కంటెంట్‌కు వెళ్లు

యెహోవాసాక్షులకు సైన్స్‌పై ఎలాంటి అభిప్రాయం ఉంది?

యెహోవాసాక్షులకు సైన్స్‌పై ఎలాంటి అభిప్రాయం ఉంది?

సైన్స్‌ సాధించిన ఫలితాలను మేం గౌరవిస్తాం. రుజువులతో సహా సైన్స్‌ కనిపెట్టిన విషయాలను మేం నమ్ముతాం.

“సైన్స్‌ అంటే, ప్రకృతిని, ప్రకృతిలో ఉన్నవాటి పనితీరును తెలుసుకోవడానికి చేసే అధ్యయనం, దాన్నుండి పొందే జ్ఞానం.” (కోలిన్స్‌ కోబిల్డ్‌ అడ్వాన్స్‌డ్‌ లెర్నర్స్‌ ఇంగ్లీషు డిక్షనరీ) బైబిలు ఒక సైన్స్‌ పుస్తకం కాకపోయినా, చుట్టూ ఉన్న ప్రకృతిని అధ్యయనం చేయమనీ, అలాగే వేరేవాళ్లు చేసిన అధ్యయనం నుండి నేర్చుకోమనీ ప్రజల్ని ప్రోత్సహిస్తుంది. కొన్ని ఉదాహరణలు చూడండి:

  • ఖగోళశాస్త్రం: “మీ కన్నులు పైకెత్తి చూడుడి వీటిని ఎవడు సృజించెను? వీటి లెక్కచొప్పున వీటి సమూహములను బయలుదేరజేసి వీటన్నిటికిని పేరులు పెట్టి పిలుచువాడే గదా.”​—యెషయా 40:26.

  • జీవశాస్త్రం: సొలొమోను “లెబెనోనులో ఉండు దేవదారు వృక్షమునేగాని గోడలోనుండి మొలుచు హిస్సోపు మొక్కనే గాని చెట్లన్నిటిని గూర్చి అతడు వ్రాసెను; మరియు మృగములు పక్షులు ప్రాకు జంతువులు జలచరములు అనువాటి నన్నిటి గూర్చియు అతడు వ్రాసెను.”​—1 రాజులు 4:​33.

  • వైద్యశాస్త్రం: “ఆరోగ్యంగా ఉన్నవాళ్లకు వైద్యుడు అవసరంలేదు, రోగులకే అవసరం.”—లూకా 5:31.

  • అంతరిక్షశాస్త్రం: ‘నీవు హిమముయొక్క నిధులలోనికి చొచ్చితివా? వడగండ్ల నిధులను నీవు చూచితివా? తూర్పు గాలి యెక్కడనుండి వచ్చి భూమిమీద నఖముఖములను వ్యాపించును?’​—యోబు 38:22-​24.

మా ప్రచురణలు ప్రకృతి గురించిన సైన్స్‌ సాధించిన ఫలితాల గురించిన ఆర్టికల్స్‌ను వివరిస్తూ ప్రచురించడం ద్వారా సైన్స్‌పై గౌరవాన్ని పెంచుతాయి. యెహోవాసాక్షులైన తల్లిదండ్రులు తమ పిల్లల్ని చదువుకోమని ప్రోత్సహిస్తారు. దానికిగల కారణం ఏమిటంటే, అప్పుడు వాళ్లు తమ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ఇంకా బాగా అర్థంచేసుకోగలుగుతారు. యెహోవాసాక్షుల్లో చాలామంది బయోకెమిస్ట్రీ, మ్యాథ్స్‌, ఫిజిక్స్‌ అలాగే సైన్స్‌తో సంబంధమున్న ఇతర విభాగాల్లో పనిచేస్తున్నారు.

సైన్స్‌కున్న పరిమితులు

మనుషులకు ఉన్న అన్నీ ప్రశ్నలకు సైన్స్‌ జవాబివ్వగలదని మేం నమ్మం. * ఉదాహరణకు, భూవిజ్ఞాన శాస్త్రజ్ఞులు భూమి దేనితో తయారుచేయబడిందో పరిశోధన చేస్తారు. జీవశాస్త్రజ్ఞులు మనిషి శరీరం పనిచేసే తీరును అధ్యయనం చేస్తారు. ఇంతకీ జీవులు మనుగడ సాగించగలిగే చక్కని వాతావరణం భూమిపై ఎందుకు ఉంది? మానవ శరీరభాగాలు ఒకదానితో ఒకటి సహకరించుకుంటూ ఇంత చక్కగా ఎలా పనిచేస్తున్నాయి?

ఆ ప్రశ్నలకు బైబిలు మాత్రమే సరైన జవాబులు ఇవ్వగలదనే ముగింపుకు మేము వచ్చాం. (కీర్తన 139:13-​16; యెషయా 45:18) కాబట్టి సరైన జ్ఞానం కావాలంటే సైన్స్‌ గురించి అలాగే బైబిలు గురించి నేర్చుకోవాలని మేం నమ్ముతాం.

కొన్నిసార్లు సైన్స్‌ బైబిలుకు విరుద్ధంగా ఉన్నట్లు అనిపిస్తుంది. చాలావరకు, బైబిలు నిజంగా ఏమి చెప్తోందో సరిగ్గా అర్థం చేసుకోకపోవడం వల్లే అలా అనిపిస్తుంటుంది. ఉదాహరణకు, 24 గంటల వ్యవధి ఉన్న ఆరు రోజుల్లో భూమి చేయబడిందని బైబిలు చెప్పట్లేదు.—ఆదికాండము 1:1; 2:4.

చాలామంది, సైన్స్‌పరంగా కొన్ని సిద్ధాంతాలు సరైనవని అనుకుంటున్నారు, కానీ అవి నిజమనడానికి సరిపడా ఆధారాల్లేవు. అంతేకాదు గొప్ప పేరున్న కొంతమంది శాస్త్రవేత్తలు సైతం వాటిని ఒప్పుకోవడం లేదు. ఉదాహరణకు భూమి యాధృచ్చికంగా జరిగిన మార్పుల ద్వారా లేదా ప్రకృతివరణం ద్వారా రాలేదని చాలామంది జీవశాస్త్రజ్ఞులు, రసాయన శాస్త్రజ్ఞులు, ఇతరులు నమ్ముతున్నారు. సృష్టిని గమనిస్తే, ఎవరో తెలివైన సృష్టికర్త ఉన్నట్లు అనిపిస్తుంది కాబట్టి మేము కూడా వాళ్ల అభిప్రాయంతో ఏకీభవిస్తున్నాం.

^ పేరా 10 భౌతికశాస్త్రంలో ప్రవీణుడూ, నోబెల్‌ బహుమతి గ్రహీతా అయిన ఎర్వీన్‌ ష్రోడింగర్‌ అనే ఆస్ట్రియాకు చెందిన శాస్త్రవేత్త సైన్స్‌ గురించి ఇలా రాశాడు, “మన హృదయానికి దగ్గరగా ఉన్న వాటిగురించి, నిజంగా ప్రాముఖ్యమైన వాటిగురించి . . . అది ఏమీ చెప్పదు.” ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌ ఇలా అన్నాడు, “తర్కబద్ధంగా ఆలోచించినప్పటికీ ఎన్నో సమస్యల్ని ఎదుర్కొన్నాం కాబట్టి, అది మన జీవిత సమస్యల్ని పరిష్కరించుకోవడానికి ఉపయోగపడదని తెలుసుకున్నాం.”