కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

కుటుంబం కోసం | తల్లిదండ్రులు

పిల్లల్ని ఎలా పొగడాలి

పిల్లల్ని ఎలా పొగడాలి

సమస్య

మీ పిల్లలను ఎంత పొగిడినా తక్కువే అని కొంతమంది అంటారు. ఎప్పుడూ పొగిడితే పిల్లలు పాడైపోతారని, అందరికంటే వాళ్లే గొప్ప, అందరూ వాళ్లు చెప్పిందే చేయాలి అన్నట్లు తయారౌతారని ఇంకొంతమంది అంటారు.

మీరు మీ పిల్లల్ని ఎంత పొగుడుతున్నారు అనే కాదు, ఎలా పొగుడుతున్నారు అని కూడా చూసుకోవాలి. ఎలా పొగిడితే మీ పిల్లలకి మంచిది? ఎలా పొగిడితే మీ పిల్లలు పాడైపోతారు? మీ పిల్లల మంచి భవిష్యత్తు కోసం మీరు వాళ్లను ఎలా మెచ్చుకోవచ్చు?

మీరు తెలుసుకోవాల్సినవి

ఎలా పొగిడినా ఒకటేనా? వీటి గురించి ఆలోచించండి:

మరీ ఎక్కువగా పొగడడం మంచిది కాదు. పిల్లల ఆత్మగౌరవం పెంచే ప్రయత్నంలో కొంతమంది తల్లిదండ్రులు అనవసరంగా పొగుడుతూ ఉంటారు. ఈ విషయం గురించి డాక్టర్‌ డేవిడ్‌ వాల్ష్‌ ఇలా చెప్తున్నాడు: “పిల్లలు చాలా తెలివైనవాళ్లు, మరీ ఎక్కువ పొగిడినా కనిపెట్టేస్తారు. ఊరికే పొగుడుతున్నారని వాళ్లకు తెలిసిపోతుంది. ఆ పొగడ్తలన్నీ వట్టివే అని, మిమ్మల్ని నమ్మలేమనే నిర్ణయానికి పిల్లలు వచ్చేస్తారు.” a

వాళ్లకున్న సామర్థ్యాన్ని బట్టి పొగిడితే మంచిదే. మీ పాప బొమ్మలు బాగా గీస్తుంది అనుకోండి. ఆమెకున్న ఈ సామర్థ్యాన్ని మీరు సాధారణంగా మెచ్చుకుంటారు. అప్పుడు ఆమె ఇంకా బాగా బొమ్మలు గీయడానికి ప్రయత్నిస్తుంది. కానీ ఇలా చేస్తే నష్టం కూడా జరగవచ్చు. ఆమెలో సహజంగా ఉన్న సామర్థ్యాలనే పొగుడుతూ ఉంటే, సహజంగా సులువుగా వస్తున్నాయి కాబట్టి వాటిని చేస్తేనే మంచిది అనే నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. ఏవైనా కొత్తవి చేయాల్సి వచ్చినప్పుడు సరిగ్గా చేయలేను అనే భయంతో ఆమె ప్రయత్నించకపోవచ్చు. ‘ఏదైనా చేయడానికి కొంచెం కష్టంగా ఉంటే నాకు ఆ సామర్థ్యం లేదు కాబట్టి నేను చేయలేను, అలాంటప్పుడు నేనెందుకు ప్రయత్నించాలి?’ అని ఆమె అనుకోవచ్చు.

కష్టపడినందుకు పొగిడితే ఇంకా మంచిది. సామర్థ్యం లేదా కళను బట్టి కాకుండా కష్టపడినందుకు, పట్టుదల చూపించినందుకు పిల్లల్ని పొగిడితే వాళ్లు ఒక ప్రాముఖ్యమైన విషయం నేర్చుకుంటారు. అదేంటంటే ఏదైన సాధించాలంటే ఓపిగ్గా కష్టపడాలి. ఇది తెలిస్తే పిల్లలు “దానికోసం కష్టపడతారు. సాధించలేకపోయినా ‘మేము చేతకానివాళ్లం’ అని అనుకోరు గాని నేర్చుకోవాలని అనుకుంటారు,” అని లెటింగ్‌ గో విత్‌ కాన్‌ఫిడెన్స్‌ అనే పుస్తకం చెప్తుంది.

