కంటెంట్‌కు వెళ్లు

యువత అడిగే ప్రశ్నలు

దేన్నైనా తట్టుకొని నిలబడే శక్తి నాకు ఉందా?

దేన్నైనా తట్టుకొని నిలబడే శక్తి నాకు ఉందా?

 మీకు ఎలాంటి సమస్యనైనా తట్టుకొని నిలబడే శక్తి ఉందా? ఇలాంటి పరిస్థితులు మీకు ఎప్పుడైనా ఎదురయ్యాయా:

  •   ఇష్టమైనవాళ్లు చనిపోవడం?

  •   ఎక్కువరోజులు ఆరోగ్యం బాలేకపోవడం?

  •   ప్రకృతి విపత్తిలో నష్టపోవడం?

 చిన్నచిన్న సమస్యల్ని ఎదుర్కోవడానికి కూడా శక్తి అవసరమని పరిశోధకులు చెప్తున్నారు. ఎందుకంటే వాటివల్ల కలిగే ఒత్తిడి కూడా ఆరోగ్యాన్ని పాడుచేస్తుంది. అందుకే మీ సమస్యలు చిన్నవైనా, పెద్దవైనా వాటిని తట్టుకునే శక్తిని పెంచుకోవడం ప్రాముఖ్యం.

 తట్టుకునే శక్తి అంటే ఏంటి?

 తట్టుకునే శక్తి ఉంటే జీవితంలో వచ్చే మార్పుల్ని, కష్టాల్ని ధైర్యంగా ఎదుర్కొంటాం. అలాంటి శక్తి ఉన్నవాళ్లకు కూడా కష్టాలు వస్తాయి, వాటివల్ల మనసుకు గాయాలు కూడా అవుతాయి. కాకపోతే వాటిని ఎదుర్కోవడం వల్ల వాళ్లు మరింత బలంగా తయారౌతారు.

చెట్లు తుఫాను గాలికి అటూ ఇటూ వంగినా, వాతావరణం మామూలయ్యాక మళ్లీ నిటారుగా నిలబడతాయి. మీరు కూడా జీవితంలో తగిలే ఎదురుదెబ్బల నుండి కోలుకోగలరు.

 తట్టుకునే శక్తి ఎందుకు ఉండాలి?

  •   ఎందుకంటే కష్టాలు అందరికీ వస్తాయి. బైబిలు ఇలా చెప్తుంది: “వేగం గలవాళ్లు అన్నిసార్లూ పందెంలో గెలవరు, ... జ్ఞానం గలవాళ్లు అన్నిసార్లూ విజయం సాధించరు; ఎందుకంటే అనుకోని సమయాల్లో, అనుకోని సంఘటనలు వాళ్లందరికీ ఎదురౌతాయి.” (ప్రసంగి 9:11) ఈ వచనం ఏం నేర్పిస్తుంది? మంచివాళ్లు ఏ పొరపాటు చేయకపోయినా, వాళ్లకు కూడా కష్టాలు వస్తాయి.

  •   ఎందుకంటే అది మీ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఒక హైస్కూల్‌ కౌన్స్‌లర్‌ ఇలా రాశాడు: “నా దగ్గరికి ఇంతకుముందెప్పుడూ రానంత ఎక్కువమంది విద్యార్థులు వచ్చారు. వాళ్లందరూ తమకు పరీక్షలో మంచి మార్కులు రాలేదని, లేదా ఆన్‌లైన్‌లో ఎవరో ఏదో అన్నారని కృంగిపోయి ఉన్నారు.” ఇదీ ఒక సమస్యేనా అని అనిపించవచ్చు. కానీ యౌవనులకు వాటిని తట్టుకోవడం తెలియకపోతే వాళ్లలో మానసికపరమైన, భావోద్వేగపరమైన సమస్యలు వస్తాయని ఆ కౌన్సలర్‌ చెప్పాడు. a

