కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

జీవిత కథ

జ్ఞానంగల వాళ్లతో సహవసించడం వల్ల నేను ప్రయోజనం పొందాను

జ్ఞానంగల వాళ్లతో సహవసించడం వల్ల నేను ప్రయోజనం పొందాను

అమెరికాలోని, దక్షిణ డకొటలో ఉన్న బ్రూకింజ్‌లో చాలా ఏళ్ల క్రితం జరిగిన ఒక సంఘటన నాకింకా గుర్తుంది. ఆరోజు ఉదయం చల్లగాలి వీస్తోంది. త్వరలోనే ఆ ప్రాంతమంతా ఇంకా చల్లగా మారుతుందని నాకు అనిపించింది. నేను కొంతమందితో కలిసి ఒక గోడౌన్‌లో నిలబడి ఉన్నాను, మేమంతా చలికి వణుకుతూ ఉన్నాం. మా ముందు నీళ్లతో నింపి ఉన్న పెద్ద తొట్టి ఉంది, ఆ నీళ్లు కూడా చాలా చల్లగా ఉన్నాయి. ఇంతకీ మేము అక్కడ ఎందుకు ఉన్నామో మీకు అర్థమవ్వాలంటే నా జీవితం గురించి ఇప్పుడు మీరు కొంత తెలుసుకోవాలి.

మా కుటుంబం

మా పెదనాన్న ఆల్‌ఫ్రెడ్‌తోపాటు మా నాన్న

నేను 1936, మార్చి 7న పుట్టాను. మా అమ్మానాన్నలకు నలుగురు పిల్లలం, నేనే అందరికన్నా చిన్నవాణ్ణి. దక్షిణ డకొటలోని తూర్పు భాగంలో ఉన్న చిన్నపొలమే మాకు జీవనాధారం. మేము ముఖ్యంగా చేసేది పొలం పనే అయినప్పటికీ అదే మా జీవితంలో అన్నిటికన్నా ముఖ్యమైనది కాదు. మా అమ్మానాన్నలు 1934⁠లో బాప్తిస్మం తీసుకొని యెహోవాసాక్షులు అయ్యారు. వాళ్లు తమ జీవితాలను యెహోవాకు సమర్పించుకున్నారు కాబట్టి ఆయన చిత్తం చేయడమే వాళ్లకు అన్నిటికన్నా ముఖ్యం. మా నాన్న క్లారెన్స్‌, దక్షిణ డకొటలోని కాండీ అనే చిన్న సంఘంలో కంపెనీ సర్వెంటుగా (ఇప్పుడు సంఘపెద్దల సభ సమన్వయకర్త అని పిలుస్తున్నారు) సేవచేశాడు. కొంతకాలానికి ఆయన స్థానంలో మా పెదనాన్న ఆల్‌ఫ్రెడ్‌ నియమించబడ్డాడు.

క్రమంగా కూటాలకు వెళ్లడం, భవిష్యత్తుకు సంబంధించి బైబిల్లో ఉన్న అద్భుతమైన నిరీక్షణ గురించి ఇతరులకు చెప్పడం మా అందరి జీవితంలో భాగమైపోయాయి. మా అమ్మానాన్నలు ఉంచిన చక్కని ఆదర్శంతోపాటు వాళ్లు ఇచ్చిన శిక్షణవల్ల మేము యెహోవాను ప్రేమించగలిగాం. మా అక్క డోరతీ, నేనూ ఆరేళ్ల వయసులో రాజ్య ప్రచారకులమయ్యాం. 1943⁠లో నేను దైవపరిపాలనా పరిచర్య పాఠశాలలో చేరాను, ఆ పాఠశాల అదే సంవత్సరంలో మొదలైంది.

