కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అంతం

అంతం

అంతం

“లోకమును దాని ఆశయు గతించిపోవుచున్నవి,” అని 1 యోహాను 2:17⁠లో ఉంది. ఇక్కడ చెప్పిన ‘లోకం’ అంటే ఏంటి? అది ఎప్పుడు, ఎలా గతించిపోతుంది లేదా అంతమౌతుంది?

అంతం అయ్యే ‘లోకం’ ఏంటి?

దేవుడు ఏమంటున్నాడు . . .

దేవునికి ఇష్టంలేని ఆశలు ఈ లోకంలో ఉన్నాయి. భూమికి ఆశలు ఉండవు. కాబట్టి లోకం అంటే దేవున్ని పట్టించుకోకుండా ఆయన శత్రువులుగా మారుతున్న మనుషులు. (యాకోబు 4:4) ఆ లోకం లేదా ఆ మనుషులు “నిత్యనాశనమను దండన” పొందుతారు. (2 థెస్సలొనీకయులు 1:7-9) అయితే యేసు చెప్పిన మాటలకు లోబడుతూ ‘లోకసంబంధులుగా’ ఉండనివాళ్లు నిత్యజీవం పొందుతారు.—యోహాను 15:19.

ఈ విషయం గురించి 1 యోహాను 2:17 చివర్లో ఇలా ఉంది, “దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును.” అలాంటివాళ్లే ఈ భూమ్మీద నిత్యం జీవిస్తారు. దీని గురించి కీర్తన 37:29⁠లో ఇలా ఉంది: “నీతిమంతులు భూమిని స్వతంత్రించుకొందురు వారు దానిలో నిత్యము నివసించెదరు.”

“ఈ లోకమునైనను లోకములో ఉన్నవాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించినయెడల తండ్రి ప్రేమ వానిలో నుండదు.”1 యోహాను 2:15.

ఈ లోకం ఎలా అంతమౌతుంది?

దేవుడు ఏమంటున్నాడు . . .

అంతం రెండు ముఖ్యమైన దశల్లో వస్తుంది. మొదటి దశలో దేవుడు అబద్ధ మతాలన్నిటినీ నాశనం చేస్తాడు. వాటిని “మహా బబులోను” అనే పేరున్న వేశ్యతో పోల్చారు. (ప్రకటన 17:1-5; 18:8) దేవుని మీద భక్తి ఉందని చెప్పుకుంటూనే ఆ వేశ్య ఈ ప్రపంచంలో ఉన్న రాజకీయ నాయకులతో సంబంధాలు పెట్టుకుంది. కానీ, ఈ నాయకులే ఆమె మీద తిరగబడతారు. వాళ్లు “ఆ వేశ్యను ద్వేషించి, దానిని దిక్కులేనిదానిగాను దిగంబరిగాను చేసి, దాని మాంసము భక్షించి అగ్నిచేత దానిని బొత్తిగా కాల్చివేతురు.”—ప్రకటన 17:16.

తర్వాత, దేవుడు ఆ రాజకీయ నాయకులపై అంటే “లోకమంతట ఉన్న” రాజులపై దృష్టి పెడతాడు. వీళ్లతోపాటు చెడ్డ ప్రజలందరు “హార్‌మెగిద్దోను” లేదా “సర్వాధికారియైన దేవుని మహాదినమున జరుగు యుద్ధము” ద్వారా నాశనం అవుతారు.—ప్రకటన 16:14,16.

‘దేశములో సాత్వికులైన . . . సమస్త దీనులారా, యెహోవాను వెదకుడి; . . . నీతిని అనుసరించినయెడల ఒకవేళ ఆయన ఉగ్రత దినమున మీరు దాచబడుదురు.’జెఫన్యా 2:3.

ఈ లోకం ఎప్పుడు అంతమౌతుంది?

దేవుడు ఏమంటున్నాడు . . .

ప్రపంచంలో ఉన్న ప్రభుత్వాలకు బదులుగా దేవుని ప్రభుత్వం వస్తుంది. దాని గురించి అందరూ తెలుసుకునేలా దేవుడు సమయాన్ని ఇస్తాడు. (దానియేలు 7:13, 14) యేసు క్రీస్తు ఇలా అన్నాడు: “మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకమందంతటను ప్రకటింపబడును; అటుతరువాత అంతము వచ్చును.” (మత్తయి 24:14) ఈ ప్రకటన పని వెనుక దేవుని న్యాయం, దయ కనిపిస్తాయి. దేవుడు ఆపేయమని చెప్పేంత వరకు ఈ పని జరుగుతుంది. అప్పుడు అంతం వస్తుంది. అంతే కాకుండా అంతం రాబోయే ముందు పెద్దపెద్ద యుద్ధాలు, భూకంపాలు, కరువులు, రోగాలు లాంటివి కూడా ఉంటాయని యేసు చెప్పాడు.—మత్తయి 24:3; లూకా 21:10, 11.

ప్రపంచంలో జరిగే పెద్దపెద్ద సంఘటనలు గురించే కాకుండా అప్పుడు మనుషులు ఎలా ఉంటారో కూడా బైబిల్లో ఉంది. “అపాయకరమైన కాలములు వచ్చునని తెలిసికొనుము. ఏలాగనగా మనుష్యులు స్వార్థప్రియులు ధనాపేక్షులు, . . . తలిదండ్రులకు అవిధేయులు, . . . అజితేంద్రియులు క్రూరులు సజ్జనద్వేషులు, . . . దేవునికంటే సుఖానుభవము నెక్కువగా ప్రేమించువారు,” అని ఉంది. a2 తిమోతి 3:1-5.

ఇప్పుడున్న చెడ్డ లోకం త్వరలో అంతమౌతుంది లేదా ‘గతించిపోతుంది.’—1 యోహాను 2:17

1914⁠లో మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో ఈ పరిస్థితులు కనిపించడం మొదలయ్యాయి. ఆ సంవత్సరం నుండి దేవుని రాజ్యం గురించిన వార్త ప్రపంచ నలు దిక్కులకు వ్యాపించింది. ఇలా ప్రకటిస్తున్నారనే పేరు ఉన్నందుకు యెహోవాసాక్షులు ఎంతో గర్విస్తున్నారు. వాళ్ల ముఖ్య పత్రిక పేరు కూడా ఇదే: కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది. “ఆ దినమైనను గడియయైనను మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి.”మత్తయి 25:13.◼ (g15-E 11)

a ఎక్కువ సమాచారం కోసం, యెహోవాసాక్షులు ప్రచురించిన బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది? పుస్తకంలో 9వ అధ్యాయం చూడండి. ఈ పుస్తకం www.mt711.com/te వెబ్‌సైట్‌లో కూడా ఉంది.