కంటెంట్‌కు వెళ్లు

యువత అడిగే ప్రశ్నలు

నేను ఎక్కువమంది స్నేహితుల్ని చేసుకోవాలా?

నేను ఎక్కువమంది స్నేహితుల్ని చేసుకోవాలా?

 “నా ఫ్రెండ్స్‌తో ఉండడమే నాకు చాలా హాయిగా అనిపిస్తుంది. వాళ్లు కాకుండా ఇతరులతో ఉండడం నాకు చాలా కష్టం.”—ఆలన్‌.

 “నా దగ్గరి స్నేహితులు కొంతమందే. నాకు అలానే ఇష్టం. తెలియని వాళ్ల దగ్గరికి వెళ్లి మాట్లాడడం నావల్ల కాదు.”​—సారా.

 మీకూ ఆలన్‌, సారాలానే అనిపిస్తుందా? మీ స్నేహితుల గ్రూప్‌లో అందరూ చాలా క్లోజ్‌గా ఉంటారా? కొత్తవాళ్లతో స్నేహం చేయడం మీకు ఇబ్బందిగా అనిపిస్తుందా?

 అలాగైతే, ఈ ఆర్టికల్‌ మీ కోసమే!

 కొంతమందే ఫ్రెండ్స్‌ ఉంటే ఎలాంటి సమస్యలు ఉంటాయి?

 క్లోజ్‌ ఫ్రెండ్స్‌ కొంతమందే ఉంటే తప్పేమీ కాదు. ఎలాంటి పరిస్థితిలోనైనా వాళ్లు మీకు తోడుగా ఉంటారు. అంతేకాదు, వాళ్లతో ఉన్నప్పుడు మీరు మీలా ఉండగలరు, వాళ్లు మీ లోపాలను పట్టించుకోరు.

 “ఇతరులు మిమ్మల్ని ఇష్టపడడం, మీకూ ఒక ఫ్రెండ్స్‌ గ్రూప్‌ ఉండడం బాగుంటుంది. యౌవనంలో అందరితో కలిసిపోవాలనిపిస్తుంది.”—కారెన్‌, 19.

 మీకు తెలుసా? యేసుకున్న చాలామంది స్నేహితుల్లో 12 మంది అపొస్తలులు కూడా ఉన్నారు. అయితే అపొస్తలుల్లో పేతురు, యాకోబు, యోహాను ఆయనకు దగ్గరి స్నేహితులు.—మార్కు 9:2; లూకా 8:51.

 కేవలం కొద్దిమంది స్నేహితులతోనే ఉంటూ, వేరేవాళ్లను అస్సలు పట్టించుకోకపోతే సమస్యలు రావచ్చు. ఉదాహరణకు:

  •   మీరు వేరే మంచి ఫ్రెండ్స్‌ని కోల్పోవచ్చు.

     “మీలా ఉండే కొందరితోనే స్నేహం చేయడంవల్ల కొత్త అనుభవాలను రుచిచూసే అవకాశాన్ని, మంచి వాళ్లతో స్నేహం చేసే అవకాశాన్ని పోగొట్టుకుంటారు.”—ఇవన్‌, 21.

  •   మీరు పొగరుబోతులని ఇతరులు అనుకోవచ్చు.

     “మీరు ఒక గ్రూప్‌లో ఉంటూ ఇతరులను కలుపుకోకపోతే, మీకు వేరేవాళ్లతో మాట్లాడడం ఇష్టంలేదని చూసేవాళ్లు అనుకుంటారు.”—సారా, 17.

  •   మీరు ఇతరులను ఏడ్పించే పరిస్థితులు తలెత్తవచ్చు.

     “ఒంటరిగా ఇతరుల్ని ఏడ్పించకపోవచ్చు, కానీ మీ గ్రూప్‌లో ఫ్రెండ్స్‌ అందరూ ఒకర్ని ఏడ్పిస్తే అది ఫర్లేదనిపిస్తుంది. సరదాగా కూడా అనిపించే అవకాశం ఉంది.”—జేమ్స్‌, 17.

  •   మీరు సమస్యల్లో చిక్కుకోవచ్చు. ముఖ్యంగా, మీరు ఆ గ్రూప్‌లో ఉండడం కోసం ఏదైనా చేయడానికి రెడీగా ఉంటే మీరు ప్రమాదంలో పడే అవకాశం ఉంది.