1952⁠లో పయినీరు సేవ చేస్తూ

సమావేశాలను మేమెంతో ప్రాముఖ్యంగా ఎంచేవాళ్లం. దక్షిణ డకొటలోని స్యూ ఫాల్స్‌లో 1949వ సంవత్సరం జరిగిన సమావేశంలో సహోదరుడు గ్రాంట్‌ సూటర్‌, “అంతం మీరు అనుకున్న దానికన్నా దగ్గరగా ఉంది!” అనే అంశం ఉన్న ప్రసంగం ఇచ్చాడు. సమర్పించుకున్న క్రైస్తవులందరూ దేవుని రాజ్యం గురించిన మంచివార్తను ప్రకటించాలని ఆ ప్రసంగంలో నొక్కిచెప్పాడు. దాంతో నా జీవితాన్ని యెహోవాకు సమర్పించుకున్నాను. ఆ సమావేశం తర్వాత 1949, నవంబరు 12న బ్రూకింజ్‌లో జరిగిన ప్రాంతీయ సమావేశంలో నేను బాప్తిస్మం తీసుకున్నాను. అందుకే, మొదట్లో నేను చెప్పినట్టు చాలా చల్లగా ఉన్న ఆ గోడౌన్‌లో ఉన్నాను. మేము నలుగురం, నీళ్లతో నిండి ఉన్న ఆ పెద్ద స్టీలు తొట్టిలో బాప్తిస్మం తీసుకోవడానికే అక్కడ నిలబడి ఉన్నాం.

నేను ఒక పయినీరు అవ్వాలని ఆ సమయంలోనే నిర్ణయించుకున్నాను. 1952, జనవరి 1న నాకు 15 ఏళ్లు ఉన్నప్పుడు పయినీరు సేవ మొదలుపెట్టాను. “జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానముగలవాడగును” అని బైబిలు చెప్తుంది. అయితే నా నిర్ణయానికి మద్దతిచ్చిన జ్ఞానంగలవాళ్లు ఎంతోమంది మా ఇంట్లో ఉన్నారు. (సామె. 13:20) 60 ఏళ్ల మా పెదనాన్న జూలియస్‌తో కలిసి నేను ఎక్కువగా ప్రీచింగ్‌కి వెళ్లేవాణ్ణి. ఆయన నాకన్నా చాలా పెద్దవాడే అయినా, మేము కలిసి పరిచర్య చేయడాన్ని ఆనందించాం. నేను ఆయన నుండి, ఆయన అనుభవం నుండి చాలా విషయాలు నేర్చుకున్నాను. మా అక్క డోరతీ కూడా కొంతకాలానికే పయినీరు సేవ మొదలుపెట్టింది.

ప్రాంతీయ పర్యవేక్షకులు నాకు సహాయం చేశారు

నేను యౌవనస్థుడిగా ఉన్నప్పుడు మా అమ్మానాన్నలు, ప్రాంతీయ పర్యవేక్షకులను వాళ్ల భార్యలను ఇంటికి ఆహ్వానించేవాళ్లు, మాతోనే ఉండమనేవాళ్లు. జెస్సి కాంట్‌వెల్‌, లిన్‌ కాంట్‌వెల్‌ అనే దంపతులు నాకు ఎంతో సహాయం చేశారు. నా పట్ల శ్రద్ధ చూపించారు, నన్ను ప్రోత్సహించారు. వాళ్లు మాకు దగ్గర్లో ఉన్న సంఘాల్లో సేవ చేస్తున్నప్పుడు, కొన్నిసార్లు నన్ను వాళ్లతో ప్రీచింగ్‌కు రమ్మనేవాళ్లు. వాళ్లతో సమయం గడిపినప్పుడు నేను చాలా సంతోషించాను. వాళ్లలాగే యెహోవా సేవలో బిజీగా ఉంటూ, పయినీరు సేవ చేయాలని కోరుకున్నాను.

ఆ తర్వాత, బడ్‌ మిల్లర్‌ మాకు ప్రాంతీయ పర్యవేక్షకునిగా వచ్చాడు. ఆయన తన భార్య జోన్‌తో కలిసి మా సంఘాన్ని సందర్శించినప్పుడు నాకు 18 ఏళ్లు. నేను డ్రాఫ్ట్‌ బోర్డ్‌ను కలవాల్సిన వయస్సు అదే. ఒక వ్యక్తి మిలటరీలో చేరాలో వద్దో ఆ కమిటీయే నిర్ణయిస్తుంది. రాజకీయ విషయాల్లో ఎవ్వరి పక్షం వహించవద్దని యేసు ఇచ్చిన ఆజ్ఞకు వ్యతిరేకమైన కొన్ని పనుల్ని నన్ను చేయమని ఆ కమిటీ చెప్పింది. కానీ నాకు దేవుని రాజ్యం గురించిన మంచివార్త ప్రకటించాలని ఉండేది. (యోహా. 15:19) కాబట్టి నన్ను ఒక పరిచారకునిగా భావించమని డ్రాఫ్ట్‌ బోర్డ్‌ను అభ్యర్థించాను.

