కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

బైబిలు జీవితాలను మారుస్తుంది

“నన్ను చాలామంది ఈసడించుకునేవాళ్లు”

“నన్ను చాలామంది ఈసడించుకునేవాళ్లు”
  • జననం: 1978

  • దేశం: చిలీ

  • ఒకప్పుడు: చాలా క్రూరుణ్ణి

నా గతం:

నేను పెరిగింది, చిలీ రాజధాని శాంటియాగోలో. మాదకద్రవ్యాల వాడకం, రౌడీ ముఠాలు, నేరాల లాంటివన్నీ అక్కడ చాలా మామూలు విషయాలు. నాకు ఐదేళ్లప్పుడు మా నాన్న హత్యకు గురయ్యాడు. ఆ తర్వాత మా అమ్మ మరో వ్యక్తితో కలిసి జీవించడం మొదలుపెట్టింది, అతను చాలా క్రూరుడు. అమ్మను, నన్ను ఎప్పుడూ కొడుతుండేవాడు. అప్పుడు నా మనసుకైన గాయాలు ఇప్పటికీ చెరిగిపోలేదు.

ఆ చెడు ప్రభావాల వల్ల, ఎదిగేకొద్దీ నేనూ చాలా క్రూరునిగా తయారయ్యాను. నేను హెవీమెటల్‌ సంగీతాన్ని వినేవాణ్ణి, బాగా తాగేవాణ్ణి, అడపాదడపా మాదకద్రవ్యాలు కూడా సేవించేవాణ్ణి. మాదకద్రవ్యాలు అమ్మేవాళ్లతో తరచూ కొట్లాడేవాణ్ణి, కొన్నిసార్లయితే వాళ్లు ఏకంగా నన్ను చంపాలని కూడా చూశారు. ఒకసారి ఓ ముఠా, పేరుమోసిన హంతకుణ్ణి కిరాయికి కుదుర్చుకొని నన్ను చంపించడానికి పథకం వేసింది. కానీ ఎలాగోలా కేవలం ఒక్క కొత్తిపోటుతో నేను తప్పించుకోగలిగాను. ఇంకోసారి, మాదకద్రవ్యాలు అమ్మేవాళ్లు కొందరు నా తలకు తుపాకి గురిపెట్టి, నన్ను ఉరితీయడానికి ప్రయత్నించారు.

తర్వాత, 1996లో నేను కారోలీనా అనే అమ్మాయి ప్రేమలోపడ్డాను. 1998లో మాకు పెళ్లయింది. మాకో బాబు పుట్టాడు. అప్పట్లో నాకున్న కోపానికి ఎక్కడ నా పెంపుడు తండ్రిలా మారి నా కుటుంబాన్ని హింసిస్తానో అనే భయం నన్ను వెన్నాడేది. ఎలాగైనా నా పద్ధతి మార్చుకోవాలని స్థానికంగావున్న ఓ రీహాబిలిటేషన్‌ సెంటర్‌కు వెళ్లాను. చికిత్స తర్వాత కూడా నాలో ఏ మార్పూ రాలేదు. చిన్నచిన్న వాటికే చిరాకుపడుతూ కోపాన్ని వెళ్లగక్కేవాణ్ణి. నా కుటుంబాన్ని బాధపెట్టకూడదంటే చావే మార్గమని మూర్ఖంగా ఆలోచించి ఆత్మహత్యకు కూడా ప్రయత్నించాను. కానీ ఆ ప్రయత్నం ఫలించలేదు, అది మంచిదైంది.

ఎన్నో ఏళ్లు నాస్తికుడిగా ఉన్న నేను, దేవుణ్ణి నమ్మాలనుకున్నాను. అందుకే, కొంతకాలం ఒక చర్చికి వెళ్లాను. అదేసమయంలో నా భార్య యెహోవాసాక్షుల దగ్గర బైబిలు సత్యాలు నేర్చుకోవడం మొదలుపెట్టింది. నేను మాత్రం యెహోవాసాక్షుల పేరు వింటేనే మండిపడేవాణ్ణి, చాలాసార్లు వాళ్లను బూతులు కూడా తిట్టాను. అప్పుడు వాళ్లు నాతో గొడవకు దిగుతారని అనుకున్నాను, కానీ అలాంటిది ఎప్పుడూ జరగలేదు.

