కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

స్నేహం పాడయ్యేలా ఉన్నప్పుడు మీ స్నేహితున్ని ఆదుకోండి

స్నేహం పాడయ్యేలా ఉన్నప్పుడు మీ స్నేహితున్ని ఆదుకోండి

దాదాపు 50 ఏళ్లుగా జాన్నీ, మౌరీట్‌స్యో స్నేహితులుగా ఉన్నారు. అయితే, ఒకానొక సమయంలో వాళ్ల స్నేహం బీటలువారింది. మౌరీట్‌స్యో దాని గురించి మాట్లాడుతూ, “నేను కొన్ని ఘోరమైన పొరపాట్లు చేయడంవల్ల మా మధ్య దూరం ఏర్పడింది” అని వివరించాడు. ఆ తర్వాత జాన్నీ ఏమన్నాడంటే, “మౌరీట్‌స్యోయే నాకు బైబిలు స్టడీ ఇచ్చాడు. యెహోవాతో నా స్నేహం బలపర్చుకోవడానికి అతని సహాయాన్నే తీసుకునేవాణ్ణి. కాబట్టి, అతను చేసిన తప్పు గురించి విన్నప్పుడు నేను నమ్మలేకపోయాను. మా స్నేహం తెగిపోతుందనే విషయం అర్థంకాగానే నా కాళ్ల కింద భూమి కదిలినట్లు అనిపించింది. నేను ఒంటరివాడిని అయిపోయాను అనుకున్నాను.”

మంచి స్నేహితులు విలువైనవాళ్లు, చిరకాల స్నేహితుల్ని సంపాదించుకోవడం అంత తేలిక కాదు. ఒకవేళ స్నేహం పాడయ్యే పరిస్థితి ఏర్పడితే, దాన్ని కాపాడుకోవడానికి ఏది సహాయం చేస్తుంది? బైబిల్లో కొంతమంది ప్రాణ స్నేహితుల గురించి ఉంది. అయితే కొంతకాలానికి వాళ్ల స్నేహం కూడా పాడయ్యే పరిస్థితి ఏర్పడింది. వాళ్ల నుండి మనం ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు.

స్నేహితుడు తప్పు చేసినప్పుడు

గొర్రెలకాపరి, రాజు అయిన దావీదుకు మంచి స్నేహితులు ఖచ్చితంగా ఉన్నారు. దావీదు స్నేహితులు అనగానే మనకు యోనాతాను గుర్తుకొస్తాడు. (1 సమూ. 18:1) కానీ దావీదుకు నాతాను ప్రవక్త వంటి వేరే స్నేహితులు కూడా ఉన్నారు. దావీదు, నాతాను ఎంతకాలంగా స్నేహితులుగా ఉన్నారో బైబిలు చెప్పట్లేదు. సాధారణంగా మనం మన మనసులోని మాటను స్నేహితులకు చెప్తాం. అదేవిధంగా దావీదు ఒక సందర్భంలో తన మనసులోని మాటను అంటే, యెహోవాకు ఒక ఆలయం కట్టాలనే కోరిక గురించి నాతానుతో చెప్పాడు. నాతాను దావీదుకు స్నేహితుడు మాత్రమేకాదు, యెహోవా పవిత్రశక్తి కూడా అతని మీద ఉంది. అందుకే దావీదు అతని అభిప్రాయానికి విలువిచ్చి ఉంటాడు.—2 సమూ. 7:2, 3.

కానీ, వాళ్ల స్నేహం దెబ్బతినే పరిస్థితి ఒకటి వచ్చింది. రాజైన దావీదు బత్షెబతో వ్యభిచారం చేశాడు, ఆ తర్వాత ఆమె భర్తయైన ఊరియాను చంపించాడు. (2 సమూ. 11:2-21) చాలా సంవత్సరాలపాటు దావీదు యెహోవాకు నమ్మకంగా ఉంటూ, న్యాయంగా నడుచుకున్నాడు. కానీ కొంతకాలం తర్వాత అతను ఈ ఘోరమైన పాపం చేశాడు. ఇంతకీ మంచివాడైన ఆ రాజు ఎందుకలా చేశాడు? అతను చేసిన పాపం ఎంత ఘోరమైనదో గ్రహించలేకపోయాడా? దేవునికి తెలియకుండా ఆ తప్పును కప్పిపుచ్చవచ్చని అనుకున్నాడా?