కమిటీతో జరిగే మీటింగ్‌కు నాతోపాటు బ్రదర్‌ మిల్లర్‌ కూడా వస్తానని చెప్పినప్పుడు నాకు చాలా సంతోషంగా అనిపించింది. ఆయన ధైర్యవంతుడు, మనుషులకు భయపడేవాడు కాదు. ఆయనకు లేఖనాలు బాగా తెలుసు. ఆయన నాతో ఉండడంవల్ల నాకు చాలా ధైర్యంగా అనిపించింది. ఆ మీటింగ్‌ జరిగాక, 1954⁠లో ఎండాకాలం అయిపోవస్తుండగా ఆ కమిటీవాళ్లు నా విన్నపాన్ని అంగీకరించి నన్ను ఒక పరిచారకునిగా భావించారు. దాంతో యెహోవా సేవ మరింత ఎక్కువ చేయడానికి ఉన్న అడ్డంకి తొలగిపోయింది.

బెతెల్‌కి వెళ్లిన కొత్తలో ఫామ్‌ ట్రక్‌తో

తర్వాత కొంతకాలానికే నన్ను న్యూయార్క్‌లోని స్టాటన్‌ ఐలాండ్‌లో ఉన్న బెతెల్‌లో సేవ చేయడానికి పిలిచారు. అప్పట్లో దాన్ని వాచ్‌టవర్‌ ఫామ్‌ అని పిలిచేవాళ్లు. అక్కడ నేను దాదాపు మూడు సంవత్సరాలు సేవచేశాను. జ్ఞానంగల ఎంతోమంది సహోదరసహోదరీల్ని కలిశాను, వాళ్లతో కలిసి పనిచేశాను. ఆ సమయంలో నాకు ఎన్నో అద్భుతమైన అనుభవాలు ఎదురయ్యాయి.

బెతెల్‌ సేవ

సహోదరుడు ఫ్రాంజ్‌తో WBBR స్టేషన్‌ దగ్గర

స్టాటన్‌ ఐలాండ్‌లో ఉన్న ఫామ్‌లో WBBR రేడియో స్టేషన్‌ కూడా ఉండేది. దాన్ని యెహోవాసాక్షులు 1924 నుండి 1957 వరకు ఉపయోగించారు. బెతెల్‌ కుటుంబంలోని కేవలం 15 నుండి 20 మందినే ఫామ్‌లో పనిచేయడానికి నియమించేవాళ్లు. మాలో చాలామందిమి యౌవనులం, అనుభవంలేని వాళ్లం. కానీ అభిషిక్తుడైన పెద్దవయసు సహోదరుడు, ఎల్‌డన్‌ వుడ్‌వార్త్‌ మాతో పనిచేసేవాడు. ఆయన మమ్మల్ని తండ్రిలా చూసుకునేవాడు. మాకు ఎన్నో విషయాలు నేర్పించేవాడు. కొన్నిసార్లు యౌవనస్థులైన మా మధ్య మనస్పర్థలు వచ్చినప్పుడు, ఆ సహోదరుడు ఇలా అనేవాడు, “అపరిపూర్ణులను ఉపయోగించుకుంటూ యెహోవా తన పనిని చేయిస్తున్న విధానం గురించి ఆలోచిస్తే చాలా అద్భుతంగా ఉంటుంది.”

