కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

బైబిలు జీవితాలను మారుస్తుంది

నాకు చనిపోవాలని లేదు

నాకు చనిపోవాలని లేదు
  • పుట్టిన సంవత్సరం: 1964

  • దేశం: ఇంగ్లాండ్‌

  • ఒకప్పుడు: బాధ్యతలేకుండా ప్రవర్తించేది, టీనేజ్‌లోనే తల్లి అయ్యింది

నా గతం

నేను ఇంగ్లాండ్‌లోని లండన్‌లో, జనాభా ఎక్కువగా ఉన్న పాడింగ్‌టన్‌ ప్రాంతంలో పుట్టాను. మా అమ్మా, ముగ్గురు అక్కలతో కలసి ఉండేదాన్ని. తాగుడు వల్ల మా నాన్న మాతో సరిగ్గా కలిసి లేడు, ఇంటికి వస్తూ పోతూ ఉండేవాడు.

ప్రతి రోజూ పడుకునే ముందు ప్రార్థన చేయమని చిన్నప్పుడు మా అమ్మ నేర్పించింది. నా దగ్గర కీర్తనలు మాత్రమే ఉన్న ఒక చిన్న బైబిలు ఉండేది. ఆ కీర్తనలను పాడడానికి వీలుగా రాగాలు కట్టేదాన్ని. నా పుస్తకాల్లో ఉన్న ఒక మాట మనసులో ఉండిపోయింది: “ఏదో ఒక రోజు రేపు అనేదే ఉండదు.” ఇది చదివినప్పటి నుండి రాత్రులు నిద్రపట్టక భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉండేదాన్ని. ‘జీవితంలో ఇంకా ఎంతో ఉండాలి కదా,’ ‘నేను ఇక్కడ ఎందుకు ఉన్నాను?’ అని అనుకునేదాన్ని. నాకు చనిపోవాలని లేదు.

నాకు మంత్రతంత్రాల గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి కలిగింది. చనిపోయిన వాళ్లతో మాట్లాడడానికి ప్రయత్నించాను. స్కూల్‌ ఫ్రెండ్స్‌తో కలసి సమాధుల దగ్గరకు వెళ్లాను, దయ్యాల సినిమాలు చూశాను. అవి మాకు సరదాగా, భయంగా కూడా అనిపించేవి.

పదేళ్ల నుండే బాధ్యత లేకుండా ప్రవర్తించడం మొదలుపెట్టాను. పొగాకు తాగడం మొదలుపెట్టి దానికి త్వరగా బానిసైపోయాను. తర్వాత, గంజాయి కూడా అలవాటయ్యింది. 11 సంవత్సరాలకే మందు కొట్టాను. దాని రుచి నచ్చకపోయినా, తాగిన తర్వాత వచ్చే మత్తు నాకు నచ్చేది. మ్యూజిక్‌, డ్యాన్స్‌ అంటే కూడా నాకు చాలా ఇష్టం. వీలైనప్పుడల్లా పార్టీలకు, నైట్‌క్లబ్‌లకు వెళ్లేదాన్ని. రోజూ రాత్రి అవ్వగానే బయటికి వెళ్లిపోయి తెల్లవారే ముందు ఇంటికి వచ్చేదాన్ని. దానివల్ల అలసిపోయి ఎక్కువగా స్కూల్‌కి డుమ్మా కొట్టేదాన్ని. ఒకవేళ వెళ్లినా, క్లాసుల మధ్యలో తాగేదాన్ని.

స్కూల్లో చివరి సంవత్సరంలో నాకు చాలా తక్కువ మార్కులు వచ్చాయి. నేను ఎంతగా దారి తప్పానో మా అమ్మకు చాలావరకు తెలీదు కాబట్టి బాధపడి నాపై కోపపడింది. మేము బాగా పోట్లాడుకున్నాం, నేను ఇంటినుండి పారిపోయాను. కొంతకాలం, నా బాయ్‌ఫ్రెండ్‌ టోనీ దగ్గర ఉన్నాను. అతను రస్టఫేరియన్‌ మతానికి చెందినవాడు, చిన్నచిన్న నేరాలు చేస్తూ, మత్తుమందులు అమ్మేవాడు. అతడు చాలా క్రూరుడనే పేరు తెచ్చుకున్నాడు. కొంతకాలానికే నేను గర్భవతినయ్యాను, 16 సంవత్సరాలకి నాకు బాబు పుట్టాడు.