మరి నాతాను ఏమి చేస్తాడు? దావీదు ఊరియాను ఎలా చంపించాడో ఇతరులకు తెలుసు. కాబట్టి, వేరేవాళ్లు వెళ్లి రాజుతో ఆ విషయం గురించి మాట్లాడాలని చూస్తాడా? ఒకవేళ ఈ విషయంలో నాతాను జోక్యం చేసుకుంటే, ఎప్పటినుండో ఉన్న వాళ్ల స్నేహం పాడవ్వవచ్చు. అంతేకాదు నాతాను ఆ విషయం గురించి దావీదు దగ్గర మాట్లాడితే తన ప్రాణాల్ని కూడా పోగొట్టుకునే పరిస్థితి రావచ్చు. అందులోనూ, దావీదు అప్పటికే అమాయకుడైన ఊరియాను చంపించేశాడు.

కానీ నాతాను దేవుని తరఫున మాట్లాడే వ్యక్తి. ఒకవేళ అతను మౌనంగా ఉంటే, దావీదుతో అతని స్నేహం పాడైపోతుందనీ, తన మనస్సాక్షి బాధపడుతుందనీ తెలుసు. తన స్నేహితుడైన దావీదు యెహోవాకు ఇష్టంలేని పని చేశాడు. యెహోవాతో ఉన్న స్నేహాన్ని కాపాడుకోవడానికి అతనికి వెంటనే సహాయం అవసరమైంది. అవును, దావీదుకు నిజమైన స్నేహితుడు అవసరం. నాతానే అలాంటి స్నేహితుడు. దావీదు ఒకప్పుడు గొర్రెల కాపరి కాబట్టి అతని హృదయాన్ని తాకే ఉదాహరణ ఉపయోగించి నాతాను మాట్లాడాడు. దావీదు తాను చేసిన తప్పులు ఎంత ఘోరమైనవో అర్థంచేసుకుని, పశ్చాత్తాపపడే విధంగా నాతాను దేవుని సందేశాన్ని చెప్పాడు.—2 సమూ. 12:1-15.

మీ స్నేహితుడు కూడా ఏదైనా పెద్ద పొరపాటు లేదా ఘోరమైన పాపం చేసివుంటే మీరేమి చేస్తారు? అతని తప్పును ఎత్తి చెప్తే మీ స్నేహం పాడౌతుందని మీరు అనుకోవచ్చు. సాధారణంగా తప్పు చేసిన వ్యక్తి దేవుని స్నేహాన్ని తిరిగి పొందడానికి పెద్దలు సహాయం చేస్తారు. కానీ వాళ్లకు ఈ తప్పు గురించి చెప్తే మీ స్నేహితునికి నమ్మకద్రోహం చేసినట్టు అవుతుందని మీరు అనుకోవచ్చు. మరి మీరేమి చేస్తారు?

పై పేరాల్లో చూసిన జాన్నీ ఇలా చెప్తున్నాడు, “అతనిలో ఏదో మార్పును గమనించాను. మౌరీట్‌స్యో అంతకుముందులా నాతో సరిగ్గా మాట్లాడట్లేదు. చాలా కష్టమే అయినా నేను అతనితో మాట్లాడి ఏమి జరిగిందో తెలుసుకోవాలనుకున్నాను. అయితే, ‘ఏమి చేయాలో అతనికి తెలిసినప్పుడు నేనేమి చెప్పగలను? అతను సరిగ్గా స్పందించకపోతే నేను బాధపడాల్సి వస్తుంది’ అని అనుకున్నాను. కానీ మేము కలిసి స్టడీ చేస్తున్నప్పుడు నేర్చుకున్న విషయాల్ని గుర్తుచేసుకున్నప్పుడు అతనితో మాట్లాడడానికి కావాల్సిన ధైర్యం వచ్చింది. నాకు సహాయం అవసరమైనప్పుడు కూడా మౌరీట్‌స్యో అలాగే మాట్లాడాడు. నేను నా స్నేహితున్ని దూరం చేసుకోవాలనుకోలేదు. అతనిపట్ల నాకు శ్రద్ధ ఉంది కాబట్టి అతనికి సహాయం చేయాలనుకున్నాను.”

