కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మానసిక సమస్యలు ఉన్నవాళ్లకు మనం చేయగల సహాయం

మానసిక సమస్యలు ఉన్నవాళ్లకు మనం చేయగల సహాయం

బైబిల్లో ఇలా ఉంది: “నిజమైన స్నేహితుడు ఎల్లప్పుడూ ప్రేమిస్తాడు, కష్టకాలంలో అతను సహోదరుడిలా ఉంటాడు.”​—సామెతలు 17:17.

అంటే . . .

మన ఫ్రెండ్‌ ఎవరైనా మానసిక సమస్యతో బాధపడుతుంటే మనకు కంగారుగా అనిపిస్తుంది. అయితే వాళ్లను కృంగదీస్తున్న సమస్యను తట్టుకోవడానికి సహాయం చేయడం ద్వారా మనకు వాళ్లమీద ఎంత శ్రద్ధ ఉందో చూపించవచ్చు. ఎలా?

దానివల్ల ఉపయోగం

“వినడానికి త్వరపడాలి.”​—యాకోబు 1:19.

మీ ఫ్రెండ్‌కి మీరు చేయగలిగే బెస్ట్‌ సహాయం ఏంటంటే, వాళ్లు మాట్లాడుతున్నప్పుడు మనసుపెట్టి వినడం. వాళ్లు చెప్పే ప్రతీదానికి, మీరు కూడా తిరిగి ఏదో ఒకటి చెప్పాల్సిన అవసరం లేదు. మీరు వింటున్నారని, తనమీద మీకు శ్రద్ధ ఉందని తెలిసేలా చేస్తే సరిపోతుంది. వాళ్లకు ఎలా అనిపిస్తుందో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి; వాళ్ల మాటల్ని బట్టి వాళ్ల గురించి ఒక అభిప్రాయానికి వచ్చేయకండి. కొన్నిసార్లు వాళ్లు ముందూ-వెనకా ఆలోచించకుండా ఏదోకటి అనేస్తుంటారని లేదా చేసేస్తుంటారని గుర్తుంచుకోండి.​—యోబు 6:2, 3.

“ఊరటనిచ్చేలా మాట్లాడండి.”​—1 థెస్సలొనీకయులు 5:14.

మీ ఫ్రెండ్‌ ఆందోళనతో బాధపడుతుండవచ్చు లేదా ఎందుకూ ­పనికిరానని అనుకుంటుండవచ్చు. అలాంటి టైంలో ఏం చెప్పాలో మీకు తెలీకపోయినా, ‘నీకు నేనున్నాను’ అని భరోసా ఇవ్వడానికి ప్రయత్నించండి. అప్పుడు వాళ్లకు చాలా ధైర్యంగా, ప్రశాంతంగా అనిపిస్తుంది.

“నిజమైన స్నేహితుడు ఎల్లప్పుడూ ప్రేమిస్తాడు.”​—సామెతలు 17:17.

వాళ్లకు అవసరమైన సహాయం చేయండి. వాళ్లకు ఏం అవసరమో మీకు తెలుసని అనుకోకుండా, వాళ్లనే ఒక మాట అడగండి. చెప్పడానికి వాళ్లు ఇబ్బంది పడుతుంటే మీరే వాళ్లకు కొన్ని ఆప్షన్లు ఇవ్వండి. ఉదాహరణకు, వాకింగ్‌కి వస్తారేమో అడగండి. సరుకులు కొనడం, క్లీనింగ్‌ చేయడం లేదా వేరే ఏదైనా పనిలో సహాయం అవసరమేమో అడగండి.​—గలతీయులు 6:2.

“ఓర్పుగా ఉండండి.”​—1 థెస్సలొనీకయులు 5:14.

అన్నిసార్లు మీ ఫ్రెండ్‌ మాట్లాడడానికి ఇష్టపడకపోవచ్చు. తనకు నచ్చినప్పుడు మాట్లాడవచ్చని, వినడానికి మీరు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారని తెలిసేలా చేయండి. అయితే తనకున్న మానసిక సమస్య వల్ల తను మిమ్మల్ని బాధపెట్టేలా మాట్లాడవచ్చు లేదా ప్రవర్తించవచ్చు. ఉదాహరణకు, మిమ్మల్ని కలుస్తానని, ఎక్కడికైనా వెళ్దామని చెప్పి క్యాన్సిల్‌ చేయవచ్చు లేదా మీమీద చిరాకు పడవచ్చు. మీరు తనకు సహాయం చేయాలని అనుకుంటున్నారు కాబట్టి ఓర్పుగా ఉండండి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి.​—సామెతలు 18:24.

మీ తోడు వాళ్లకు అవసరం కావచ్చు

“నా ఫ్రెండ్‌కి మాట్లాడాలని ఎప్పుడు అనిపించినా, వినడానికి నేనున్నానని తనకు తెలిసేలా చేస్తాను. తన సమస్యలన్నిటికీ నా దగ్గర పరిష్కారం లేకపోయినా, తను ఏం చెప్తుందో శ్రద్ధగా వింటాను. కొన్నిసార్లు నేను ఏం చెప్పకుండా జస్ట్‌ విన్నా చాలు, తనకు మనశ్శాంతిగా అనిపిస్తుంది.”​—ఫరా, a తన ఫ్రెండ్‌ ఈటింగ్‌ డిజార్డర్‌తో, ఆందోళనతో, డిప్రెషన్‌తో బాధపడుతోంది.

“నా ఫ్రెండ్‌ నన్ను చాలా బాగా చూసుకుంటుంది, అర్థం చేసుకుంటుంది. ఒకరోజు నన్ను వాళ్ల ఇంటికి భోజనానికి పిలిచింది. తను చూపించిన ప్రేమా-ఆప్యాయత వల్ల మనసువిప్పి నా ఫీలింగ్స్‌ అన్నీ చెప్పుకున్నాను. ఆ రోజు మనసుకు హాయిగా అనిపించింది.”​—హెలెన్‌, డిప్రెషన్‌తో బాధపడుతోంది.

“ఓపిగ్గా ఉండడం చాలా అవసరం. నా భార్య ఎప్పుడైనా నన్ను బాధపెడితే, తను కావాలని కాదుగానీ తనకున్న మానసిక సమస్య వల్లే అలా ప్రవర్తిస్తోందని గుర్తు చేసుకుంటాను. దానివల్ల తన మీద కోప్పడకుండా ఉంటున్నాను, ఇంకా బాగా అర్థం చేసుకుంటున్నాను.”​—జేకబ్‌, ఆయన భార్య డిప్రెషన్‌తో బాధపడుతోంది.

“నా భార్య నాకు చాలా సపోర్ట్‌గా ఉంటూ ధైర్యం చెప్తుంది. నాకు ఆందోళనగా, కంగారుగా అనిపించినప్పుడు నాకు ఇష్టంలేని ఏ పనినీ చేయమని బలవంత పెట్టదు. నావల్ల తనకిష్టమైన పనులు కూడా కొన్నిసార్లు చేయలేక పోతుంటుంది. కొంచెం కూడా స్వార్థం లేకుండా, అన్ని విషయాల్లో నాకు చాలా హెల్ప్‌ చేస్తుంది. అందుకే తనంటే నాకు ప్రాణం.”​—హెన్రీ, ఆందోళనతో బాధపడుతున్నాడు.

a పేర్లు మార్చాం.