ఒకరోజు నా భార్య బైబిలు తెరిచి, కీర్తన 83:18 చదవమని నాతో అంది. దేవుని పేరు యెహోవా అని ఆ లేఖనం స్పష్టంగా చెబుతుంది. ఆశ్చర్యమేమిటంటే, నేను వెళ్లే చర్చిలో దేవుని గురించి చెప్పేవాళ్లు తప్ప యెహోవా గురించి చెప్పేవాళ్లు కాదు. 2000వ సంవత్సరం ఆరంభంలో నేను కూడా సాక్షుల దగ్గర బైబిలు సత్యాలు నేర్చుకోవడం మొదలుపెట్టాను.

బైబిలు నా జీవితాన్ని ఎలా మార్చిందంటే . . .

నేను ప్రగతి సాధించేకొద్దీ యెహోవా దయామయుడని, క్షమించే దేవుడని తెలుసుకొని ఎంతో ఊరట పొందాను. ఉదాహరణకు, నిర్గమకాండము 34:6, 7 యెహోవా గురించి ఇలా చెబుతుంది: “యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపాసత్యములుగల దేవుడు . . . ఆయన వేయి వేలమందికి కృపను చూపుచు, దోషమును అపరాధమును పాపమును క్షమించును.”

అయినాసరే, నేర్చుకున్నవాటిని పాటించడమంటే కొరకరానికొయ్యలా ఉండేది. నాకున్న వెర్రి కోపాన్ని తగ్గించుకోవడం అసాధ్యమని అనిపించేది. కానీ నా భార్య, నేను విఫలమైన ప్రతీసారి నన్ను ప్రేమగా బలపర్చేది, నా ప్రయత్నాలను యెహోవా గమనిస్తున్నాడని గుర్తుచేసేది. ఇక నేను మారనని అనిపించినప్పుడు కూడా, వెన్ను తట్టి ధైర్యం చెప్పేది. ఆమె ప్రోత్సాహం వల్ల, యెహోవాను సంతోషపెట్టాలనే నా ప్రయత్నాలు మానుకోలేదు.

ఒకరోజు, నాకు బైబిలు సత్యాలు నేర్పించే ఆలేహాండ్రో అనే సహోదరుడు నన్ను గలతీయులు 5:22, 23 చదవమన్నాడు. “ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము” దేవుని ఆత్మఫలంలో భాగాలని ఆ వచనాలు చెబుతున్నాయి. పరిశుద్ధాత్మ సహాయం లేకుండా మనంతట మనమే ఆ లక్షణాలను అలవర్చుకోలేమని ఆయన వివరించాడు. ఆ మాట నా ఆలోచనాతీరును పూర్తిగా మార్చేసింది!

ఆ తర్వాత నేను యెహోవాసాక్షుల పెద్ద సమావేశాల్లో ఒకదానికి వెళ్లాను. అక్కడి పద్ధతిని, శుభ్రతను, అక్కడున్న వాళ్లను చూసినప్పుడు అదే నిజమైన మతమని నా మనసుకు బలంగా అనిపించింది. (యోహాను 13:34, 35) 2001 ఫిబ్రవరిలో నేను బాప్తిస్మం తీసుకున్నాను.

నేనెలా ప్రయోజనం పొందానంటే . . .

క్రూరుడినైన నన్ను యెహోవా దేవుడు శాంతస్వభావునిగా మార్చేశాడు. నిజానికి, ఒక ఊబిలో నుండి ఆయన నన్ను బయటికి లాగాడు. అప్పట్లో నన్ను చాలామంది ఈసడించుకునేవాళ్లు, అందుకు నేను వాళ్లను తప్పుపట్టను. ఇప్పుడైతే నా భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి నేను మనశ్శాంతితో యెహోవాను సేవించగలుగుతున్నాను.

నాలో వచ్చిన ఈ పెనుమార్పు చూసి నా బంధువులు, స్నేహితులు ఎంతో ఆశ్చర్యపోయారు. వాళ్లలో కొందరు, బైబిలు సత్యాలను నేర్చుకోవడానికి ఆసక్తి కూడా చూపించారు. అంతేకాదు, యెహోవాను తెలుసుకునేలా ఇతరులకు సహాయం చేసే గొప్ప అవకాశమూ నాకు దొరికింది. బైబిలు సత్యం వాళ్ల జీవితాలను కూడా ఎలా మలుస్తోందో చూడడం చాలా సంతోషంగా ఉంది! (w13-E 10/01)