ఏమి చేయవచ్చు

సామర్థ్యాలనే కాదు, వాళ్ల కష్టాన్ని కూడా పొగడండి. “నీలో సహజంగానే బొమ్మలు గీసే కళ ఉంది,” అని చెప్పడం కన్నా “చాలా కష్టపడి చక్కగా గీస్తున్నావు,” అని చెప్తే మంచిది. రెండూ పొగడ్తలే కానీ మొదటి దాని వల్ల, వాళ్ల సామర్థ్యాలను బట్టే ఏదైనా చేయగలరు అనే తప్పు ఆలోచనను మీకు తెలియకుండానే మీరు మీ పిల్లల మనసులో పెడుతున్నారు.

వాళ్ల కష్టాన్ని పొగిడినప్పుడు ఎంత ఎక్కువ ప్రాక్టిస్‌ చేస్తే అంత ఎక్కువ సామర్థ్యం పెరుగుతుందని మీరు మీ పిల్లలకు నేర్పించినట్టే. అప్పుడు కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఇంకా ధైర్యంగా ముందుకు వస్తారు.—మంచి సలహా: సామెతలు 14:23.

పొరపాట్లు చేసినప్పుడు ఏం చేయాలో మీ పిల్లలకు నేర్పించండి. మంచివాళ్లు కూడా తప్పులు చేస్తుంటారు, నిజానికి చాలాసార్లు చేస్తుంటారు. (సామెతలు 24:16) కానీ తప్పు చేసిన ప్రతీసారి అలానే ఉండిపోరు, జరిగిన దాని నుండి నేర్చుకుని, ముందుకు వెళ్తారు. అలా చక్కగా ఆలోచిస్తూ మీ పిల్లలు ముందుకు వెళ్లాలంటే మీరు ఏం చేయాలి?

మీరు వాళ్లు చేసే కృషినే మెచ్చుకోవాలి. ఉదాహరణకు: మీరు ఎప్పుడూ మీ పాపతో “నీకు పుట్టుకతోనే మాత్స్‌ వచ్చు,” అని చెప్తున్నారు అనుకుందాం. అయితే ఆమె ఒకసారి మాత్స్‌ పరీక్షలో ఫెయిల్‌ అయింది. అప్పుడు మీరు చెప్పిన మాటలను బట్టి “నాకు మాత్స్‌ చేసే సామర్థ్యం పోయింది. నేను ఇంక ప్రయత్నించినా లాభం లేదు,” అనుకునే ప్రమాదం ఉంది.

కానీ మీరు ఆమె చేసే కృషిని మెచ్చుకుంటే, ఆమెకు ఓపికగా ఉండడం నేర్పిస్తారు. అలా మెచ్చుకుంటే పొరపాటును పొరపాటుగానే చూస్తుంది గానీ ఏదో పెద్ద ఘోరం జరిగినట్లు అనుకోదు. అప్పుడు ఆమె ప్రయత్నించడం ఆపేయకుండా వేరే విధంగా ప్రయత్నిస్తుంది లేదా ఎక్కువ కష్టపడుతుంది.—మంచి సలహా: యాకోబు 3:2.

సరిచేయడం కూడా అవసరమే. పిల్లలకు రాని వాటి గురించి లేదా చేయలేని వాటి గురించి సరైన విధంగా చెప్తే వాళ్లు కృంగిపోరు. మీరు సరైన విధంగా పొగుడుతూ ఉంటే, పొగిడినప్పుడే కాదు, నేర్చుకోమని చెప్పినప్పుడు కూడా పిల్లలు చక్కగా వినే అవకాశం ఉంది. అప్పుడు మీ పిల్లలు సాధించేవి మీకు, వాళ్లకు ఎంతో సంతోషాన్ని, సంతృప్తిని ఇస్తాయి. —మంచి సలహా: సామెతలు 13:4. ◼ (g15-E 11)

a నో: వై కిడ్స్‌—ఆఫ్‌ ఆల్‌ ఏజెస్‌—నీడ్‌ టు హియర్‌ ఇట్‌ అండ్‌ వేస్‌ పేరెంట్స్‌ కెన్‌ సే ఇట్‌ పుస్తకం నుండి తీసుకున్న మాటలు.