     “చాలా క్లోజ్‌గా తిరిగే స్నేహితుల గ్రూప్‌లో ఒక్క చెడ్డ వ్యక్తి ఉంటే చాలు, అందరూ చెడ్డ పనులు చేసే అవకాశం ఉంది.”—మార్టీనా, 17.

 మీరేమి చేయవచ్చు?

  •   మీ విలువలను పరిశీలించుకోండి.

     మిమ్మల్ని మీరు ఇలా ప్రశ్నించుకోండి: ‘నా జీవితంలో నేను ఎలాంటి విలువలను పాటించడానికి ప్రయత్నిస్తున్నాను? ఆ విలువలకు కట్టుబడి ఉండడానికి నా ఫ్రెండ్స్‌ నాకు సహాయం చేస్తారా లేదా అడ్డుపడతారా? ఎలాంటి పరిస్థితులు వచ్చినాసరే వాళ్లతో స్నేహం కొనసాగించడానికి నేను దేనికైనా తెగిస్తానా?’

     బైబిలు సూత్రం: “చెడు సహవాసాలు మంచి నైతిక విలువల్ని పాడుచేస్తాయి.”—1 కొరింథీయులు 15:33, అధస్సూచి.

     “మీకున్న విలువలను పట్టించుకోని వాళ్లు మీ ఫ్రెండ్స్‌ గ్రూప్‌లో ఉంటే, మీకు తెలియకుండానే చేయకూడనివి కూడా చేసేస్తారు.”—ఎలన్‌, 14.

  •   మీకు ఏది ముఖ్యమో పరిశీలించుకోండి.

     మిమ్మల్ని మీరు ఇలా ప్రశ్నించుకోండి: ‘నా ఫ్రెండ్స్‌ గ్రూప్‌ని కాపాడడానికి నేను నా విలువల్ని కూడా పక్కన పెట్టేయడానికి రెడీనా? నా ఫ్రెండ్‌ ఏదైనా తప్పు చేస్తే నేనేం చేస్తాను?’

     బైబిలు సూత్రం: “నేను ప్రేమించే వాళ్లందర్నీ గద్దిస్తాను.”—ప్రకటన 3:19.

     “ఏది ఎక్కువ ముఖ్యమో మీరు తేల్చుకోలేకపోతే, మీ గ్రూప్‌లో ఒకరు ఏదైనా పెద్ద తప్పు చేసినా దాని గురించి పెద్దవాళ్లకు చెప్పడం నమ్మకద్రోహం చేసినట్లు అనిపించవచ్చు.”—మెలనీ, 22.

  •   కొత్తవాళ్లతో స్నేహం చేయండి.

     మిమ్మల్ని మీరు ఇలా ప్రశ్నించుకోండి: ‘కొత్తవాళ్లతో కూడా ఫ్రెండ్‌షిప్‌ చేసి ఎక్కువ ఫ్రెండ్స్‌ని చేసుకుంటే ఏమైనా ప్రయోజనాలు ఉన్నాయా?’

     బైబిలు సూత్రం: “మీ గురించి మాత్రమే ఆలోచించుకోకుండా ఇతరుల మీద కూడా శ్రద్ధ చూపిస్తూ ఉండండి.”—ఫిలిప్పీయులు 2:4.

     “ఎక్కువ ఫ్రెండ్స్‌లేని కొంతమంది పిల్లలకు ఇంట్లో పరిస్థితులు బాగోకపోవచ్చు. కానీ ఒక్కసారి పరిచయం చేసుకుని వాళ్లకు దగ్గరైతే వాళ్లు చాలా మంచివాళ్లని, వాళ్లకు కూడా మంచి లక్షణాలు ఉన్నాయని తెలుస్తుంది.”—బ్రైన్‌, 19.

 ఒక్కమాటలో: మీ ఫ్రెండ్స్‌ అందరూ ఒక గ్రూప్‌గా క్లోజ్‌గా తిరిగితే తప్పేమీ కాదు. కానీ, అదే సమయంలో కొత్తవాళ్లతో కూడా ఫ్రెండ్‌షిప్‌ చేసుకుంటే మీరు చాలా ప్రయోజనాలు పొందుతారు. బైబిలు ఇలా చెప్తుంది: “ఇవ్వడం అలవాటు చేసుకోండి, అప్పుడు ప్రజలు మీకు ఇస్తారు.”—లూకా 6:38.