పరిచర్యపట్ల ఎంతో ఆసక్తి ఉన్న హ్యారీ పీటర్‌సన్‌

సహోదరుడు ఫ్రెడ్రిక్‌ డబ్ల్యూ. ఫ్రాంజ్‌ కూడా మాతో పనిచేస్తూ అందరికి సహాయం చేసేవాడు. ఆయనకు ఎంతో జ్ఞానం ఉంది, బైబిలు విషయాలు బాగా తెలుసు. మాలో ప్రతీఒక్కరి మీద శ్రద్ధ చూపించేవాడు. హ్యారీ పీటర్‌సన్‌ మాకు వంట చేసేవాడు. ఆయన పూర్తి పేరు పాపార్యీరోపులోస్‌ హ్యారీ పీటర్‌సన్‌. ఆయన్ని హ్యారీ పీటర్‌సన్‌ అని పిలవడమే మాకు సులభంగా ఉండేది. ఆయన కూడా అభిషిక్తుడే, పరిచర్య అంటే ఆయనకు చాలా ఇష్టం. బెతెల్‌లో ఆయనకు అప్పగించిన పనిని చక్కగా చేసేవాడు, పరిచర్యను ఎప్పుడూ నిర్లక్ష్యం చేసేవాడు కాదు. ప్రతీ నెల వందల కొలది పత్రికలు పంచిపెట్టేవాడు. ఆయనకు బైబిలు జ్ఞానం ఎక్కువ ఉంది కాబట్టి మేము అడిగే చాలా ప్రశ్నలకు ఆయన జవాబు చెప్పేవాడు.

జ్ఞానంగల సహోదరీల్ని చూసి ఎంతో నేర్చుకున్నాను

ఫామ్‌లో మేము పండ్లను, కూరగాయలను తాజాగా ఉంచడం కోసం వాటిని క్యానుల్లో భద్రపర్చేవాళ్లం. బెతెల్‌ కుటుంబం కోసం ప్రతీ సంవత్సరం దాదాపు 45,000 క్యానుల్లో వాటిని భద్రపర్చేవాళ్లం. నేను సహోదరి ఇట హత్‌తో పని చేసేవాణ్ణి, ఆమె చాలా తెలివైనది. అలా భద్రపర్చడానికి కావాల్సినవన్ని ఆమె సిద్ధంచేసేది. స్థానిక సహోదరీలు మాతో కలిసి పనిచేసేందుకు వచ్చేవాళ్లు. వాళ్లు తమ పనిని ఎలా చేయాలో ఇట చెప్పేది. పండ్లను, కూరగాయలను భద్రపర్చే విధానం గురించి ఇటకు ఎక్కువే తెలిసినప్పటికీ ఫామ్‌ని పర్యవేక్షించే సహోదరులను ఆమె ఎప్పుడూ గౌరవించేది. ఆమె మా అందరికీ చక్కని ఆదర్శం ఉంచింది.

సహోదరి ఇట హత్‌తో, ఎంజలతో

ఫామ్‌లో సహాయం చేయడానికి ఎంజల రోమానో అనే యౌవన సహోదరి కూడా వచ్చేది. ఆమె సత్యం నేర్చుకున్న కొత్తలో సహోదరి ఇట ఆమెకు సహాయం చేసింది. నేనూ, ఎంజల 1958, ఏప్రిల్‌లో పెళ్లిచేసుకున్నాం. ఇద్దరం కలిసి యెహోవా సేవ చేస్తూ 58 సంవత్సరాలపాటు సంతోషంగా గడిపాం. ఆ సంవత్సరాలన్నిటిలో, ఎంజల యెహోవా పట్ల చూపించిన విశ్వసనీయత మా వివాహ బంధాన్ని బలంగా ఉంచింది. ఆమె తెలివైనది, ఎలాంటి కష్టాలు వచ్చినా నేను ఆమెపై ఖచ్చితంగా ఆధారపడవచ్చు.

మిషనరీ నియామకం, ప్రయాణ సేవ

సహోదరులు 1957⁠లో స్టాటన్‌ ఐలాండ్‌లోని WBBR రేడియో స్టేషన్‌ను అమ్మేసినప్పుడు, కొంతకాలం పాటు నేను బ్రూక్లిన్‌ బెతెల్‌లో సేవ చేశాను. ఆ తర్వాత నేను పెళ్లి చేసుకోవడంతో బెతెల్‌ నుండి వచ్చేశాను. మూడు సంవత్సరాలపాటు మేము స్టాటన్‌ ఐలాండ్‌లో పయినీరు సేవచేశాం. కొన్నాళ్లపాటు, WBBR రేడియో స్టేషన్‌ను కొనుక్కున్న WPOW అనే రేడియో స్టేషన్‌లో కూడా పనిచేశాను.