బైబిలు నా జీవితాన్ని ఎలా మార్చిందంటే . . .

పెళ్లికాని తల్లులు వాళ్ల పిల్లలతో ఉండడానికి ఏర్పాటు చేసిన హాస్టల్‌లో ఉంటున్నప్పుడు నేను యెహోవాసాక్షులను మొదటిసారి కలిశాను. స్థానిక అధికారులు అక్కడ నాకు ఒక గది ఇచ్చారు. సాక్షులైన ఇద్దరు స్త్రీలు, కొంతమంది యువ తల్లులను కలవడం కోసం ఎప్పుడూ అక్కడకు వచ్చేవాళ్లు. ఒకరోజు వాళ్లు మాట్లాడుకుంటుంటే నేనూ వెళ్లి విన్నాను. యెహోవాసాక్షులు చెప్పేది తప్పు అని నిరూపించాలని అనుకున్నాను. కానీ, వాళ్లు నేను అడిగిన ప్రతీ ప్రశ్నకు ప్రశాంతంగా, బైబిల్లో నుండి స్పష్టంగా చెప్పారు. వాళ్లు చాలా దయగా, సౌమ్యంగా ఉన్నారు. అది నాకు చాలా నచ్చింది. అందుకే, నేను కూడా బైబిలు స్టడీకి ఒప్పుకున్నాను.

బైబిల్లో నేను నేర్చుకున్న ఒక విషయం నా జీవితాన్ని మార్చేసింది. చిన్నప్పటి నుండి నాకు చావంటే భయం. కానీ, ఇప్పుడు నేను పునరుత్థానం గురించి యేసు చెప్పిన బోధను తెలుసుకున్నాను. (యోహాను 5:28, 29) అంతేకాదు, దేవుడు స్వయంగా నన్ను కూడా పట్టించుకుంటున్నాడని తెలుసుకున్నాను. (1 పేతురు 5:7) ముఖ్యంగా, యిర్మీయా 29:11⁠లో మాటలు నన్ను ఆకట్టుకున్నాయి, “నేను మిమ్మునుగూర్చి ఉద్దేశించిన సంగతులను నేనెరుగుదును, రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములేగాని హానికరమైనవి కావు; ఇదే యెహోవా వాక్కు” అని అక్కడ ఉంది. నేను భూమి మీద పరదైసులో నిరంతరం జీవిస్తానని నమ్మడం మొదలుపెట్టాను.—కీర్తన 37:29.

యెహోవాసాక్షులు నా మీద నిజమైన ప్రేమను చూపించారు. మొదటిసారి వాళ్ల మీటింగ్‌కు వెళ్లినప్పుడు, అక్కడ అందరూ నన్ను ఆప్యాయంగా ఆహ్వానించారు. ప్రతీఒక్కరూ చాలా స్నేహపూర్వకంగా ఉన్నారు. (యోహాను 13:34, 35) వీళ్ల ప్రవర్తనకి, స్థానిక చర్చీ వాళ్లు నాతో ప్రవర్తించిన విధానానికి చాలా తేడా ఉంది. నా పరిస్థితి తెలిసి కూడా యెహోవాసాక్షులు నన్ను ఆదరించారు. వాళ్ల సమయాన్ని ఇచ్చారు. శ్రద్ధను, అవధానాన్ని చూపిస్తూ, నాకు అవసరమైన సహాయం కూడా చేశారు. నేను ఎంతో ప్రేమగా ఉండే పెద్ద కుటుంబంలో భాగమైపోయాను అనిపించింది.

దేవుని అత్యున్నతమైన ప్రమాణాలు చేరుకోవాలంటే కొన్ని మార్పులు చేసుకోవాలని బైబిలు స్టడీ ద్వారా నేర్చుకున్నాను. పొగాకు మానేయడం చాలా కష్టమైంది. అంతేకాదు, ఒకానొక మ్యూజిక్‌ విన్నప్పుడు గంజాయి తాగాలన్న కోరిక ఎక్కువౌతుందని నాకు అనిపించింది. కాబట్టి, నేను వినే మ్యూజిక్‌ని మార్చుకున్నాను. నేను తాగకూడదని అనుకున్నాను అందుకే పార్టీలకు, నైట్‌క్లబ్‌లకు వెళ్లడం మానేశాను. ఎందుకంటే అక్కడ తాగాలనే ఒత్తిడి ఎక్కువౌతుంది. నేను మార్చుకున్న జీవన విధానానికి సహాయం చేసే కొత్త ఫ్రెండ్స్‌ని వెదకడం మొదలుపెట్టాను.—సామెతలు 13:20.