మౌరీట్‌స్యో ఇలా అంటున్నాడు, “జాన్నీ నాకు నిజంగా సహాయం చేయాలనుకున్నాడు, అతను చెప్పింది కూడా సరైనదే. నేను తీసుకున్న చెడ్డ నిర్ణయాల వల్ల వచ్చిన పర్యవసానాలకు కారణం అతను కాదు, యెహోవా కూడా కాదు. అందుకే సంఘపెద్దలు నాకిచ్చిన క్రమశిక్షణను అంగీకరించాను, కొంతకాలానికి యెహోవా స్నేహాన్ని మళ్లీ సంపాదించుకున్నాను.”

స్నేహితుడు కష్టంలో ఉన్నప్పుడు

కష్టాల్లో ఉన్నప్పుడు నమ్మకంగా తన పక్షాన నిలబడిన స్నేహితులు కూడా దావీదుకు ఉన్నారు. అలాంటి వాళ్లలో హూషై ఒకడు. అతన్ని బైబిలు ‘దావీదు స్నేహితుడు’ అని పిలుస్తోంది. (2 సమూ. 16:16; 1 దిన. 27:33) అతను రాజభవనంలో అధిపతి, రాజుకు స్నేహితుడు అయ్యుండవచ్చు. అంతేకాదు, కొన్నిసార్లు రహస్యాలను చేరవేసిన నమ్మకస్థుడు కూడా అయ్యుంటాడు.

దావీదు కొడుకైన అబ్షాలోము కుట్రపన్ని సింహాసనం చేజిక్కించుకున్నప్పుడు, చాలామంది ఇశ్రాయేలీయులు అబ్షాలోము వైపు వెళ్లారు. కానీ హూషై మాత్రం అలా చేయలేదు. దావీదు పారిపోతున్నప్పుడు, హూషై వెళ్లి అతన్ని కలిశాడు. కన్న కొడుకు అలాగే తాను ఎంతగానో నమ్మిన కొంతమంది నమ్మకద్రోహం చేసినందుకు దావీదు చాలా బాధపడ్డాడు. హూషై మాత్రం నమ్మకంగా ఉంటూ, తన ప్రాణాల్ని పణంగా పెట్టి అబ్షాలోము పన్నుతున్న కుట్ర విఫలమయ్యేలా చేయడానికి సిద్ధమయ్యాడు. అలా చేయడం ఒక అధిపతిగా కేవలం తన బాధ్యతని హూషై భావించలేదు. బదులుగా అతను నమ్మకమైన స్నేహితునిగా నిరూపించుకున్నాడు.—2 సమూ. 15:13-17, 32-37; 16:15–17:16.

సంఘంలో తమ స్థానం లేదా నియామకం ఏదైనప్పటికీ నేడు సహోదరసహోదరీలు ఐక్యంగా ఉండడం చూస్తుంటే సంతోషంగా ఉంటుంది. వాళ్లు తమ పనుల ద్వారా ఇలా చెప్తున్నారు, “ఏదో పేరుకు నేను నీ స్నేహితుణ్ణి కాదుగానీ నువ్వు నిజంగా నాకు ప్రాముఖ్యమైన వ్యక్తివి.”

