కంటెంట్‌కు వెళ్లు

నిజమైన మతం ఏదో నేనెలా తెలుసుకోవాలి?

నిజమైన మతం ఏదో నేనెలా తెలుసుకోవాలి?

బైబిలు ఇచ్చే జవాబు

 నిజమైన మతానికి, అబద్ధ మతానికి ఉన్న తేడాను ఎలా తెలుసుకోవాలో ఓ ఉదాహరణతో వివరిస్తూ బైబిలు ఇలా చెప్తోంది, “వారి ఫలములవలన మీరు వారిని తెలిసికొందురు. ముండ్లపొదలలో ద్రాక్ష పండ్లనైనను, పల్లేరుచెట్లను అంజూరపు పండ్లనైనను కోయుదురా?“ (మత్తయి 7:16) ఏది ద్రాక్షతీగో ఏది ముళ్లపొదో దాని పండ్లను చూసి మీరెలా చెప్తారో అలాగే ఏది నిజమైన మతమో ఏది కాదో వాటి ఫలాలు చూసే లేదా వాటి బోధలు చూసే మీరు తెలుసుకోవచ్చు.

  1.   నిజమైన మతం సత్యాన్ని, మనుషులు బోధించిన సిద్ధాంతాల ఆధారంగా కాదుగానీ బైబిలు ఆధారంగా బోధిస్తుంది. (యోహాను 4:24; 17:17) వాటిలో ఆత్మ గురించిన సత్యాలు, పరదైసుగా మారిన భూమిపై నిత్యం జీవించడం గురించిన సత్యాలు కూడా ఉన్నాయి. (కీర్తన 37:29; యెషయా 35:5, 6; యెహెజ్కేలు 18:4) మతం పేరిట జరిగే అబద్ధపనులను బట్టబయలు చేయడంలో నిజమైన మతం వెనకాడదు.—మత్తయి 15:9; 23:27, 28.

  2.   నిజమైన మతం దేవుని పేరు యెహోవా అని చెప్తుంది, ఆయన గురించి తెలుసుకోవడానికి ప్రజలకు సహాయం చేస్తుంది. (కీర్తన 83:18; యెషయా 42:8; యోహాను 17:3, 6) దేవుడు మనకు అర్థంకాడని లేదా ఆయన మనకు దూరంగా ఉంటాడని నిజమైన మతం బోధించదు. బదులుగా ఆయన మనతో స్నేహం చేయడానికి ఇష్టపడుతున్నాడని బోధిస్తుంది.—యాకోబు 4:8.

  3.   యేసుక్రీస్తు ద్వారానే మనకు రక్షణ దొరుకుతుందని నిజమైన మతం ముఖ్యంగా చెప్తుంది. (అపొస్తలుల కార్యములు 4:10, 12) నిజమైన మతాన్ని పాటించేవాళ్లు యేసు ఆజ్ఞల్ని పాటిస్తూ ఆయన్ను అనుకరించడానికి కృషిచేస్తారు.—యోహాను 13:15; 15:14.

  4.   మనుషులకు ఏకైక నిరీక్షణ అయిన దేవుని రాజ్యం గురించే నిజమైన మతం ముఖ్యంగా బోధిస్తుంది. ఆ మతాన్ని పాటించేవాళ్లు రాజ్యం గురించి ఇతరులకు ఉత్సాహంగా చెప్తారు.మత్తయి 10:7; 24:14.

  5.   ఇతరుల నుండి ఏదీ ఆశించకుండా ప్రేమించమని నిజమైన మతం ప్రోత్సహిస్తుంది. (యోహాను 13:35) జాతి, సంస్కృతి, భాష, నేపథ్యం అనే తేడా లేకుండా అందర్నీ గౌరవించమని, ఆహ్వానించమని అది ప్రోత్సహిస్తుంది. (అపొస్తలుల కార్యములు 10:34, 35) నిజమైన మతానికి చెందినవాళ్లు ఇతరుల్ని ప్రేమిస్తారు కాబట్టి వాళ్లు యుద్ధాల్లో పాల్గొనరు.మీకా 4:3; 1 యోహాను 3:11, 12.

  6.   నిజమైన మతంలో, జీతాలు తీసుకుని పనిచేసే పాస్టర్లు ఎవ్వరూ ఉండరు. అంతేకాదు, తమ మతానికి చెందిన వాళ్లకెవ్వరికీ పెద్దపెద్ద బిరుదులు కూడా ఇవ్వరు.—మత్తయి 23:8-12; 1 పేతురు 5:2, 3.

  7.   నిజమైన మతానికి చెందినవాళ్లు ఎలాంటి రాజకీయ వ్యవహారాల్లో తలదూర్చరు. (యోహాను 17:16; 18:36) కానీ బైబిలు ఇస్తున్న ఆజ్ఞ ప్రకారం, వాళ్లు ఉంటున్న దేశంలోని ప్రభుత్వాన్ని గౌరవిస్తారు, నియమాల్ని పాటిస్తారు. “కైసరువి కైసరునకును దేవునివి దేవునికిని చెల్లించుడి” అని బైబిలు ఆజ్ఞాపిస్తుంది.—మార్కు 12:17; రోమీయులు 13:1, 2.

  8.   నిజమైన మతం చెప్పేవాటిని, దాని సభ్యులు మనస్ఫూర్తిగా పాటిస్తారు. అంతేకానీ ఏదో చేయాలి కదా అనో లేదా నామమాత్రంగానో చేయరు. నైతిక విషయాల్లో బైబిలు ఇచ్చే ఉన్నత ప్రమాణాలకు వాళ్లు కట్టుబడివుంటారు. (ఎఫెసీయులు 5:3-5; 1 యోహాను 3:18) బైబిలు ఆజ్ఞలు కఠినమైనవని భావించే బదులు వాళ్లు సంతోషముగల దేవున్ని ఆనందంగా సేవిస్తారు.—1 తిమోతి 1:11.

  9.   నిజమైన మతాన్ని పాటించేవాళ్లు చాలా తక్కువమంది ఉంటారు. (మత్తయి 7:13, 14) సాధారణంగా ఆ మతానికి చెందినవాళ్లను ప్రజలు చిన్నచూపు చూస్తారు, ఎగతాళి చేస్తారు, దేవుడు చెప్పింది చేస్తున్నందుకు వాళ్లను హింసిస్తారు.—మత్తయి 5:10-12.

నాకు సరైనది అనిపించేదే నిజమైన మతమా?

 కేవలం మనకు అనిపించినదానిబట్టి ఓ మతం నిజమైనదో కాదో నిర్ణయించుకోవడం చాలా ప్రమాదకరం. కొంతమంది ప్రజలు ‘దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమకొరకు పోగుచేసికొనే’ కాలం వస్తుందని బైబిలు ముందుగానే చెప్పింది. (2 తిమోతి 4:3) కానీ బైబిలు మనల్ని, “తండ్రియైన దేవునియెదుట పవిత్రమును నిష్కళంకమునైన” మతాన్ని అనుసరించమని ప్రోత్సహిస్తుంది. ఒకవేళ ఆ మతం ప్రసిద్ధి చెందినది కాకపోయినాసరే మనం దాన్నే పాటించాలి.—యాకోబు 1:27; యోహాను 15:18, 19.