ఈలోగా టోనీ కూడా యెహోవాసాక్షుల దగ్గర బైబిలు స్టడీ తీసుకోవడం మొదలుపెట్టాడు. యెహోవాసాక్షులు ఆయన అడిగిన ప్రశ్నలన్నిటికీ బైబిలు నుండి సమాధానం చెప్పారు. తను నేర్చుకుంటున్న విషయాలు నిజమనే నమ్మకం అతనికి కూడా కలిగింది. ఆయన జీవితంలో పెద్దపెద్ద మార్పులు చేసుకున్నాడు: హింసను ప్రోత్సహించిన స్నేహాలు వదిలేశాడు, చిన్నచిన్న నేరాలు చేయడం ఆపేశాడు, గంజాయి తాగడం మానేశాడు. యెహోవాను పూర్తిగా సంతోషపెట్టాలంటే మా అనైతిక ప్రవర్తనను వదిలిపేట్టేయాలని, మా కొడుకుని మంచి వాతావరణంలో పెంచాలని గ్రహించాం. మేము 1982⁠లో పెళ్లి చేసుకున్నాం.

“భవిష్యత్తు గురించి, చావు గురించి భయపడుతూ రాత్రులు నిద్రపట్టని పరిస్థితి ఇప్పుడు నాకు లేదు”

నేను చేసుకోవాలనుకున్న మార్పులు విజయవంతంగా చేసుకున్న వాళ్ల అనుభవాల కోసం కావలికోట, తేజరిల్లు! a పత్రికల్లో వెదకడం నాకు గుర్తు. వాళ్ల అనుభవాలు నాకు చాలా ప్రోత్సాహాన్ని ఇచ్చేవి. నేను మధ్యలో ఆగిపోకుండా మార్పులు చేసుకోవడానికి గట్టిగా ప్రయత్నిస్తూనే ఉండాలని ఆ ఉదాహరణలు నాకు నేర్పించాయి. నన్ను విడిచిపెట్టవద్దని యెహోవాకు ఎప్పుడూ ప్రార్థించేదాన్ని. నేను, టోనీ 1982, జూలైలో బాప్తిస్మం తీసుకుని యెహోవాసాక్షులు అయ్యాం.

నేనెలా ప్రయోజనం పొందానంటే . . .

యెహోవాతో స్నేహం పెంచుకోవడం నా జీవితాన్ని కాపాడింది. కష్ట సమయాల్లో టోనీ, నేను యెహోవా సహాయాన్ని చూశాం. కష్ట సమయాల్లో మేము యెహోవాపై ఆధారపడడం నేర్చుకున్నాం. దేవుడు మాకు ఎప్పుడూ సహాయం చేస్తూ మా కుటుంబాన్ని ఆదుకున్నాడని మేము నమ్ముతున్నాం.—కీర్తన 55:22.

నేను యెహోవాను తెలుసుకున్నట్లే, నా కొడుకుకి, కూతురుకి కూడా యెహోవా గురించి నేర్పిస్తూ నేనెంతో సంతోషించాను. వాళ్ల పిల్లలు కూడా యెహోవా జ్ఞానంలో ఎదగడం చూసి అలాంటి సంతోషమే ఇప్పుడు పొందుతున్నాను.

భవిష్యత్తు గురించి, చావు గురించి భయపడుతూ రాత్రులు నిద్రపట్టని పరిస్థితి ఇప్పుడు నాకు లేదు. టోనీ, నేను ఇప్పుడు ప్రతీవారం యెహోవాసాక్షుల వేర్వేరు సంఘాలను సందర్శిస్తూ, వాళ్లను బలపరుస్తూ బిజీగా ఉన్నాం. యేసు మీద నమ్మకాన్ని పెంచుకుంటే చనిపోకుండా ఎప్పుడూ జీవించవచ్చని మేము ఆ సంఘాల వాళ్లతో కలసి ప్రజలకు నేర్పిస్తూ ఉన్నాం.

a వీటిని యెహోవాసాక్షులు ప్రచురించారు.