  •   ఎందుకంటే తట్టుకునే శక్తి ఇప్పుడే కాదు పెద్దయ్యాక కూడా పనికొస్తుంది. మనం అనుకున్నది జరగనప్పుడు ఏం చేయాలనే దానిగురించి డాక్టర్‌ రిచర్డ్‌ లెర్నర్‌ ఇలా రాశాడు: “జీవితంలో ముందుకు వెళ్తూ ప్రయోజకులు అవ్వాలంటే చేదు అనుభవాల నుండి తేరుకోగలగాలి, కొత్త లక్ష్యాలు పెట్టుకోవాలి, వీలైతే అనుకున్నది సాధించడానికి వేరే మార్గాలు వెదకాలి.” b

 తట్టుకునే శక్తిని ఎలా పెంచుకోవచ్చు?

  •   మీ సమస్య పెద్దదో, చిన్నదో తెలుసుకోండి. ఏవి చిన్న సమస్యలో, ఏవి పెద్ద సమస్యలో గుర్తించడం నేర్చుకోండి. బైబిలు ఇలా చెప్తుంది: “తెలివితక్కువవాడు తన చిరాకును వెంటనే చూపిస్తాడు, అయితే వివేకం గలవాడు అవమానాన్ని పట్టించుకోడు.” (సామెతలు 12:16) ప్రతీ చిన్న సమస్య గురించి అతిగా ఆలోచించకండి.

     “స్కూల్లో పిల్లలు చిన్న సమస్యల్ని కూడా పెద్దవి చేసి చెప్పేవాళ్లు. సోషల్‌ మీడియాలో స్నేహితులు కూడా వాళ్లను సమర్థించేసరికి, తమ సమస్య నిజంగా పెద్దదేనని ఆ పిల్లలు అనుకునేవాళ్లు. దాంతో, చిన్నచిన్న సమస్యల్ని అంత పట్టించుకోవాల్సిన అవసరం లేదనే విషయం వాళ్లు నేర్చుకోలేకపోతున్నారు.”జోయన్నా.

  •   వేరేవాళ్లను చూసి నేర్చుకోండి. బైబిల్లో ఒక సామెత ఉంది. “ఇనుము ఇనుముకు పదునుపెట్టినట్టు ఒక వ్యక్తి తన స్నేహితునికి పదునుపెడతాడు.” (సామెతలు 27:17) పెద్దపెద్ద సమస్యల్ని తట్టుకుని నిలబడిన వాళ్లను చూసి మనం ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు.

     “కొంతమందితో మాట్లాడినప్పుడు వాళ్లు ఎన్నో కష్టాల్ని అనుభవించారని, ఆ బాధ నుండి ఇప్పుడు బయటపడ్డారని మనకు అర్థమౌతుంది. వాళ్లు కోలుకోవడానికి అసలు ఏం చేశారో, ఏం చేయలేదో అడిగి తెలుసుకోండి.”జూలియా.

  •   ఓపిగ్గా ఉండండి. బైబిలు ఇలా చెప్తుంది: “నీతిమంతుడు ఏడుసార్లు పడిపోవచ్చు, కానీ అతను మళ్లీ లేస్తాడు.” (సామెతలు 24:16) పరిస్థితులు మీరు అనుకున్నట్టు ఉండవనే విషయాన్ని జీర్ణించుకోవడం అంత తేలిక కాదు, కాబట్టి ఎదురుదెబ్బలు తగిలినప్పుడు ఆశ్చర్యపోకండి. మీరు దాన్నుండి కోలుకుని మళ్లీ మామూలు మనిషి అవ్వడం ముఖ్యం.”

     “ఏదైనా బాధ నుండి తేరుకోవాలంటే ముందు మీ మనసుకు తగిలిన గాయం మానాలి, దానికి సమయం పడుతుంది. రోజులు గడిచేకొద్దీ మెల్లగా మామూలు మనిషి అవుతామని నేను తెలుసుకున్నాను.”—ఆండ్రియా.