నేనూ, ఎంజల అవసరం ఉన్న ఏ ప్రాంతానికైనా వెళ్లి సేవచేసేందుకు వీలుగా మా జీవితాన్ని సాదాసీదాగా ఉంచుకున్నాం. కాబట్టి, 1961⁠లో నెబ్రస్కలోని ఫాల్స్‌ సిటీలో ప్రత్యేక పయినీర్లుగా సేవచేయడానికి వెళ్లాం. అక్కడికి వెళ్లిన వెంటనే, న్యూయార్క్‌లోని దక్షిణ లాంసింగ్‌లో ఒక నెలపాటు జరిగే రాజ్య పరిచర్య పాఠశాలకు హాజరుకమ్మని ఆహ్వానం వచ్చింది. ఆ పాఠశాలలో పొందిన శిక్షణను మేము చాలా ఆనందించాం. పాఠశాల పూర్తి అయ్యాక మమ్మల్ని మళ్లీ నెబ్రస్కకు పంపిస్తారని అనుకున్నాం. కానీ ఆశ్చర్యకరంగా మమ్మల్ని కంబోడియాకు మిషనరీలుగా పంపించారు. ఆసియాకు ఆగ్నేయంలో ఉన్న ఆ అందమైన ప్రాంతంలో మేము ఎన్నో కొత్త విషయాల్ని చూశాం, విన్నాం, ఆస్వాదించాం. అక్కడున్న ప్రజలకు దేవుని రాజ్యం గురించిన మంచివార్త చెప్పాలని ఎంతో కోరుకున్నాం.

కానీ కంబోడియాలోని రాజకీయ పరిస్థితులు మారడంతో మేము దక్షిణ వియత్నాంకు వెళ్లాల్సి వచ్చింది. రెండు సంవత్సరాల తర్వాత నా ఆరోగ్యం బాగా పాడైంది. విచారకరంగా తిరిగి అమెరికాకు రావాల్సి వచ్చింది. కోలుకోవడానికి నాకు కొంత సమయం పట్టింది. నా ఆరోగ్యం మెరుగయ్యాక మళ్లీ పయినీరు సేవ మొదలుపెట్టాను.

1975⁠లో టీవీలో ఇంటర్వ్యూ ఇచ్చేముందు ఎంజలతో

1965 మార్చిలో ప్రయాణ పనిలో భాగంగా సంఘాలను సందర్శించడం మొదలుపెట్టాం. నేను 33 ఏళ్లపాటు ప్రాంతీయ పర్యవేక్షకునిగా, జిల్లా పర్యవేక్షకునిగా సేవచేశాను. ఆ పనిలో నేనూ, ఎంజల ఎంతో ఆనందించాం. మేము సమావేశాలు ఏర్పాటు చేయడంలో కూడా సహాయం చేశాం. సమావేశాలు నాకు ఉత్తేజాన్నిచ్చేవి కాబట్టి ఆ పనులు చేస్తూ నేను చాలా ఆనందించాను. కొన్ని సంవత్సరాల పాటు న్యూయార్క్‌లోని, అలాగే దాని చుట్టుపక్కల ప్రాంతాల్లోని సంఘాలను సందర్శించాం. అప్పట్లో చాలావరకు సమావేశాలు యాంకీ స్టేడియంలో నిర్వహించేవాళ్లు.

మేము తిరిగి బెతెల్‌కు, దైవపరిపాలనా పాఠశాలలకు వచ్చాం

నేనూ, ఎంజల ఆ తర్వాత కష్టమైన కొత్త నియామకాలను ఎన్నో పొందాం. 1995⁠లో నన్ను పరిచర్య శిక్షణా పాఠశాలకు ఉపదేశకునిగా పని చేయమని సంస్థ కోరింది. మూడు సంవత్సరాల తర్వాత బెతెల్‌లో సేవ చేయడానికి రమ్మన్నారు. మళ్లీ 40 సంవత్సరాల తర్వాత బెతెల్‌కి వచ్చినందుకు నాకు సంతోషంగా అనిపించింది. నిజానికి నేను బెతెల్‌లోనే నా ప్రత్యేక పూర్తికాల సేవను మొదలుపెట్టాను. కొంతకాలంపాటు, నేను సేవా విభాగంలో అలాగే యెహోవా సేవ ఎక్కువగా చేసేందుకు సహాయం చేసే పాఠశాలలకు ఉపదేశకునిగా పనిచేశాను. పరిపాలక సభ 2007⁠లో దైవపరిపాలనా పాఠశాలల విభాగాన్ని ఏర్పాటు చేసింది. ఆ విభాగం బెతెల్‌లో జరిగే అన్ని పాఠశాలల్ని చూసుకునేది. కొన్నేళ్లపాటు నేను ఆ విభాగానికి పర్యవేక్షకునిగా సేవచేశాను.