ఫెడెరీకో అనే సహోదరునికి ఎదురైన అనుభవం అలాంటిదే. అతను తన స్నేహితుడైన ఆంటోనియో సహాయంతో తన జీవితంలోని కష్టమైన పరిస్థితిని అధిగమించగలిగాడు. ఫెడెరీకో ఇలా చెప్తున్నాడు, “ఆంటోనియో వేరే సంఘం నుండి మా సంఘానికి వచ్చినప్పుడు, కొన్నిరోజుల్లోనే మేం స్నేహితులమయ్యాం. మేమిద్దరం సంఘ పరిచారకులముగా కలిసి పనిచేస్తూ ఆనందించాం. కొంతకాలం తర్వాత అతను సంఘపెద్ద అయ్యాడు. అతను నా స్నేహితుడు మాత్రమే కాదు, ఆధ్యాత్మిక విషయాల్లో నాకు మంచి ఆదర్శం కూడా.” ఆ తర్వాత ఫెడెరీకో తప్పటడుగు వేశాడు. అతను వెంటనే సంఘపెద్దల సహాయం తీసుకున్నప్పటికీ, పయినీరుగా లేదా సంఘ పరిచారకునిగా ఉండే అర్హతను కోల్పోయాడు. మరి ఆంటోనియో ఎలా స్పందించాడు?

ఫెడెరీకోకు సమస్య ఎదురైనప్పుడు, అతను చెప్పినవన్నీ ఆంటోనియో విన్నాడు. అతన్ని ప్రోత్సహించాడు

ఫెడెరీకో ఇలా అంటున్నాడు, “నేను పడిన బాధను ఆంటోనియో అర్థంచేసుకున్నాడు. నా బాధను తగ్గించడానికి అతను చేయగలినదంతా చేశాడు. నేను యెహోవా స్నేహాన్ని తిరిగి సంపాదించుకోవాలని అతను ఎంతగానో కోరుకున్నాడు, అతను నన్ను ఎప్పుడూ వదిలిపెట్టలేదు. నేను ఆధ్యాత్మిక విషయాల్లో మళ్లీ చురుగ్గా ఉండాలని, దాని విషయంలో పట్టుదలతో పనిచేయాలని అతను నన్ను ప్రోత్సహించాడు.” ఆంటోనియో ఇలా వివరిస్తున్నాడు, “నేను ఫెడెరీకోతో ఎక్కువ సమయం గడిపాను. అతను నాతో దేని గురించైనా సరే సంకోచించకుండా మాట్లాడవచ్చని, చివరికి తన బాధ గురించి కూడా మాట్లాడవచ్చని చెప్పాను.” సంతోషకరంగా, ఫెడెరీకో యెహోవా స్నేహాన్ని తిరిగి సంపాదించాడు. కొంతకాలానికి పయినీరుగా, సంఘ పరిచారకునిగా మళ్లీ నియామకం పొందాడు. ఆంటోనియో చివరిగా ఇలా అంటున్నాడు, “మేము వేర్వేరు సంఘాల్లో సేవ చేస్తున్నప్పటికీ ఇంతకుముందుకన్నా ఇప్పుడు ఇంకా సన్నిహితంగా ఉంటున్నాం.”

మీకు నమ్మకద్రోహం చేసినట్టు అనిపించినప్పుడు

మీరు బాగా అవసరంలో ఉన్నప్పుడు, మీ ప్రాణ స్నేహితుడు మీకు సహాయం చేయకపోతే మీకెలా అనిపిస్తుంది? కొన్ని విషయాలు ఎక్కువ బాధపెడతాయి. మీరు అతన్ని క్షమించగలుగుతారా? మీ స్నేహం అంతకుముందులా ఎప్పటికీ బలంగా ఉంటుందా?

యేసు భూమ్మీద గడిపిన చివరిరోజుల్లో ఏమి జరిగిందో పరిశీలించండి. ఆయన తన నమ్మకమైన అపొస్తలులతో ఎక్కువ సమయం గడిపాడు, వాళ్లు ఒక ప్రత్యేక బంధం చేత ఐక్యమయ్యారు. యేసు సరిగ్గానే వాళ్లను తన స్నేహితులని పిలిచాడు. (యోహా. 15:15) కానీ యేసును సైనికులు బంధించినప్పుడు ఏమి జరిగింది? అపొస్తలులు పారిపోయారు. అంతేకాదు తన బోధకుణ్ణి ఎన్నడూ విడిచిపెట్టనని అందరిముందు చెప్పిన పేతురు కూడా అదే రాత్రి యేసు ఎవరో తనకు తెలియదని చెప్పాడు.—మత్త. 26:31-33, 56, 69-75.