  •   కృతజ్ఞత చూపించడం నేర్చుకోండి. బైబిలు ఇలా చెప్తుంది: “కృతజ్ఞులై ఉండండి.” (కొలొస్సయులు 3:15) మీకు ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ, సంతోషాన్నిచ్చే విషయాలు కూడా మీ జీవితంలో ఖచ్చితంగా ఉండేవుంటాయి. మీ జీవితంలో మీకు బాగా నచ్చిన మూడు విషయాల గురించి ఆలోచించండి.

     “కష్టాలు వచ్చినప్పుడు, ‘నాకే ఎందుకిలా జరగాలి?’ అనుకోవడం సర్వసాధారణం. కానీ వాటిని తట్టుకునే శక్తి కావాలంటే మీ సమస్యల గురించే ఆలోచిస్తూ కూర్చోకండి. మీకు జరిగిన మంచి విషయాల గురించి, మీరు చేయగలిగిన వాటిగురించి ఆలోచిస్తూ సంతోషంగా ఉండండి.”సమంత.

  •   సంతృప్తిగా జీవించడం నేర్చుకోండి. అపొస్తలుడైన పౌలు ఇలా చెప్పాడు: “నా పరిస్థితులు ఎలా ఉన్నా సంతృప్తిగా ఉండడం నేను నేర్చుకున్నాను.” (ఫిలిప్పీయులు 4:11) సమస్యల్ని తప్పించుకోవడం పౌలు చేతుల్లో లేదు. అవి వచ్చినప్పుడు ఏం చేయాలనేది మాత్రమే ఆయన చేతుల్లో ఉంది. ఎలాంటి పరిస్థితుల్లోనైనా తృప్తిగా జీవించాలని పౌలు నిర్ణయించుకున్నాడు.

     “ఏదైనా సమస్య రాగానే నేను స్పందించే తీరు సరైనది కాదని నాకర్థమైంది. ఎలాంటి పరిస్థితి ఎదురైనా కంగారు పడకుండా ఉండాలనే లక్ష్యం పెట్టుకున్నాను. అలా ఉంటే, నాకే కాదు నా చుట్టూ ఉన్నవాళ్లకు కూడా మంచిది.”—మాథ్యూ.

  •   ప్రార్థించండి. బైబిలు ఇలా చెప్తుంది: “నీ భారం యెహోవా మీద వేయి, ఆయనే నిన్ను ఆదుకుంటాడు. నీతిమంతుల్ని ఆయన ఎన్నడూ పడిపోనివ్వడు.” (కీర్తన 55:22) ప్రార్థన కేవలం మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి చేసేది కాదు. ‘మీ మీద శ్రద్ధ చూపించే’ మీ సృష్టికర్తతో మనసువిప్పి మాట్లాడడం.—1 పేతురు 5:7.

     “నేను ఒక్కణ్ణే సతమతమవ్వాల్సిన అవసరం లేదు. దేవునికి చేసే ప్రార్థనల్లో నా సమస్యలన్నిటి గురించి ప్రస్తావిస్తాను, నన్ను దీవించినందుకు కృతజ్ఞతలు చెప్తాను. అలా చేయడం ద్వారా నాకున్న సమస్యల మీద, బాధల మీద కాకుండా దేవుడు నాకిచ్చిన ఆశీర్వాదాల మీదే మనసు పెట్టగలుగుతున్నాను. నిజంగా, ప్రార్థించడం చాలా ప్రాముఖ్యం!”కార్లోస్‌.

a థామస్‌ కర్‌స్టిన్‌ రాసిన డిస్‌కనెక్టెడ్‌ పుస్తకంలోనిది.

b ద గుడ్‌ టీన్‌—రెస్కూయింగ్‌ అడోలొసెన్స్‌ ఫ్రమ్‌ ద మిత్స్‌ ఆఫ్‌ ద స్ట్రామ్‌ అండ్‌  స్ట్రెస్‌ ఇయర్స్‌ పుస్తకంలోనిది.