ఈ మధ్యకాలంలో, బెతెల్‌లో జరిగే పాఠశాలలకు సంబంధించి ఎన్నో మార్పులు చేశారు. 2008⁠లో సంఘపెద్దల కోసం పాఠశాలను ప్రారంభించారు. ఆ తర్వాత రెండు సంవత్సరాల్లో 12,000 కన్నా ఎక్కువమంది పెద్దలు ప్యాటర్‌సన్‌లో అలాగే బ్రూక్లిన్‌ బెతెల్‌లో జరిగిన పాఠశాలల్లో శిక్షణ పొందారు. నేడు కూడా ఈ పాఠశాల చాలా ప్రాంతాల్లో జరుగుతోంది. 2010⁠లో పరిచర్య శిక్షణ పాఠశాలను, ఒంటరి సహోదరుల కోసం బైబిలు పాఠశాలగా మార్చారు. దానితోపాటు క్రైస్తవ దంపతుల కోసం బైబిలు పాఠశాల అనే కొత్త పాఠశాలను ప్రారంభించారు.

2015, సెప్టెంబరులో ఆ రెండు పాఠశాలల్ని కలిపి రాజ్య సువార్తికుల కోసం పాఠశాలగా ఏర్పాటు చేశారు. ఈ పాఠశాలకు దంపతులు, ఒంటరి సహోదరసహోదరీలు హాజరవ్వవచ్చు. ఈ పాఠశాల తమ దేశంలో కూడా ఏర్పాటు చేస్తున్నారని విని చాలామంది సంతోషంతో గంతులు వేశారు. దైవిక విద్యను ఎక్కువమంది పొందేలా జరుగుతున్న ఈ ఏర్పాట్లను చూస్తుంటే నాకు సంతోషంగా ఉంది. అంతేకాదు ఈ పాఠశాలల్లో శిక్షణ పొందడం కోసం, తమ జీవితాల్లో మార్పులు చేసుకున్న ఎంతోమందిని కలిసినందుకు కూడా నాకు చాలా ఆనందంగా ఉంది.

బాప్తిస్మం తీసుకోవడానికి ముందు ఆ చల్లని గోడౌన్‌లో నిలబడిన రోజునుండి ఈరోజు వరకు గడిచిన నా జీవితం గురించి ఆలోచించినప్పుడు నేను యెహోవాకు ఎన్నో కృతజ్ఞతలు చెప్తాను. ఎందుకంటే, ఈ సంవత్సరాలన్నిటిలో జ్ఞానంగల వాళ్లను నేను కలిశాను. నేను యెహోవా గురించి తెలుసుకొని, ఆయన సేవ మరింత చక్కగా చేయడానికి వాళ్లు నాకు సహాయం చేశారు. అలా సహాయం చేసినవాళ్లలో కొంతమంది నాకన్నా చిన్నవాళ్లు, ఇంకొంతమంది పెద్దవాళ్లు. అంతేకాదు చాలామంది వేర్వేరు సంస్కృతులకు చెందినవాళ్లు. కానీ వాళ్ల పనులను, ఆలోచనల్ని గమనించినప్పుడు వాళ్లు యెహోవాను ఎంత ఎక్కువగా ప్రేమిస్తున్నారో అర్థంచేసుకున్నాను. నేను ఎన్నో విషయాలు నేర్చుకోవడానికి సహాయం చేసిన జ్ఞానంగల యెహోవా ప్రజలు నాకు స్నేహితులైనందుకు చాలా సంతోషంగా ఉంది.

పాఠశాలలకు హాజరయ్యే వేర్వేరు దేశాలకు చెందిన విద్యార్థుల్ని కలవడం నాకు సంతోషంగా ఉంటుంది