్కువగా ఎవరిలో కనిపిస్తుంది?

 స్త్రీలు నెలసరి సమయంలో రక్తం కోల్పోతారు కాబట్టి, ఎక్కువగా వాళ్లే ఐరన్‌ లోపం వల్ల ఏర్పడే రక్తహీనత బారిన పడుతుంటారు. అంతేకాదు, గర్భిణీ స్త్రీలు తీసుకునే ఆహారంలో తగినంత ఫోలేట్‌ లేదా ఫోలిక్‌ ఆమ్లం అనే B విటమిన్‌ లేకపోతే వాళ్లు కూడా రక్తహీనతకు గురౌతారు.

 నెలలు నిండని శిశువులు, లేదా తక్కువ బరువుతో పుట్టి తల్లి పాల ద్వారా గానీ, పోత పాల ద్వారా గానీ తగినంత ఐరన్‌ అందని శిశువులు.

 పోషకాహారం తీసుకోని పిల్లలు.

 ఐరన్‌ సమృద్ధిగా ఉండే ఆహారాన్ని తీసుకోని శాకాహారులు.

 దీర్ఘకాలంగా అనారోగ్యంతో ఉన్నవాళ్లు. రక్త సంబంధ వ్యాధులు, క్యాన్సర్‌, కిడ్నీలు పాడవ్వడం, కడుపులో పుండ్లు, లేదా వేరే ఇన్ఫెక్షన్‌లు వంటివి ఉన్నవాళ్లు.

రక్తహీనతకు చికిత్స

 అన్ని రకాల రక్తహీనతకు చికిత్స లేదా నివారణ లేదు. కాకపోతే ఐరన్‌ లోపం వల్ల గానీ, విటమిన్స్‌ లోపం వల్ల గానీ వచ్చే రక్తహీనతను తగ్గించాలన్నా, నివారించాలన్నా మనం తీసుకునే ఆహారంలో ఇవి ఉండేలా చూసుకోవాలి:

 ఐరన్‌. మాంసాహారం, బీన్స్‌, పప్పులు, పచ్చని ఆకుకూరల్లో ఉంటుంది. b ఇనుప పాత్రల్లో వండిన ఆహారంలో కూడా ఐరన్‌ శాతం ఎక్కువ ఉండవచ్చని కొన్ని పరిశోధనలు చెప్తున్నాయి.

 ఫోలేట్‌. పండ్లు, పచ్చని ఆకుకూరలు, పచ్చి బఠానీలు, కిడ్నీ బీన్స్‌, చీజ్‌, గుడ్లు, చేపలు, బాదం పప్పు, వేరుశెనగల్లో ఉంటుంది. విటమిన్స్‌ ఉన్న ధాన్యంతో చేసిన బ్రెడ్‌, పాస్తా, బియ్యం వంటి ఉత్పత్తుల్లో కూడా ఇది ఉంటుంది. ఫోలేట్‌ నుండి ఫోలిక్‌ ఆమ్లం వస్తుంది.

 విటమిన్‌ B-12. మాంసాహారం, పాల పదార్థాలు, ధాన్య ఉత్పత్తులు, సోయా ఉత్పత్తుల్లో ఉంటుంది.

 విటమిన్‌ C. సిట్రస్‌ పండ్లు-వాటి రసాలు, మిరియాలు, బ్రోకొలి, టమాటాలు, పుచ్చకాయ, స్ట్రాబెర్రీ వంటి వాటిలో ఉంటుంది. శరీరం ఐరన్‌ను గ్రహించడానికి విటమిన్‌ C సహాయం చేస్తుంది.

 ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకమైన ఆహారం దొరుకుతుంది. కాబట్టి మీకు దొరికే ఏ ఆహారంలో అవసరమైన పోషకాలు ఉంటాయో తెలుసుకోండి. ముఖ్యంగా స్త్రీలు, అందులోనూ గర్భిణీలు, గర్భం దాల్చాలని అనుకుంటున్నవాళ్లు పోషకాహారం తీసుకోవాలి. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటే, మీకు పుట్టబోయే పిల్లలు రక్తహీనత c బారిన పడే అవకాశం తగ్గుతుంది.

a ఈ ఆర్టికల్‌లో ఇవ్వబడిన ఆహార సలహాలు, ఇతర విషయాలు మయో క్లినిక్‌, అలాగే ద గేల్‌ ఎన్‌సైక్లోపీడియా ఆఫ్‌ నర్సింగ్‌ అండ్‌ అల్లీడ్‌ హెల్త్‌ నుండి తీసుకున్నవి. మీకు రక్తహీనత ఉందనిపిస్తే డాక్టరును సంప్రదించండి.

b డాక్టరు సలహా తీసుకోకుండా పెద్దలైనా, పిల్లలైనా ఐరన్‌ మాత్రలు లేదా టానిక్‌లు వాడకూడదు. అధిక మోతాదులో ఐరన్‌ తీసుకుంటే కాలేయం దెబ్బ తినవచ్చు, ఇతర సమస్యలు రావచ్చు.

c కొన్నిసార్లు డాక్టర్లు, రక్తహీనత బారిన పడినవాళ్లకు రక్తం ఎక్కిస్తారు. కానీ యెహోవాసాక్షులు రక్తం ఎక్కించుకోరు.—అపొస్తలుల కార్యాలు 15:28, 29.