తన చివరి పరీక్షను ఒంటరిగా ఎదుర్కొంటాడని యేసుకు ముందే తెలుసు. అయినప్పటికీ, ఆయన నిరుత్సాహపడడానికి, బాధపడడానికి కారణం ఉంది. కానీ ఆయన పునరుత్థానమైన కొన్నిరోజుల తర్వాత తన శిష్యులతో మాట్లాడుతున్నప్పుడు ఏమాత్రం నిరుత్సాహాన్నిగానీ, కోపాన్నిగానీ, బాధనుగానీ కనబడనివ్వలేదు. తనను సైనికులు బంధించిన రాత్రి శిష్యులు చేసిన పని గురించే కాదు, వాళ్లలో ఉన్న ఇతర లోపాల గురించి కూడా యేసు మళ్లీ ప్రస్తావించాలనుకోలేదు.

దానికి భిన్నంగా, పేతురుకు ఇతర అపొస్తలులకు యేసు ధైర్యం చెప్పాడు. మానవ చరిత్రలోనే అత్యంత ప్రాముఖ్యమైన విద్యాపనికి సంబంధించిన నిర్దేశాలు ఇవ్వడం ద్వారా వాళ్లపై ఆయనకు నమ్మకం ఉందని చూపించాడు. యేసు తన అపొస్తలుల్ని ఇంకా స్నేహితుల్లానే భావించాడు. ఆయన చూపించిన ప్రేమ వాళ్ల హృదయాల్లో చెరగని ముద్రవేసింది. తమ బోధకుణ్ణి ఇంకెప్పుడూ బాధపెట్టకుండా ఉండడానికి వాళ్లు చేయగలిగినదంతా చేయాలనుకున్నారు. నిజానికి, ఆయన ఇచ్చిన పనిని వాళ్లు చక్కగా పూర్తి చేశారు.—అపొ. 1:8; కొలొ. 1:23.

ఎల్‌వీరా అనే సహోదరి, తన స్నేహితురాలైన జూల్యానాతో తనకు అభిప్రాయభేదం వచ్చిన సందర్భాన్ని గుర్తుచేసుకుంటూ ఇలా అంది, “నేను చేసిన పనివల్ల ఆమెకు బాధ కలిగిందని చెప్పినప్పుడు నామీద నాకు కోపం వచ్చింది. నన్ను కోప్పడడానికి ఆమెకు సరైన కారణమే ఉంది. కానీ నన్ను ఆకట్టుకున్న విషయం ఏమిటంటే, ఆమె నా గురించి, నా ప్రవర్తన వల్ల వచ్చే ఫలితం గురించే ఎక్కువగా ఆలోచించింది. నేను ఆమె విషయంలో చేసిన తప్పు గురించి కాకుండా నాకు నేను చేసుకుంటున్న హాని గురించే ఆమె ఎక్కువగా ఆలోచించినందుకు నేను ఎప్పటికీ కృతజ్ఞురాలినే. తన గురించి కన్నా నా మేలు గురించే ఆలోచించే స్నేహితురాలు నాకున్నందుకు నేను యెహోవాకు కృతజ్ఞతలు చెప్పాను.”

నిజానికి, స్నేహం పాడయ్యేలా ఉన్నప్పుడు ఒక మంచి స్నేహితుడు ఏమి చేస్తాడు? ఆ స్నేహితుడు అబ్బాయి అయినా, అమ్మాయి అయినా దయగా, అవసరమైతే దాపరికంలేకుండా మాట్లాడతారు. అలాంటి స్నేహితులు, కష్టకాలాల్లో కూడా నమ్మకంగా ఉన్న నాతాను, హూషైలులా అలాగే క్షమించడానికి సిద్ధంగా ఉన్న యేసులా ఉంటారు. మీరు కూడా అలాంటి స్నేహితునిగా ఉన్నారా?